ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అత్యంత మాతృదేశాభిమానం కలిగిన బ్రాండ్ అని తేలింది. బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రిసెర్చ్-డేటా అనలిటిక్స్ సంస్థ యూగౌవ్ ఓమ్నీబస్ నిర్వహించిన సర్వేలో అత్యధిక భారతీయులు ఎస్బీఐపై అభిమానం చూపారు.
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) అత్యంత మాతృదేశాభిమానం కలిగిన బ్రాండ్ అని తేలింది. బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రిసెర్చ్-డేటా అనలిటిక్స్ సంస్థ యూగౌవ్ ఓమ్నీబస్ నిర్వహించిన సర్వేలో అత్యధిక భారతీయులు ఎస్బీఐపై అభిమానం చూపారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు వెల్లడైన ఈ జాబితాలో 16 శాతంతో ఎస్బీఐ ముందున్నది. ఆ తర్వాత టాటా మోటార్స్, పతంజలికి 8 శాతం చొప్పున, రిలయన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 6 శాతం చొప్పున ఓట్లు లభించాయి.
ఎస్బీఐ తర్వాత పేటీఎం పట్ల ప్రజాభిమానం
ఆర్థిక, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్, ఆహార, టెలికం తదితర 11 రంగాల్లోని 152 బ్రాండ్లపై సర్వే జరిగింది. ఈ నెల 2 నుంచి 8 వరకు ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 1,193 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయా రంగాలవారీగా చూస్తే ఆర్థిక రంగంలో ఎస్బీఐకి 47 శాతం ఓట్లు పడ్డాయి. 16 శాతంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తర్వాత స్థానంలో ఉన్నది. పేటీఎంకూ మిక్కిలి ప్రజాభిమానం లభించింది.
ఆటోమొబైల్ రంగంలో టాటామోటార్స్ పైచేయి
ఆటో రంగంలో టాటా మోటార్స్ 30 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో 13 శాతంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం, 11 శాతంతో మారుతి సుజుకీ నిలిచాయి. ఆహారోత్పత్తుల బ్రాండ్లలో అమూల్ మొదటి స్థానంలో ఉండగా, పతంజలి ఆ తర్వాతి స్థానంలో ఉన్నది. అయితే కన్జ్యూమర్ గూడ్స్‌లో పతంజలిదే పైచేయి. పర్సనల్ కేర్ విభాగంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు పతంజలిపై స్వదేశీ అభిమానం చూపారు. డాబర్, వీకో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. టూత్‌పేస్ట్‌ల్లో కాల్గేట్‌కు విశేష అభిమానులుండగా, డాబర్, వీకో ఆ తర్వాత ఉన్నాయి.
టెలికంలో ముకేశ్ అంబానీ జియో ఆధిపత్యం
ఇక టెలికం రంగంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జీ సేవల సంస్థ రిలయన్స్ జియోదే ఆధిపత్యం. 41 శాతం ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్.. జియో తర్వాతి స్థానంతో సరిపెట్టుకున్నది. కాగా, హోమ్‌కేర్ ప్రోడక్ట్స్ విభాగంలో నిర్మాకు పట్టం కట్టిన భారతీయులు.. బేవరేజెస్ కేటగిరీలో 35 శాతంతో టాటా టీని మొదటి స్థానంలో నిలబెట్టారు. తాజ్ మహల్ బ్రాండ్‌కు 18 శాతం ఓట్లు వచ్చాయి.
పిచాయ్ అంటనే ప్రియం
తాజా సర్వేలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ని అత్యధికులు ఇష్టపడ్డారు. ఈ భారత సంతతి సీఈవో చెన్నైకి చెందినవారని తెలిసిందే. ఇక ఆ తర్వాత లైకులు పొందినవారిలో మాజీ మిస్ వరల్డ్, నటి, గాయని ప్రియాంకా చోప్రా ఉన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ మూడో స్థానంలో ఉండగా, ఎన్నారై ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగో స్థానంలో, మైక్రోసాఫ్ట్ సీఈవో, తెలుగువారైన సత్య నాదెళ్ల ఐదో స్థానంలో ఉన్నారు.
అలహాబాద్ ఎండీ ఉషకు ఉద్వాసన
ప్రభుత్వరంగ సంస్థ అలహాబాద్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఉషా అనంత సుబ్రమణ్యన్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ.14,000 కోట్ల కుంభకోణంలో ఆమె అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్కార్ తాజా చర్యతో ఓ ఉన్నతస్థాయి బ్యాంకర్‌పై తొలి వేటు పడినైట్లెంది. 2011 జూలై నుంచి 2013 నవంబర్‌దాకా పీఎన్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన ఉషా అనంత సుబ్రమణ్యన్ 2015 ఆగస్టు నుంచి 2017 మే వరకు బ్యాంక్ ఎండీ, సీఈవోగా కూడా కొనసాగారు. ఈమె హయాంలోనే స్కాం జరుగడం, సీబీఐ చార్జిషీట్‌లో పేరుండటం ఉషాను కొలువుకు దూరం చేసింది. నిజానికి మూడు నెలల క్రితమే అలహాబాద్ బ్యాంక్‌లో ఉషాకున్న అన్ని అధికారాలను వెనుకకు తీసుకున్నారు. తాజాగా మొత్తం సర్వీసు నుంచే తప్పించారు.
ఉష విచారణకు సీబీఐకి అనుమతి ఇలా
ఇక ఉషా అనంత సుబ్రమణ్యన్‌ను విచారించడానికి సీబీఐకి కేంద్రం అనుమతినిచ్చింది. పీఎన్బీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ శరణ్‌పైనా విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్బీఐ కూడా విచారణకు ఆమోదం తెలుపగా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ ఎస్ సంగపురేను కూడా విచారిం చాలని ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు ఉషా విచారణకు రాష్ట్రపతి ఆమోదాన్ని అందుకున్నా మని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టంచేసింది. విచారణ కోసం త్వరలోనే ఉషా కోర్టుకు రావాల్సి ఉంటుందన్న న్యాయమూర్తి.. బెయిల్‌కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. నీరవ్ మోదీ, ఆయన మేనమామ, గీతాంజలి జెమ్స్ అధినేత మెహుల్ చోక్సీలు పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. పీఎన్‌బీ ఫిర్యాదుతో ఈ ఫిబ్రవరి 15న సీబీఐ కేసు నమోదు చేయగా, మేలో ముంబై సెషన్స్ కోర్టులో చార్జిషీటును దాఖలు చేసింది. పలు సంస్థలు, మరికొందరి పేర్లను ఇందులో సీబీఐ పేర్కొన్నది. వీరిలో ఉషాతోపాటు పీఎన్‌బీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టైర్లెన బ్రహ్మాజీ రావు, సంజీవ్ శరణ్‌లు ఉన్నారు. ఉషాకు, ఇతర ఉన్నతాధికారులకు ఈ మోసం గురించి తెలుసని, కానీ ఆపడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని తమ చార్జిషీటులో ఆరోపించింది. ముఖ్యంగా ఉషా సూచనలు లేకుం డా ఆమె కిందిస్థాయి ఉద్యోగులు నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదన్నది.
