Asianet News TeluguAsianet News Telugu

పైసా వసూల్ ఫర్ ఈచ్ సర్వీస్: ఎస్బీఐ రెవెన్యూ పెంచుకునే వ్యూహం

భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) తన ఆదాయం పెంచుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది. మూడుసార్లు నగదు డిపాజిట్లు దాటితే రూ.50 జీఎస్టీ.. ఐదుసార్లు దాటితే రూ.56 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. మెట్రో పాలిటన్ నగరాల్లో మాత్రం 10 సార్లకు మాత్రమే ఏటీఎం ఫ్రీ లావాదేవీలకు పరిమితం.

SBI Announces its New Rules in India
Author
New Delhi, First Published Sep 8, 2019, 12:14 PM IST

అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరోమారు తన ఖాతాదారులపై కొరడా ఝుళిపించింది. అంటే వివిధ లావాదేవీల చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది.

బ్యాంకుల్లో నగదు డిపాజిట్, విత్ డ్రాయల్స్, ఏటీఎం సేవలు, చెక్కుల వినియోగం తదితర సేవలకు చార్జీల్లో మార్పులు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ తాజా నిర్ణయం ప్రకారం బ్యాంకుల్లో ప్రతి నెలలో నేరుగా మూడుసార్లు మాత్రమే డబ్బు ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు.

అంతకుమించి నగదు ఎన్నిసార్లు డిపాజిట్లు చేస్తే అన్నిసార్లు ఖాతాదారులు చార్జీలు చెల్లించుకోక తప్పదు. దీని ప్రకారం కనీసం రూ.100 నగదు డిపాజిట్ చేసినా అదనంగా జీఎస్టీ రూపంలో రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. 

నెలలో ఆరోసారి జమ చేయాల్సి వస్తే జీఎస్టీగా రూ.56 చెల్లించాలని ఎస్బీఐ పేర్కొంది. ఏదైనా కారణాలతో చెక్కు బౌన్స్ అయితే రూ.150కి తోడు జీఎస్టీతో కలిపి రూ.168 చార్జీ వసూలు చేయనున్నది ఎస్బీఐ.

దేశంలోని ఆరు మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ పరిధిలో ఇక నుంచి ప్రతి నెలలో ఎస్బీఐ 10 సార్లు ఏటీఎం లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. మిగతా నగరాల పరిధిలో 12 సార్లు ఫ్రీగా ఏటీఎం సేవలు పొందొచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల్లో ఐదుసార్లు మాత్రమే ఉచితంగా ఏటీఎం కార్డును వాడొచ్చు.

అయితే బ్యాంకు ఖాతాలో రూ.25 వేలకు మించి సొమ్ము ఉంచే వారికి ఉచితంగా అపరిమిత ఏటీఎం సేవలు లభిస్తాయి. వేతనాలు పొందే ఖాతాదారులకు కూడా అపరిమితంగా ఉచిత ఏటీఎం సేవల్లో వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

అంతే కాదు.. ఖాతాదారు నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ (నెఫ్ట్) లావాదేవీలు జరుపాలనుకుంటే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అదనపు చార్జీలు చెల్లించక తప్పదు.

ఆర్టీజీఎస్‌లో రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు లావాదేవీలు జరిపితే రూ.20, రూ.5 లక్షల పై చిలుకు లావాదేవీలు జరిపితే అదనపు పన్నులతో కలిపి రూ.40 చార్జీలు వసూలు చేయనున్నది ఎస్బీఐ. 

నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా సేవలు పొందే వినియోగదారులు ఎటువంటి చార్జీలు చెల్లించనవసరం లేదని ఎస్బీఐ వివరించింది. రూ.10 వేల లోపు నెఫ్ట్ లావాదేవీలకు రూ.2, రూ. లక్ష లోపు రూ.4, రూ.2 లక్షల లోపు రూ.12, అంతకు పై బడిన నిఫ్ట్ లావాదేవీలకు వినియోగదారులు, ఖాతాదారులు రూ.20 అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios