ముంబై : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా ఆఫర్ల యుద్ధంలోకి రంగ ప్రవేశం చేసింది. వచ్చే దీపావళి సందర్భంగా  వినియోగదారులను ఆకట్టుకునేందుకు పండగ ఆఫర్ ప్రకటించింది.  తన క్రెడిట్ కార్డు వినియోగదారులు ఈ పండుగ సీజన్‌లో అద్భుతమైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. 

ఇందుకోసం ఎస్‌బీఐ వివిధ రకాల పెద్ద బ్రాండ్లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీపావళి బంపర్ ఆఫర్ ఈ నెల 30వ తేదీ వరకు చెల్లుతుంది. ముఖ్యంగా ‘ఎస్‌బీఐ ఇండియా కా దీపావళి ఆఫర్’ కింద  రూ.లక్ష విలువైన ‘మేక్ మై ట్రిప్ యాప్ హాలిడే’ ఓచర్‌ను గెలుచుకోవచ్చు. కార్డుపై ఎక్కువ మొత్తం ఖర్చు చేసిన టాప్‌ వినియోగదారులకు ఈ అద్భుత అవకాశం దక్కనున్నది. 

అలాగే మరికొంతమందికి షియోమీ స్మార్ట్‌ ఫోన్లను ఉచితంగా అందిస్తుంది. ఇంకా ఇతర స్మార్ట్ డివైజ్‌లనూ సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు మెగా ప్రైజ్, వీక్లీ ప్రైజ్, డైలీ ప్రైజ్, అవర్లీ ప్రైజ్‌లు కూడా ఉన్నాయి. 

అవర్లీ ప్రైజ్ కింద రూ.1000 విలువ చేసే ప్యూమా గిఫ్ట్ ఓచర్, డైలీ ప్రైజ్ కేటగిరీలో రూ.7000 వైర్‌లెస్ హెడ్ ఫోన్లు, వీక్లీ కేటగిరీలో రూ. 17,499ల ఎంఐ ఏ3 ఫోన్ బహుమతిగా పొందొచ్చు. కాగా ఎస్‌బీఐ  ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకెందుకు ఆలస్యం.. త్వరపడండి.