Asianet News TeluguAsianet News Telugu

రికార్డు స్థాయిలో రూపాయి పతనం

నెలాఖరు కావడంతో క్రూడాయిల్ దిగుమతుదారుల నుంచి ఎక్కువ డిమాండ్ పెరగడంతో డాలర్ విలువ పెరిగింది. తదనుగుణంగా రూపీ మారకం విలువ జీవిత కాల కనిష్టం రూ. 71కి చేరుకున్నది.

Rupee Collapses To New Record Low: Key Things To Know
Author
Mumbai, First Published Sep 1, 2018, 8:08 AM IST

ముంబై: అమెరికా డాలర్‌పై రూపాయి మార్కెట్ పతనానికి ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కన్పించడం లేదు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది. శుక్రవారం వారాంతపు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 71 స్థాయికి చేరుకున్నది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్లో గురువారం 15 పైసలు నష్టపోయి 70.74 వద్ద ముగిసిన డాలర్‌-రూపీ మారకం ట్రేడింగ్‌ తాజా సెషన్‌లో 70.95 వద్ద ప్రారంభమైంది. కొద్ది సేపటికే 71 స్థాయికి క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకొని తిరిగి 70.85 స్థాయికి పుంజుకున్నా చివరికి మళ్లీ కిందికి జారుకున్నది. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి 26 పైసల (0.37 శాతం) నష్టంతో రూ. 71 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు పెరుగడంతో అమెరికా డాలర్ విలువ బలోపేతం అయ్యిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు నేరుగా రంగంలోకి దిగి డాలర్లను విక్రయించాయి.
 
నెలాఖరు కావడంతో చమురు దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగిందని ఫారెక్స్‌ డీలర్లు తెలిపారు. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు మరింత పెరగవచ్చునన్న ఆందోళన నేపథ్యంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ మరింత బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల దెబ్బకు ద్రవ్యోల్బణం అదుపు తప్పవచ్చునన్న ఆందోళనలు, మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం సైతం రూపాయి తాజా పతనానికి కారణమయ్యాయి. గడిచిన ఏడాదికాలంలో రూపాయి విలువ 11 శాతం మేర పతనమైంది. 2018 జనవరి 1 నుంచి ఇప్పటివరకు 11 శాతం క్షీణించింది. బ్రిటన్‌ పౌండ్‌తోనూ రూపాయి విలువ మరింత 92.12కు చేరుకుంది.
 
రూపాయి విలువ క్రమంగా తగ్గుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానా, విదేశీ మారక నిల్వలతోపాటు ప్రజలపైనా ప్రభావం చూపనున్నది. దిగుమతి చేసుకున్న ముడి సరుకులతో ఉత్పత్తి చేసే సరుకుల ధరలు  పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తు, సేవల దిగుమతి భారం 10 శాతం మేర పెరిగిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
ఇక కేన్సర్‌తోపాటు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఔషధాల రేట్లూ పెరుగుతాయి.
 
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు స్వదేశంలోని కుటుంబ సభ్యులకు డబ్బులు పంపేందుకు ఇది మంచి తరుణమని విశ్లేషకులు అంటున్నారు. భారత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు, ఎగుమతిదారులకు రూపాయి క్షీణత బాగా కలిసిరానుంది. విదేశాలకు వస్తు, సేవల ఎగుమతిపై అదనపు ఆదాయం లభించనున్నదని అంటున్నారు.

ముడి చమురు ధరల పెరుగుదలతోపాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనంపై చింతించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ అంటోంది. ఇప్పటికీ రూపాయి విలువ ఉండాల్సిన దానికంటే అధికంగానే ఉన్నదని ఎస్బీఐ ఎండి పికె గుప్తా తెలిపారు. రూపాయి ఒక్కటే కాదు.. టర్కీ, అర్జెంటీనా, ఇండోనేషియా ఇలా వర్ధమాన దేశాల కరెన్సీలన్నింటి విలువ తగ్గుతూ వస్తోందన్నారు. చాలా దేశాల కరెన్సీలు రూపాయితో పోలిస్తే అధికంగా పతనమవుతున్నాయన్నారు.
 
అమెరికాతోపాటు విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే భారతీయులపై వ్యయ భారం పెరగనుంది. సాధారణంగా అమెరికా యూనివర్సిటీల్లో ఏడాదికి 30-40 వేల డాలర్ల ఫీజు చెల్లించాలి. కొన్ని నెలలక్రితం 64-65 వద్దనున్న రూపాయి మారకం రేటు ఏకంగా 71కి చేరుకోవడంతో విదేశాల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులపై భారం మరో రూ.3-4 లక్షల మేర పెరిగే అవకాశం ఉంది. విదేశీ పర్యటన ఖర్చులు కూడా పెరగనున్నాయి. ఎందుకంటే విమాన టికెట్లు, హోటల్‌ బుకింగ్స్‌ కోసం డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది. కాని డాలర్‌ కొనుగోలు కోసం అదనంగా వెచ్చించాల్సి వస్తుంది.
 
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మరింత పెరగడంతో దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా రూపాయితోపాటు వర్ధమాన దేశాల మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడి పడింది. వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఇకపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ దూకుడుగా వ్యవహరించవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ క్రమంగా బలపడుతూ వస్తోంది. దీనికి తోడు చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కూడా ఒక కారణమేనన్న అభిప్రాయం ఉంది. మరోవైపు భారత డిఫెన్స్ రంగ సంస్థల నుంచి డిమాండ్ వచ్చిందని హెచ్డీఎఫ్ సీ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ అండ్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటర్జీ హెడ్ వీకే శర్మ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios