Asianet News TeluguAsianet News Telugu

సమ్‌థింగ్ హైడ్: అరెస్ట్‌పై మాల్యాకు ముందస్తు లీక్.. అందుకే!!

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కోసం ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్టియం వద్ద రమారమీ రూ.9000 కోట్ల రుణాలు తీసుకున్న లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా ఆగమేఘాలపై లండన్ నగరానికి పారిపోవడానికి ముందు ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతడ్ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని ఎస్బీఐ నుంచి ఉప్పందించడం వల్లే పరారయ్యారా? అని బ్యాంక్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొనడం గమనార్హం. 

SBI denies laxity in dealing with Vijay Mallya case
Author
New Delhi, First Published Sep 15, 2018, 11:00 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు రుణాలకు ఎగనామం పెట్టి, విదేశాల పారిపోయిన విజయ్ మాల్యా వ్యవహారంలో రోజుకో సంచలనాత్మక సంగతి బయటపడుతోంది. ఇంతకుముందు తాను దేశం విడిచి వెళ్లిపోవడానికి కంటే ముందు, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసినట్లు లండన్‌లో తల దాచుకున్న విజయ్ మాల్యా స్వయంగా మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బయటకు తెలియకుండా రహస్యంగా ఏదో జరిగిందన్న అనుమానాలు క్రమంగా బలపడుతున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కూడా ‘లుక్ ఔట్’ నోటీసులో ‘డిటైన్’ అనే పదాన్ని మార్చేసి ‘ఇన్‌ఫామ్’ అని చేర్చినట్లు అంగీకరించడం గమనార్హం. 

విజయ్ మాల్యాతో తాను సమావేశమైన మాట అబద్ధమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించినా విజయ్ మాల్యా వ్యాఖ్యలు రాజకీయంగా జాతీయ స్థాయిలో పెను దుమారమే సృష్టించాయి. ఇదే సంగతిపై సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్‌ దావే కూడా మరికొన్ని కీలక విషయాలను బయటపెట్టారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) తన ఫిర్యాదు ఫైల్‌ చేయడంలో అలసత్వం ప్రదర్శించడంతోనే మాల్యా దేశం విడిచిపోయినట్టు పేర్కొన్నారు. 

విజయ్ మాల్యా భారత్‌ విడిచి పారిపోవడానికి సుమారు ఒక నెల ముందు ఆయన ‘కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్’ కోసం తీసుకున్న రూ.2000 కోట్లకు పైగా రుణాలను తమకు చెల్లించాల్సి ఉందని ఎస్బీఐ ప్రకటించింది. జాతీయ రుణ పరిష్కార ట్రిబ్యునల్‌కు ఈ అంశంపై అఫిడవిట్ సమర్పిస్తూ ఈ విషయాలను బయట పెట్టింది 14 బ్యాంక్‌లను నిర్వహించే కన్సార్టియం ఎస్‌బీఐ ట్రిబ్యునల్‌కు ఈ వివరాలను సమర్పించింది. 

2016 జనవరి 31 వరకు మాల్యా ఎస్‌బీఐకి  రూ.2,043 కోట్ల రుణాలు బాకీ ఉన్నారని, మొత్తంగా బ్యాంకులకు రూ.6,963 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. కొన్ని వారాల తర్వాత అంటే ఫిబ్రవరి 28వ తేదీన సుప్రీంకోర్టు న్యాయవాది దుష్యంత్‌ దావే, సీనియర్‌ ఎస్బీఐ అధికారులతో భేటీ అయ్యారు. విజయ్ మాల్యా, ఆయన కంపెనీల రుణాల వ్యవహారంలో వెంటనే సమావేశం కావాలని ఎస్బీఐ అధికారులు కోరడంతో, ఈ భేటీ జరిగింది.

గంటసేపు జరిగిన సమావేశంలో మాల్యా భారత్‌ విడిచి పరార్ కావడానికి ప్రయత్నిస్తున్నాడని ఎస్బీఐ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారట. మాల్యా పారిపోకుండా ఉండాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని, తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టులో అతను భారత్‌ను వీడకుండా ఉండేందుకు ఓ ఫిర్యాదు దాఖలు చేయాలని దుష్యంత్ దవే సూచించారు. అప్పటి ఎస్బీఐ చీఫ్‌ అరుంధతి భట్టాచార్య కూడా తన సూచనకు అంగీకారం తెలిపినట్లు దావే వెల్లడించారు. అయితే ఆమె ఈ సమావేశంలో పాల్గొన్నారో.. లేదో దుష్యంత్‌ స్పష్టం చేయలేదు. ఆ తర్వాత రోజు దవే సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడి టాప్‌ ఎస్‌బీఐ అధికారులెవరూ రాలేదు. మాల్యా భారత్‌ వీడకుండా ఉండేందుకు పిల్‌నూ దాఖలు చేయలేదు.

తర్వాత 2016 మార్చి రెండో తేదీన విజయ్ మాల్యా భారత్‌ నుంచి పారిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాల్యా భారత్‌కు రాలేదు. ప్రస్తుతం లండన్‌లో లగ్జరీ లైఫ్‌ గడుపుతున్నాడు. 'నేను ఎస్‌బీఐ అధికారులకు సూచించిన తర్వాత ఏదో జరిగింది, దానిలో ఏం అనుమానం లేదు' అని దవే ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. సీబీఐ కూడా విజయ్ మాల్యా తరుచుగా లండన్, భారత్ మధ్య పర్యటిస్తున్నారని, తిరిగి వస్తారని భావించినందునే వీసా ఆన్ అరైవల్ జారీ చేశామని పేర్కొనడం ఆసక్తికర పరిణామం. ఈ క్రమంలో డిటైన్ పదానికి బదులు ఇన్ ఫామ్ అని చేర్చడం పొరపాటని ముంబైలోని వీసా విభాగం అధికారులు గుర్తించారని కూడా సీబీఐ పేర్కొంది. అలా మార్చి రెండో తేదీన లండన్ నగరానికి పారిపోయిన విజయ్ మాల్యా తిరిగి రాకుండా అక్కడే తిష్టవేస్తాడని తాము భావించలేదని సీబీఐ తెలిపింది. 

ఎస్బీఐ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే ప్రకటనపై నాటి బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య స్పందించారు. దీనిపై ఎస్‌బీఐ అధికార ప్రతినిధి స్పందిస్తారని, తాను స్పందించదలుచుకోలేదని.. ప్రస్తుత యాజమాన్యాన్ని సంప్రదించాలని భట్టాచార్య సూచించారు. మాల్యా, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణాల ఎగవేత కేసుల విషయంలో తమ అధికారులు అలసత్వం ప్రదర్శించారని వస్తున్న ఆరోపణలను ఎస్బీఐ ఖండించింది. ఎగవేత మొత్తాల రికవరీ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios