వాషింగ్టన్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఎండీ అన్షులా కాంత్‌, ప్రపంచ బ్యాంక్‌ ఎండీ, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్‌పాస్‌ శుక్రవారం ఈ సంగతి చెప్పారు. ఒక భారత మహిళ అత్యంత ప్రతిష్ఠాత్మక పదవిలో నియమించబడడం ఇదే మొదటిసారి. ప్రపంచ బ్యాంక్‌ ఎండీ, సీఎఫ్ఓగా కాంత్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను పర్యవేక్షిస్తారు.

 

ఫైనాన్స్, బ్యాంకింగ్ విభాగాల్లో 35 ఏళ్లకు పైగా అనుభవం సంపాదించిన అన్షులా కాంత్.. బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీ వినియోగించుకోవడంలో ఇన్నోవేటివ్‌గా వ్యవహరిస్తారని పేరుంది. 

 

రిస్క్, ట్రెజరీ, ఫండింగ్, రెగ్యులేటరీ కంప్లియన్స్, ఆపరేషన్స్‌లో ఎదురైన నాయకత్వ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించారన్న పేరు సంపాదించుకున్న అన్షులా కాంత్‌కు తమతో కలిసి పని చేసేందుకు స్వాగతం పలుకాలని బ్యాంక్ సిబ్బందిని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ మల్‌పాస్‌ కోరారు.

 

ఇంకా అంతర్జాతీయ అభివృద్ధి సహాయ (ఐడీఏ) కార్యక్రమంతోపాటు ఇతర కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ కోసం బ్యాంక్‌ సీఈఓతో కలిసి పని చేస్తారు. రోజువారీ కార్యక్రమాలపై నిత్యం ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్‌కు నివేదించనున్నారు. 

 

ఎస్బీఐ సీఎఫ్ఓగా అన్షులా కాంత్ 38 బిలియన్ డాలర్ల ఆదాయ లావాదేవీలను నిర్వహించారు. మొత్తం బ్యాంక్ ఆస్తుల విలువ రూ.500 బిలియన్ల డాలర్లు ఉంటుంది. 2018 సెప్టెంబర్ నెలలో ఎస్బీఐ బోర్డు సభ్యురాలిగా, ఎండీగా నియమితులయ్యారు. సంస్థ విధుల నిర్వహణలో ఆమె చర్యల వల్ల క్యాపిటల్ బేస్ పెరుగడంతోపాటు దీర్ఘకాలిక సస్టెయినబిలిటీ సాధ్యమైందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. 

 

ఎస్బీఐ రిస్క్, కంప్లియన్స్, స్ట్రెస్డ్ అసెట్ పోర్ట్ పోలియో విభాగాల్లో నేరుగా బాధ్యతలు చేపట్టిన అన్షులా కాంత్ రిస్క్ మేనేజ్మెంట్‌కు సాధికారత కల్పిస్తూ పెట్టుబడి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌ ఫర్‌ ఉమెన్‌ నుంచి ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన కాంత్‌, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పీజీ పూర్తి చేశారు. 

 

1983లో ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించిన అన్షులా కాంత్.. నిబద్ధతతో కూడిన పని, కష్టపడే తత్వం గల వ్యక్తిగా సీఎఫ్ఓ, ఎండీ స్థాయికి చేరుకుందని ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. ఎస్బీఐ ముంబై చీఫ్ జనరల్ మేనేజర్‌గా, నేషనల్ బ్యాంకింగ్ గ్రూప్ ఆపరేషన్స్ డిప్యూటీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2020 సెప్టెంబర్ నెలలో రిటైర్ కానున్నారు. స్థూల మొండి బకాయిలను 7.53 శాతానికి తగ్గించి వేశారు. గతేడాది స్థూల మొండి బకాయిలు 10.91 శాతం ఉన్నాయి.