న్యూఢిల్లీ: ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ, అటు ప్రైవేట్ రంగంలో అతిపెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు తమ ప్రామాణిక రుణ రేటు/ఎంసీఎల్‌ఆర్‌ను శనివారం 20 బేసిస్ పాయింట్ల వరకు (0.2 శాతం) పెంచాయి. దీంతో గృహ, ఆటో, ఇతరత్రా రుణాలు భారం కానున్నాయి. పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ఇరు బ్యాంకులు తెలిపాయి. తాజా పెంపుతో ఎస్‌బీఐ నెలసరి వ్యవధుల ఎంసీఎల్‌ఆర్ 7.9 శాతం నుంచి 8.1 శాతానికి చేరనున్నది. ఏడాది కాలానికి 8.25 శాతం నుంచి 8.45 శాతానికి, మూడేండ్లది 8.45 శాతం నుంచి 8.65 శాతానికి చేరింది. 

ఎస్బీఐ బాటలో ఐసీఐసీఐతోపాటు ఇతర బ్యాంకులు కూడా
ఏడాది కాలపరిమితి రుణాలపై వడ్డీని 0.15 శాతం ఐసీఐసీఐ బ్యాంకు పెంచడంతో 8.5 శాతానికి చేరుకుంది. గత నెల ద్రవ్య సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పావు శాతం పెంచి 6.5 శాతానికి తీసుకెళ్లిన నేపథ్యంలో సరిగ్గా నెల రోజుల తర్వాత ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు తాజా వడ్డింపులకు దిగాయి

. మిగతా బ్యాంకర్లూ వడ్డీరేట్ల పెంపు దిశగా పయనిస్తారన్న అంచనాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఈ ఏడాది జూన్ 6న రెపో రేటును ఆర్బీఐ పావు శాతం పెంచగా, ద్రవ్యోల్బణ భయాల మధ్య ఆగస్టు 1న కూడా మరో పావు శాతం పెంచింది. వచ్చేనెలలో ఆర్బీఐ మళ్లీ ద్రవ్యసమీక్ష చేయనున్నది

రూ.2000 నోటు ముద్రణ ఖర్చు రూ.4.18
ప్రస్తుతం చలామణిలో ఉన్న ఒక్కో రూ.2,000 నోటు ముద్రణకు రూ.4.18 ఖర్చవుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తెలియజేసింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఈ మేరకు జవాబిచ్చింది.

అలాగే రూ.500 నోటు తయారీకి రూ.2.57గా ఉన్నది. ఇక పాత రూ.500 నోటు ముద్రణకు అయిన ఖర్చు విషయానికొస్తే రూ.3.09గా ఉండేది. అలాగే రూ.1,000 నోటు తయారీ ఖర్చు రూ.3.54 అని ఆర్బీఐ ముద్రణా విభాగం వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. కాగా, మునుపెన్నడూ లేనివిధంగా పరిచయమైన రూ.200 నోటు ముద్రణ ఖర్చు దాదాపు రూ.2.94గా ఉన్నట్లు సమాచారం.