యస్ బ్యాంక్‌లో వాటా...రూ.2490 కోట్లు కాదు.. రూ.10 వేల కోట్లు...
యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు విషయమై ఎస్బీఐ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. 49 శాతం వాటాలు కొనుగోలు చేస్తామని తెలిపిన ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ప్రాథమికంగా రూ.2400 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. మొత్తం యెస్ బ్యాంకులో రూ.10 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘యస్’ బ్యాంక్‌లోని వాటా కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆర్బీఐ ఇప్పటికే దీనిపై ఓ ప్రతిపాదన ప్రణాళికను సిద్థం చేసి ఇచ్చిన నేపథ్యంలో ఎస్‌బీఐ చైర్మెన్ రజనీష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకులో 49 శాతం వాటా కొనుగోలుకు ఎస్‌బీఐ సిద్ధంగా ఉన్నదన్నారు. ఇందుకోసం రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నామన్నారు.
ఆర్బీఐ రూపొందించిన బ్యాంక్ పునర్నిర్మాణ ముసాయిదా పథకం ఎస్‌బీఐ వద్దకు చేరిందని రజనీష్ కుమార్ తెలిపారు. ఈ ముసాయిదా పథకంపై తమ పెట్టుబడి, న్యాయ విభాగం కసరత్తు చేస్తుందన్నారు. దీనికి సంబంధించిన తుది నిర్ణయాలను రెగ్యలేటరీలకు అందిస్తామని తెలిపారు.
also read ఇష్టరాజ్యంగా రుణాల మంజూరు వల్లే యెస్ బ్యాంకు కొంప ముంచింది...
ప్రాథమికంగా యెస్ బ్యాంకులో రూ.2,450 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. దీంతో ఆ బ్యాంక్‌కు కొంత మూలధనం మద్దతు లభించనుందన్నారు. రూ.2 ముఖ విలువ కలిగిన 20,000 మిలియన్ షేర్లను రూ.10 చొప్పున యస్ బ్యాంక్ జారీ చేస్తే రూ.20వేల కోట్ల విలువ చేస్తాయన్నారు. ఇందులో 49 శాతం వాటా కోసం రూ.10,000 కోట్లు ఎస్‌బీఐ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఇది ఆర్బీఐ రూపొందించిన పునర్నిర్మాణ రోడ్ మ్యాప్ ప్రణాళిక ప్రకారం యెస్ బ్యాంకులో పెట్టుబడి పెట్టనున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. తమ ప్రతిపాదనలకు మార్చి 9వ తేదీ వరకు సమయం ఉందన్నారు. ఆ లోపు ఆర్‌బీఐ ముందు ఉంచుతామన్నారు.
ఆర్బీఐ నిర్దేశించిన 30 రోజుల గడువు లోపలే యస్ బ్యాంకును రక్షించే పథకాన్ని సిద్థం చేస్తాని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు. ఇందుకు 24 గంటలూ పని చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా యస్ బ్యాంకులో నగదు పూర్తిగా భద్రంగా ఉంటుందని ఆ బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిట్ దారులకు హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ హామీ ఇచ్చిన అంశాన్ని రజ్నీష్ కుమార్ గుర్తు చేశారు.
అలాగే ఎస్‌బీఐ వాటాదారులు, వినియోగదారులపై తాజా పరిణామాల ప్రభావం ఉండబోదని అన్నారు. యస్ బ్యాంకులో ఎస్‌బీఐ వాటాలు తీసుకోవడం చాలా మంచి నిర్ణయమని యస్ బ్యాంక్ వ్యవస్థాపకులు రానా కపూర్ పేర్కొన్నారు. ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడిదారులతో చర్చలు జరిపినప్పటికీ, సరైన పునురుజ్జీవన ప్రణాళికలు లేనందునే యస్ బ్యాంక్‌లో ఆర్‌బీఐ జోక్యం చేసుకుందని అభిప్రాయపడ్డారు.
also read విచారణలో సహాయ నిరాకరణ.. ఈడీ కస్టడీలో రాణా కపూర్...?
అయితే, తమ బ్యాంకులో ‘యస్’బ్యాంక్ విలీనం ప్రసక్తే లేదని, కేవలం దాంట్లో వాటాను కొంటామని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ‘యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను ఎస్‌బీఐ కొనుగోలు చేస్తే రూ..2,400కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది.
పెట్టుబడి పథకాన్ని చూశాక 23 మంది ఇన్వెస్టర్లు ఎస్‌బీఐని సంప్రదించారు’ అని చెప్పారు. ‘యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ 49 శాతం కొంటుందా? లేక 26 శాతం తీసుకుంటుందా? అనేది ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మరికొందరు ఇన్వెస్టర్ల నుండి వచ్చిన ఆసక్తిని పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు.