కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ దెబ్బకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కోలుకోలేకుండ దెబ్బతిన్నాయని గ్లోబల్ అలయెన్స్ ఆఫ్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (గేమ్) రూపొందించిన నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి, లాక్‌డౌన్ దెబ్బకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కోలుకోలేకుండ దెబ్బతిన్నాయని గ్లోబల్ అలయెన్స్ ఆఫ్ మాస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (గేమ్) రూపొందించిన నివేదిక వెల్లడించింది. కొవిడ్ -19 వల్ల ఎంఎస్‌ఎంఈల లాభాలు రూ.1.2 లక్షల కోట్ల వరకు హరించుకుపోయినట్లు తెలిపింది. గేమ్‌కు నేతృత్వం వహించిన మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ హెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ చైర్మన్ రవి వెంకటేశన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు.
రూ.75 కోట్ల నుంచి రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన ఈ ఎంఎస్‌ఎంఈలను మళ్లీ గాడిలో పెట్టి కొత్తగ ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకమైన రోడ్‌మ్యా్‌పను సిద్ధం చేయాలని నివేదిక సూచించింది. అంతేకాకుండా నిబంధనల కుదింపు, ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక ఆర్థిక జోన్లు, ప్రైవేట్ యాంకర్ ఇన్వెస్టర్లను ఆకర్షించటం, ఎంఎస్‌ఎంఈ-బ్యాంక్ భాగస్వామ్యాలను సత్వరమే అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేసింది.
కరోనా వల్ల ఎంఎస్‌ఎంఈల ఆర్డర్లు 73 శాతం మేరకు తగ్గాయని నివేదిక తెలిపింది. కాగా 50 శాతం సంస్థలు మాత్రం ఇన్వెంటరీ స్థాయిలు కేవలం 15 శాతం పెరిగినట్లు వెల్లడించాయన్నది. డిమాండ్ పడిపోవటం, సరఫరా వ్యవస్థకు విఘాతం కలగటంతో పాటు బకాయిలు వసూలు కాకపోవటం వంటి అంశాలు కూడా సంస్థల పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయని తెలిపింది.
ఈ కారణాలతో ఎంఎస్‌ఎంఈల లాభాలు దాదాపు రూ.80,000 కోట్ల నుంచి రూ.1.2 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయాయంది. స్వల్ప కాలంలో ఈ సంస్థలు మళ్లీ వృద్ధి బాట పట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎంఎస్‌ఎంఈలకు ‘ఎస్బీఐ’ ఈ-కామర్స్ పోర్టల్
దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ప్రత్యేక ఈ-కామర్స్ పోర్టల్‌ను ఏర్పాటు చేసేయోచనలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉన్నది. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంక్ చైర్మన్ రజనీశ్ కుమార్ శనివారం తెలిపారు.
‘భారత్ క్రాఫ్ట్' పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ పోర్టల్‌ను బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడుతూ..ఈ పోర్టల్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు.
‘భారత్ క్రాఫ్ట్’ అనే పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ పోర్ట్ సామాన్యుడికి ఉపయోగపడే విధంగా ఉండాలనేదానిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రజనీష్ కుమార్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఎంఎస్‌ఎంఈ రంగంలో 11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, వచ్చే ఐదేండ్లకాలంలో 15 కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నదని కుమార్ వెల్లడించారు.
