Asianet News TeluguAsianet News Telugu

బక్కచిక్కిన రూపాయి: ట్రేడ్ వార్‌తో మనకూ ముప్పేనన్న బిర్లా

దేశ చరిత్రలో అమెరికా డాలర్‌తో రూపాయి విలువ మరింత బక్కచిక్కింది. మార్కెట్ లో ఒకానొక దశలో 69.07 స్థాయికి చేరినా వ్యాపారులు డాలర్లు కొని అడ్డుకోవడంతో 69.05 వద్ద స్థిరపడింది. చైనా - అమెరికా వాణిజ్య యుద్ధంతో ముప్పేనని ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా హెచ్చరించారు.

Rupee Posts All-Time Closing Low Of 69.05 Against Dollar

ముంబై: డాలర్‌తో రూపాయి మారకం రేటు కుదేలవుతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి మారకం రేటు గురువారం 69.05 వద్ద ముగిసింది. బుధవారంతో పోలిస్తే ఇది 43 పైసలు ఎక్కువ. డాలర్‌తో రూపాయి మారకం రేటు ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం కూడా ఇదే తొలిసారి. గురువారం ఒక దశలో డాలర్‌తో రూపాయి మారకం రేటు 69.07 స్థాయికి కూడా పడిపోయింది. దిగుమతిదారులు, స్థానిక బ్యాంకుల నుంచి డాలర్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడడం, రూపాయి మారకం రేటును నిలబెట్టేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. మే 29వ తేదీ తర్వాత రూపాయి మారకం విలువ అత్యధికంగా, కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా ఇదే మొదటిసారి. 

తొలి త్రైమాసికంలో సీఏడీ 2.5 శాతం?


తొలి త్రైమాసికంలో జీడీపీలో కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) 2.5 శాతానికి చేరే అవకాశం ఉందన్న ఇక్రా అంచనాలు, అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయన్న అంచనాల మధ్య ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం రేటుని దెబ్బతీస్తున్నాయి. వివిధ దేశాల ప్రధాన కరెన్సీలతో డాలర్‌ మారకం రేటు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరడమూ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. చమురు సెగ ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్‌లోనే డాలర్‌తో రూపాయి మారకం రేటు 72కు కూడా చేరే అవకాశం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నదని అంచనాలు


ఈ నేపథ్యంలో వచ్చేనెల ఒకటో తేదీన జరిగే సమావేశంలో ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లు మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో నరేంద్రమోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావడానికి ఒకరోజు ముందే రూపాయి విలువ బలహీన పడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు మార్కెట్ సెంటిమెంట్‌పై చైనా - అమెరికా వాణిజ్య యుద్ధం ప్రభావం చూపుతున్నదన్న ఆందోళన ఇన్వెస్టర్లు, వ్యాపారుల్లో ఉన్నది.

వాణిజ్య యుద్ధంతో మనకూ ముప్పే: బిర్లా


భారత ఆర్థిక వ్యవస్థకు స్వల్ప కాలంలో పలు రకాల ముప్పులు పొంచి ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా హెచ్చరించారు. పెరుగుతున్న చమురు సెగ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, కోరలు చాస్తున్న కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) తీవ్ర ఆందోళన కలిగించే అంశాలన్నారు. వెంటనే వీటిని కట్టడి చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. గ్రూపులోని అల్ట్రా టెక్‌ కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశం(ఎజిఎం)లో బిర్లా మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు. అభివృద్ధి చెందిన దేశాల స్వీయ వాణిజ్య రక్షణ విధానాలు, ద్రవ్య చలామణిని తగ్గించే విధానాలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ‘అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముసురుతోంది. ఆ ప్రతికూల ప్రభావం మన ఆర్థిక వ్యవస్థపైనా పడుతుంది’ అన్నారు.
 
మనకున్న సానుకూలతలు ఇవి..


కొన్ని సమస్యలున్నా మన ఆర్థిక వ్యవస్థ ముందుకు పోయేందుకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నట్టు బిర్లా చెప్పారు. ముఖ్యంగా భారతమాల, కొత్త విమానాశ్రయాలు, మెట్రో నగరాల నిర్మాణం, స్మార్ట్‌ నగరాలు, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి ప్రాజెక్టులు భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు పోతాయన్నారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా పెద్ద నోట్ల రద్దు, జిఎ్‌సటితో ఎదురైన కుదుపులను మన ఆర్థిక వ్యవస్థ సరిగానే ఎదుర్కొని బయట పడిందన్నారు.

భయపెడుతున్న కరెంట్‌ ఖాతా లోటు


కరెంట్‌ ఖాతా లోటు (సీఏడీ) మళ్లీ కోరలు చాస్తోంది. చమురు సెగతో ఈ ఆర్థిక సంవత్సరం (2018-19)ముగిసే సరికి సీఏడీ జీడీపీలో 2.5 శాతానికి చేరుకుంటుందని పరపతి రేటింగ్‌ సంస్థ ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం జిడిపిలో సీఏడీ 1.9 శాతం మాత్రమే. రెడీమేడ్‌ దుస్తులు, జెమ్స్‌ అండ్‌ జువెలరీ, ఇనుప ఖనిజం వంటి ప్రధాన ఎగుమతులు తగ్గి విలువైన లోహాలు, రాళ్లు, యంత్రాలు, ఎలకా్ట్రనిక్‌ వస్తువుల దిగుమతులు పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ఇక్రా ఆర్థికవేత్త అదితి నాయర్‌ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios