Asianet News TeluguAsianet News Telugu

ఉత్పత్తి తగ్గిస్తామన్న సౌదీ.. భగ్గుమన్న క్రూడాయిల్

ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించినా చైనా, భారత్ వంటి దేశాలకు మినహాయింపులు ఇవ్వడంతో ముడి చమురు ధరలపై ప్రభావం పడలేదు. అయితే రోజురోజుకు అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు పడిపోవడంతో ఉత్పాదక దేశాలు సరఫరా తగ్గించి డిమాండ్ పెంచాలన్న నిర్ణయానికి వచ్చాయి

Saudi Arabia is reducing oil supply and OPEC may cut too
Author
Mumbai, First Published Nov 13, 2018, 7:40 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు రోజుకింత పడిపోతుండటంతో క్రూడాయిల్ ఉత్పాదక దేశాలు అప్రమత్తం అయ్యాయి. విపణిలోకి సరఫరా తగ్గించి.. డిమాండ్‌ను పెంచి.. అటుపై మళ్లీ ధరలు పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.

సోమవారం జరిగిన అంతర్జాతీయ పెట్రోలియం ఎగ్జిబిషన్ అండ్ కాన్ఫరెన్స్‌లో  సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ అల్-ఫలీహ్ మాట్లాడుతూ రోజుకు 10 లక్షల బ్యారెళ్ల మేర క్రూడ్ ఉత్పత్తిని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అది వచ్చే నెల నుంచి ఆచరణలో పెట్టనున్నట్లు తేల్చేశారు. 

70 డాలర్ల వద్ద బ్యారెల్ ముడి చమురు ధర
ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల వద్ద కదలాడుతున్నది. అక్టోబర్ నెలారంభంలో నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకిన ధరలు నెల రోజుల్లోనే ఏకంగా ఐదో వంతు విలువను కోల్పోయాయి.

దీంతో డిమాండ్‌ను మించి ముడి చమురు మార్కెట్‌కు సరఫరా అవుతుందన్న అభిప్రాయానికి చమురు ఉత్పాదక దేశాలు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ముడి చమురు ఉత్పత్తి, ఎగుమతిలో అగ్రశ్రేణి దేశంగా ఉన్న సౌదీ అరేబియా.. చమురు ఉత్పత్తిని రోజుకు మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవడం మంచిదనే వాదన
తెచ్చింది.

వచ్చేనెల నుంచి రోజూ 5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి తగ్గింపునకు సౌదీ ప్రతిపాదన
వచ్చే నెల డిసెంబర్ నుంచి తమ ఉత్పత్తిని 5 లక్షల బ్యారెళ్ల మేర తగ్గించుకుంటామని సౌదీ అరేబియా ప్రకటించింది. సౌదీ ప్రతిపాదనను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చమురు శాఖ మంత్రి, ప్రస్తుత ఒపెక్ దేశాల అధ్యక్షుడు సుహైల్ అల్-మజ్రౌఈ కూడా సమర్థించారు.

2016లో బ్యారెల్ ముడి చమురు ధర 30 డాలర్ల దిగువకు దిగజారడంతో ఇప్పటి పరిస్థితిని పోల్చలేమని కూడా అన్నారు. మరోవైపు ముడి చమురు ఉత్పత్తి తగ్గుదల వార్తలతో సోమవారం ఒక్కరోజే బ్యారెల్ ధర 2 శాతానికిపైగా ఎగబాకడం గమనార్హం.

ఇక ఉత్పత్తి తగ్గితే ధరలు మళ్లీ పరుగులు పెట్టడం ఖాయమన్న విశ్లేషణలు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వచ్చే నెలారంభంలో వియన్నాలో జరిగే ఒపెక్, నాన్-ఒపెక్ దేశాల కీలక మంత్రివర్గ సమావేశంలో ఉత్పత్తి కోతపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని ఫలీహ్ తెలిపారు.

ఇరాన్‌పై ప్రభావం చూపని అమెరికా ఆంక్షలు
ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు అంతగా ప్రభావం చూపకపోవడం, క్రూడాయిల్ దిగుమతి దేశాల్లో కీలకమైన భారత్, చైనా వంటి వాటికి మినహాయింపులుండటం అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ముడి చమురు సరఫరా, ధరల క్షీణతకు దోహదం చేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలోని ముడి చమురు ఎగుమతి దేశాల్లో ఇరాన్ మూడో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇరాన్ అణు కార్యకలాపాలపై అనుమానంతో అగ్రరాజ్యం ఈ దేశంపై ఆంక్ష ల్ని అమల్లోకి తీసుకురాగా, ఇరాన్ ముడి చమురును ఎవరూ కొనరాదని, ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవ ని స్పష్టం చేసిన సంగతీ విదితమే.

కానీ ఆంక్షల నేపథ్యంలో మిగతా ఉత్పాదక దేశాలు మార్కెట్‌లోకి సరఫరాను పెంచడం, భారత్, చైనా మరికొన్ని దేశాలకు ఆంక్షల అమలుకు ఆరు నెలలదాకా గడువు ఇవ్వడం ధరల క్షీణతకు దారితీసింది. గత శుక్రవారం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 70 డాలర్ల దిగువకు పతనమైన సంగతి తెలిసిందే.

భారతీయ బంకర్ల కోసం యూఏఈతో ఒప్పందం
కర్ణాటకలోని పాడూర్‌లోగల వ్యూహాత్మక భూగర్భ చమురు నిల్వ బంకర్ వినియోగం విషయమై భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఒప్పందం కుదిరింది. చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం అబుదబీ నేషనల్ ఆయిల్ కంపెనీ దీన్ని లీజుకు తీసుకున్నది.

ఈ ఏడాది యూఏఈతో ఈ తరహా ఒప్పందం రెండోది. కర్ణాటకలోని మంగళూరు, పాడూరుల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భూగర్భ చమురు నిల్వ బంకర్లను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. దేశీయ ఇంధన అవసరాలు 80 శాతానికిపైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. 

అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించేందుకే బంకర్లు
అంతర్జాతీయ సరఫరాలో ఏర్పడే అడ్డంకులను ఈ నిల్వలతో కొంతైనా అధిగమించవచ్చనే వీటిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. వీటిలోని నిల్వలు దేశీయంగా 9.5 రోజుల ఇంధన డిమాండ్‌కు సమానం.

5.33 మిలియన్ టన్నుల చమురును నిల్వ చేసుకోవచ్చు. పాడూర్‌తోపాటు ఒడిశాలోని చంఢీకోల్‌లో అదనంగా బంకర్ల నిర్మాణానికీ కేంద్రం ప్రయత్నిస్తున్నది. వీటిని విదేశీ సంస్థలు లీజుకు తీసుకున్నా ఆ చమురు నిల్వలను అత్యవసర పరిస్థితుల్లో దేశ అవసరాలకు వినియోగించేలా సదరు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలను చేసుకుంటున్నది.

దేశీయంగా తగ్గుతున్న పెట్రో భారం
దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం మరింత దిగొచ్చాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 18 పైసలు తగ్గి రూ.82.24 వద్ద స్థిరపడగా, డీజిల్ ధర 17 పైసలు పడిపోయి రూ.78.67 వద్ద నిలిచింది. ఢిల్లీలో పెట్రోల్ రేటు 17 పైసలు తగ్గుముఖం పట్టి రూ.77.56గా, డీజిల్ 15 పైసలు దిగజారి రూ.72.31గా నమోదయ్యాయి.

నిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర సోమవారం పెరిగింది. ఒకానొక దశలో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ విలువ 2 శాతానికిపైగా పుంజుకున్నది. అయినా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరల పతనాన్ని కొనసాగించాయి. గత నెల 18 నుంచి ఇంధన ధరలు క్రమేణా దిగొస్తున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios