టర్కీ కరెన్సీ ‘లీరా’ పుణ్యమా?! అని వారం నుంచి పతనం అవుతున్న రూపాయి విలువ మరో మెట్టు దిగింది. గురువారం ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌పై రూపాయి విలువ రూ.70.32లకు పతనమైంది. మంగళవారం డాలర్‌పై రూపాయి 43 పైసలు పెరిగినా 69.89కు ఎదిగింది. అంతకుముందు డాలర్‌పై రూపాయి విలువ 70.08 పతనమై చివరకు కోలుకున్నది. గత శుక్రవారం డాలర్‌పై రూపాయి 16 శాతం పతనమైంది. నాలుగు నెలల కాలంలో విదేశీ కరెన్సీలతో డాలర్ 8 శాతం పెరిగింది.

బుధవారం తాజాగా 13 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అనుసరిస్తున్న వాణిజ్య విధానాల ఫలితంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. కరెన్సీ పతనం  దీని ప్రభావం వాణిజ్య రంగం నుంచి విద్యారంగం వరకు అన్ని సెక్టార్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్ధిక వేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నవారు, చేయాలని తలపోస్తున్న వారికి కష్టకాలం ఎదురైనట్లే. విదేశాలకు వెళ్లే విద్యార్థులు తమ రూపాయిని డాలర్‌గా మార్చుకోవాలి. తాజా పరిణామంతో నూతనంగా విదేశీ విద్యాభ్యాసం చేసే వారి ఖర్చులు తడిసిమోపెడవుతాయి. సెమిస్టర్ల వారీగా పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు విద్యా ఫీజు లక్ష డాలర్లైతే గతంలో రూ.65 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది రూ.68.50 లక్షలను దాటిపోతుంది. 

ఇటువంటి పరిస్థితులను అధిగమించేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈనాడూ రూపాయిపై డాలర్లను ‘ఫ్యూచర్స్’ మార్కెట్‌లో కొనుగోలు చేయడం ఉత్తమమని ఫారెక్స్ నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే ముందుగానే డాలర్లను కొనుగోలు చేయడం మరి ఉత్తమమని అంటున్నారు. కాంట్రాక్ట్ ఎక్స్ పైరీ తేదీని పరిగణనలోకి తీసుకుని ఫ్యూచర్స్‌లో డాలర్లు కొంటే ఉపయుక్తంగా ఉంటుందని, తద్వారా మరింత పతనాన్ని తట్టుకోగలమని చెబుతున్నారు. 

సందర్భోచితంగా డాలర్ విలువతో నిమిత్తం లేకుండా సమయం వచ్చినప్పుడే కొనుగోలు చేయడానికి బదులు డాలర్ విలువ తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటే అత్యుత్తమం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఫీజు చెల్లింపుల ఇన్‌స్టాల్‌మెంట్ల సమయంలో బదిలీ చేస్తే సరి. ఇటువంటి పద్దతులు అవలంభించడంతో వ్యయ భారం తగ్గించుకోవచ్చు. 

దీనికి తోడు విదేశాల్లో విద్యనభ్యసించే వారు స్కాలర్‌షిప్‌లపైనా, పార్ట్ టైమ్ ఉద్యోగాలపై కేంద్రీకరించాలని ఫైన్ వే క్యాపిటల్ సీఈఓ రాచిత్ చావ్లా సూచించారు. తద్వారా డాలర్‌పై రూపాయి హెచ్చుతగ్గులను బ్యాలెన్స్ చేసుకోవచ్చునని తెలిపారు. ప్రత్యేకించి రుణాలపై విదేశీ విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు వర్తిస్తుంది. విద్యార్థుల కోసం విడుదల చేసిన ఐఎస్ఐసీ కార్డులతో ప్రయాణ, షాపింగ్ వంటి కార్యక్రమాలు నిర్వర్తించాలని సూచించారు. అలాగే విదేశీ యానం చేయాలని భావించే వారు గానీ, వైద్య చికిత్స కోసం వెళ్లే వారికి అదనపు భారం తప్పదని చెప్తున్నారు.

మంగళవారం విడుదల చేసిన వాణిజ్య లోటు దేటా 18 బిలియన్ల డాలర్లకు పెరుగుతున్నది. 62 నెలల గరిష్టానికి చేరుకున్నది. జూన్ వాణిజ్య లోటు 16.6 బిలియన్ల డాలర్లుగా ఉన్నది. ఆరు నెలలుగా అంతర్జాతీయంగా పసిడి దిగుమతులు పెరిగిపోయాయి.