ముంబై: డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు తొలగించి, మరిన్ని డిజిటల్‌ చెల్లింపు విధానాలను అమల్లోకి తేవాలని భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్బీఐ) యోచిస్తోంది. దేశంలో అయిదోవంతు జనాభాకు ఎస్బీఐ బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. ఎస్బీఐ ఖాతాదార్లలో అత్యధికులు డెబిట్‌కార్డులపై ఆధారపడి ఉన్న సంగతి విదితమే. 

బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్‌ కార్డులను తొలగించాలని తమ యోచన అని, ఇది సాధ్యం చేయగలమని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. దేశం మొత్తంమీద దాదాపు 93 కోట్ల డెబిట్‌, క్రెడిట్‌కార్డులు వినియోగంలో ఉన్నాయని చెప్పారు. 

ఎస్బీఐ అందుబాటులోకి తెచ్చిన యోనో వంటి యాప్‌ల ద్వారా, దేశీయంగా డెబిట్‌కార్డుల వినియోగాన్ని తగ్గించగలమనే అభిప్రాయాన్ని రజనీశ్‌ వ్యక్తం చేశారు. యోనో యాప్‌ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించొచ్చని, కార్డు లేకుండా దుకాణాల్లో చెల్లింపులు పూర్తి చేయవచ్చన్నారు. 

యోనో కేంద్రాల సంఖ్యను ప్రస్తుత 68 వేల నుంచి ఏడాదిన్నరలో 10 లక్షలకు చేర్చాలనే ప్రణాళికతో ఉన్నామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు.  అప్పుడు కార్డు అవసరమే రాకపోవచ్చన్నారు. కొన్ని ఉత్పత్తుల కొనుగోలుకు యోనో యాప్‌ ద్వారా రుణం కూడా పొందవచ్చన్నారు.

అందువల్ల క్రెడిట్‌కార్డు కూడా ‘బేబులో ప్రత్యామ్నాయ సాధనం’గా మిగిలిపోతుందని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్ కుమార్ వివరించారు. వచ్చే ఐదేళ్లలో దేశీయంగా కార్డు అవసరం అత్యంత పరిమితం అవుతుందని, వర్చువల్‌ కూపన్లే ప్రధానపాత్ర పోషిస్తాయని తెలిపారు. చెల్లింపులకు ప్రస్తుతం అనుసరిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ విధానం కూడా ఖరీదైనదేనని పేర్కొన్నారు.