న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి తీసుకొచ్చిన మార్పులతో ఖాతాదారులు ఇకపై ఎక్కువగా డిజిటల్ లావాదేవీలపై మొగ్గుచూపే అవకాశం ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. అందుకే తాము తమ ఖాతాదారులు యోనో యాప్ ఎక్కువ మంది వినియోగించేలా చర్యలలు తీసుకుంటామని తెలిపారు.

వచ్చే ఆరు నెలల్లో యోనో యాప్ డౌన్ లోడ్లు రెండింతలయ్యేలా చూస్తామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఫ్లాట్ ఫామ్ నుంచి ఇల్లు, కార్లు, వ్యక్తిగత, పసిడి రుణాలపై ప్రత్యేక పథకాలు అందిస్తామని, తద్వారా యాప్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. 

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు సంస్థలు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాల ఉద్వాసనలు, వేతనాల తగ్గింపు ప్రభావం తమ సంస్థలో తక్కువేనని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వ్యాపారాలు తమ బ్యాంకుతో అనుసంధానమై ఉండటమే దీనికి కారణమని వాటాదారులకు ఆయన భరోసానిచ్చారు.

ఈ మేరకు ఎస్బీఐ వాటాదారులకు రజనీశ్ కుమార్ లేఖ రాశారు. ‘ఆర్థిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో బలమైన పనితీరును ప్రదర్శించాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ అదే సంప్రదాయాన్ని, ఒరవడిని కొనసాగిస్తాం‘ అని స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి సవాళ్లను అధిగమిస్తామన్న విశ్వాసం తమకు ఉన్నదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. రుణ వాయిదాలపై ఆర్బీఐ విధించిన మారటోరియం ప్రయోజనాలను ప్రస్తుతానికి 21.8 శాతం మంది ఖాతాదారులు మాత్రమే పొందుతున్నారని అన్నారు.

also read సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు మినహాయింపు...కేంద్రానికి సీఐఐ సూచన ...

లాక్ డౌన్ సమయంలో 98 శాతం, 91 శాతం ప్రత్యామ్నాయ చానెళ్ల కార్యకలాపాలు సాగాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ప్రభుత్వం సంప్రదాయంగా ఎస్బీఐని ఎంచుకుంటున్నదన్నారు.

కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలకు కూడా ఎస్బీఐనే గుర్తింపు పొందిన బ్యాంకు అని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ఈ-గవర్నెన్స్ కార్యక్రమానికి ఎస్బీఐ తన వంతు సాయం అందిస్తున్నదని వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఈ-సొల్యూషన్స్‌ను డెవలప్ చేయడానికి కూడా ఎస్బీఐ సహకరిస్తున్నదని రజనీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ విధానంలోకి ఆర్థిక లావాదేవీలను మార్చడం వల్ల ఎక్కువ సమర్ధత, పారదర్శకత లభిస్తుందన్నారు. 

ఫలితంగా సుభతర వ్యాపార నిర్వహణతో పౌరుల జీవన విధానం మారుతున్నదని రజనీశ్ కుమార్ చెప్పారు. 2019-20లో ఎస్బీఐ పరిధిలో ప్రభుత్వ వ్యాపార టర్నోవర్ రూ.52,62,643 కోట్లుగా ఉందన్నారు. 

కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి కొనసాగే అవకాశం ఉన్నదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. ప్రపంచం మొత్తం తీవ్ర ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం కూడా ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో క్షీణించే అవకాశం ఉన్నదని ఆర్బీఐ కూడా అంచనా వేసింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవాళ్లతో కూడుకున్నదని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. అయితే బ్యాంకులు దానిని సర్దుబాటు చేసుకుంటాయన్నారు.