యునైటెడ్‌ బ్రూవరీస్‌ హోల్డింగ్స్‌(యూబీహెచ్‌ఎల్‌)లో విజయ్‌ మాల్యాకు చెందిన 74 లక్షలకు పైగా షేర్లను విక్రయించడం ద్వారా రుణ రికవరీ ట్రైబ్యునల్‌ (డీఆర్‌టీ) రూ.1008 కోట్లు పొందిందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) పేర్కొంది. మాల్యాపై చేపట్టిన మనీ లాండరింగ్‌ దర్యాప్తులో భాగంగా ఈ షేర్ల అటాచ్‌మెంట్‌ జరిగిందని ఈడీ వివరించింది. 

యునైటెడ్ బ్రేవరీజెస్ షేర్ల స్వాధీనానికి ఎస్ బ్యాంకుకు కర్ణాటక హైకోర్టు ఆదేశం
డీఆర్‌టీకి ఆ షేర్లను స్వాధీనం చేయాలని యెస్‌ బ్యాంకుకు కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ నెల మొదట్లో డీఆర్‌టీకి చెందిన ఒక రికవరీ అధికారి యూబీహెచ్‌ఎల్‌కు చెందిన మొత్తం 74,04,932 షేర్లను విక్రయించడం కోసం నోటీసు జారీ చేశారు. వీటి విక్రయంతో రూ.1008 కోట్లు వచ్చినట్లు ఈడీ బుధవారం తెలిపింది. మాల్యా కేసులో షేర్ల విక్రయం ఇదే తొలిసారని, వచ్చే కొద్ది రోజుల్లో ఇలాంటి మరిన్ని విక్రయాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

పీఎంఎల్ఏ కింద ఖాతాల ఫ్రీజింగ్
యస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలకు యూబీహెచ్‌ఎల్‌కు చెందిన షేర్లను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ హామీగా ఉంచినట్లు ఈడీ తెలిపింది. ఇది వరకే ఈ రుణ చెల్లింపుల్లో అధిక భాగం జరిగిపోయాయి. దర్యాప్తు సమయంలో ఈ షేర్లను విక్రయించకుండా.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎమ్‌ఎల్‌ఏ) కింద ఈడీ ఈ షేర్లను అటాచ్‌ చేసిన విషయం విదితమే.

నీరవ్ అప్పగింత కోసం లండన్‌కు సీబీఐ-ఈడీ బృందం
నీరవ్ మోదీ అప్పగింత కేసులో అక్కడి అధికార వర్గాలకు సాయంగా సీబీఐ, ఈడీ బృందం బుధవారం లండన్‌కు బయలుదేరి వెళ్లింది. గత వారం లండన్‌లో అరస్టైన నీరవ్ మోదీకి అక్కడి వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఈ నెల 29దాకా రిమాండ్ విధించిన విష యం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.13,500 కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోదీని అప్పగించాలని బ్రిటన్ హోం శాఖకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి చేసింది.

సాక్ష్యాధారాలతో లండన్‌కు ఈడీ, సీబీఐ అధికారులు
ఈ నేపథ్యంలో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు గత మంగళవారం నీరవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు ఈ కేసు శుక్రవారం విచారణకు వస్తుండగా, భారత్‌కు నీరవ్‌ను అప్పగించాలంటూ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) వాదనలు వినిపిస్తున్నది. ఈ వాదనకు బలాన్నిచ్చేలా నీరవ్ నేరాలపై తగిన సాక్ష్యాధారాలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందం లండన్‌కు వెళ్లింది. కాగా, ఈ కేసులో నీరవ్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడంతో, మరోసారి నీరవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైనా కోర్టు విచారణ చేపట్టనున్నది.

ఐటీ శాఖకు సమన్లు జారీ చేసిన బాంబే హైకోర్టు
నీరవ్‌కు చెందిన ఖరీదైన పెయింటింగ్స్‌ను ఆదాయం పన్ను (ఐటీ) శాఖ వేలం వేయడాన్ని సవాల్ చేస్తూ నీరవ్ సంస్థ కేమ్లాట్ ఎంటర్‌ప్రైజెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు ఐటీ శాఖకు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల ఒకటో తేదీలోగా స్పందించాలని స్పష్టం చేసింది. 68 పెయింటింగ్స్‌ను వేలం వేసుకోవచ్చని ఐటీ శాఖకు ముంబై ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం నిర్వహించిన వేలంలో సుమారు రూ.55 కోట్లు కూడా వచ్చాయి. బుధ, గురువారాల్లో ఆన్‌లైన్‌లోనూ ఈ పెయింటింగ్స్ వేలం జరుగుతున్నది.

ఆ కంపెనీలతో సంబంధం లేదన్న మెహుల్ చోక్సీ
ఇప్పటికే మేనల్లుడు నీరవ్ మోదీ అరెస్ట్ కావడంతో ఆయన మేనమామ మెహుల్ చోక్సీ తనకు అసలు ఆ కంపెనీలతో సంబంధమే లేదని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్‌ మోసానికి ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన మెహుల్‌ చోక్సీ తనకే పాపం తెలియదంటున్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ) రుణ కుంభకోణం కేసులో దర్యాప్తునెదుర్కొంటున్న ఏ కంపెనీతోనూ తనకు సంబంధం లేదన్నారు. ఆ కంపెనీల నుంచి 2000లోనే చోక్సీ తప్పుకున్నారంటూ ఆయన తరఫున లాయర్లు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆస్తులను స్తంభింపజేయడం వల్లే చోక్సీ రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. 

సీనియర్‌ బ్యాంకర్‌ చేతికి జెట్‌ ఎయిర్‌వేస్‌ పగ్గాలు!
జెట్‌ ఎయిర్‌వేస్‌ పగ్గాలు ఒక సీనియర్‌ బ్యాంకర్‌ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు నుంచి ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌, ఆయన భార్య అనితా గోయల్‌ వైదొలగడంతో కంపెనీ నియంత్రణ బ్యాంకుల చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. బ్యాకంర్ల కన్సార్షియంకు నేతృత్వం వహిస్తున్న ఎస్‌బీఐ.. జెట్‌ ఛైర్మన్‌ పదవికి ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ జానకీ బల్లభ్‌ పేరును ప్రతిపాదించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళిక ప్రకారం.. సంస్థను విక్రయించడానికి ముందు రుణదాతలు కొన్ని నెలలు కంపెనీని నడపాలి. ఈ నేపథ్యంలో సంస్థ పునరుద్ధరణకు జానకీ బల్లభ్‌ పేరును ఎస్‌బీఐ ప్రతిపాదించనుందని సమాచారం. అయితే ఈ విషయమై తననెవరూ సంప్రదించలేదని బల్లభ్‌ పేర్కొన్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.