ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరింత బక్కచిక్కిపోతోంది. తాజాగా సోమవారం ఫారెక్స్‌ మార్కెట్లో నూతన జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్‌ మారకంలో 21 పైసలు నష్టపోయి 71.21 వద్ద నిలిచింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి ఫారెక్స్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ప్రారంభంలో స్వల్ప లాభంతో స్థిరంగా ఉన్నా, డాలర్ డిమాండ్‌ పెరిగింది. 

జీడీపీ గణాంకాలకు తోడు సాంకేతిక దన్నుతో రూపాయి ఆరంభం గట్టిగానే ఉన్నా మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా ఫారెక్స్‌ మార్కెట్లో పరిస్థితి మారిపోయింది.  ముడి చమురు ధర బ్యారెల్‌కు 78 డాలర్లు దాటడంతో ఫారెక్స్ మార్కెట్‌లో ఒక్కసారిగా డాలర్లకు డిమాండ్ పెరిగింది. చైనా - అమెరికా మధ్య యుద్ధ భయాలతో ఇన్వెస్టర్లలో భయం నెలకొనడంతో రూపాయి తన విలువను కోల్పోయింది. 

ఇన్వెస్టర్ల ఆందోళనలను తగ్గించి, సెంటిమెంట్‌ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. దీనికి తోడు జీడీపీ గణాంకాలు ఈక్విటీ మార్కెట్‌ను కూడా ఉత్సాహపరచలేకపోవడంతో కరెన్సీ మార్కెట్‌పై కూడా ఆ ప్రభావం పడింది. 

కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ కొన్ని రోజులుగా విదేశీ కరెన్సీ నిధులను నుంచి డాలర్లను అమ్మడం, వరుసగా రెండు పరపతి సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచడం వంటి చర్యలను తీసుకుంది. ముడి చమురు ధరల పెరుగుదలతో కరెంట్ ఖాతా లోటు కూడా ప్రమాదకరన స్థాయికి చేరుకుంది. ట్రేడ్ వార్ ఉద్రిక్తతలకు తోడు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణతో రూపాయి మారకం విలువ మరింత పతనం కావచ్చునన్న అంచనాలు ఉన్నాయి.

ఈ ఏడాది ఇప్పటికే రూపాయి మారకం విలువ 11 శాతం నష్టపోయింది. మిగతా దేశాల కరెన్సీ కన్నా రూపాయి మారకం విలువే ఎక్కువగా నష్టపోయింది. బాండ్లపై రాబడి అనేక ఏళ్ల తర్వాత 8 శాతాన్ని దాటింది. మరో వైపు డాలర్ ఇండెక్స్ పెరిగింది. కెనడా-అమెరికా, చైనా అమెరికా వాణిజ్య చర్చలు కొలిక్కి రాకుండానే ముగియడం, చైనాపై మరో 200 బిలియన్ డాలర్ల అదనపు సుంకాలను విధించడానికి ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడంతో వర్దమాన దేశాల కరెన్సీలన్నీ పతనం అవుతున్నాయి. 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ట్రేడ్ వార్ కరెన్సీ వార్‌తో రూపాయి మారకం విలువ మరింత పతనమై దాదాపు రూ.80 చేరుకునే అవకాశాలున్నట్టు అంచనా. కాగా, ఇప్పటికీ రూపాయి విలువ ఎక్కువగా ఉందన్న ఎస్‌బీఐ విశ్లేషణ, రూపాయి బలహీనత కన్నా డాలర్ బలమే ఎక్కువ అన్న నీతి ఆయోగ్ వ్యాఖ్యలతో రూపాయి మారకం విలువ మరింత పతనం కావచ్చునన్న అంచనాలకు బలం చేకూరుస్తున్నది.

ముఖ్యంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు బ్యారెల్‌ 78 డాలర్లకు చేరడం ట్రేడింగ్‌ వాతావరణాన్ని మార్చేసింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు నవంబర్‌ నుంచి అమల్లోకి వస్తే ఆ దేశం నుంచి చమురు ఉత్పత్తి తగ్గిపోయి, అది ధరలపై ప్రతిఫలిస్తుందన్న ఆందోళన పెరగడం చమురు ధరలకు ఆజ్యం పోయవచ్చని భావిస్తున్నారు. అమెరికా, ఒపెక్‌ నుంచి ఉత్పత్తి పెరిగినా అది పరిమితంగానే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. సోమవారం ఆసియాలో అత్యంత దారుణంగా పతనమైన కరెన్సీ రూపాయిదే.  

రూపాయి విలువ పతనం భారత ఎగుమతుల అభివృద్ధికి దోహదపడుతుందన్న అంచనాలకు విరుద్ధంగా ఇంజనీరింగ్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ) స్పందించింది. కరెన్సీ అస్థిరత అన్ని వేళలా ప్రయోజనాలు చేకూర్చలేదన్న అభిప్రాయ పడింది. దేశ ఇంజినీరింగ్‌ ఎగుమతుల వృద్ధి జూలైలో ఒక అంకె స్థాయి 9.4 శాతానికి తగ్గిపోయిందని ఈఈపీసీ తెలిపింది. అంతకుముందు నెలల్లో ఉన్న పెరుగుదల నుంచి పడిపోయినట్టు వివరించింది.

‘కరెన్సీ స్థిరంగా ఉంటేనే ఎగుమతులకు సానుకూలం. అంచనాల ఆధారంగా కొనుగోలు దారులతో వ్యవహారాలు నిర్వహించేందుకు వీలవుతుంది. అస్థిరతలు, ఆటుపోట్లన్నవి ఏ వైపు ఉన్నా కానీ దాంతో ఉపయోగం ఉండదు’’ అని ఈఈపీసీ ఇండియా చైర్మన్‌ రవి సెహగల్‌ తెలిపారు.