Asianet News TeluguAsianet News Telugu

ప్చ్! నో యూజ్!! డిసెంబర్ కల్లా డాలర్‌పై రూపీ @72

అనుకున్నంతా అయ్యింది. డాలర్ పై రూపాయి మారకం విలువ 70 దాటేసింది. ఆర్బీఐ జోక్యంతో రికవరీ సాధించినా ఉపయోగం లేదన్న విమర్శ ఉంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి విలువ 72కు చేరుతుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్‌క్లేన్ జోస్యం చెప్పడం ఆందోళనకరమే మరి. 

Rupee breaches 70 mark, putting pressure on govt
Author
New Delhi, First Published Aug 15, 2018, 7:41 AM IST

న్యూఢిల్లీ: టర్కీ కరెన్సీ పతనంతో డాలర్‌పై రూపాయి మారకం విలువ 70.08 వరకు పతనమై తర్వాత ఆర్బీఐ జోక్యంతో రికవరీ సాధించినా అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం బార్‌క్లేస్‌ మాత్రం పెదవి విరిచింది. బేరిష్‌ రూపాయిపై అంతర్జాతీయ బ్యాంకింగ్‌ దిగ్గజం బార్‌క్లేస్‌ అత్యంత బేరిష్‌ వైఖరి ప్రకటించింది. 2013లో ఏర్పడిన పతనం కన్నా ఈ ఏడాది రూపాయి పతనం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసింది. ఏడాది చివరికల్లా డాలర్‌ మారకంలో రూపాయి 72 స్థాయికి దిగజారుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. 

మున్ముందు నిత్యావవసరాల ధరలు పైపైకే


అదే నిజమైతే నిత్యావసర వస్తువుల ధరలు పైపైకి దూసుకెళ్లడం ఖాయమే. ఇక అంతర్జాతీయ వాణిజ్యంలో వాణిజ్య లోటు.. ఆ పై కరంట్ ఖాతా లోటు పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. బార్ క్లేస్ అంచనా నిజమైతే ఈ ఏడాది మొత్తంలో రూపాయి 11.3 శాతం పతనం అయినట్లవుతుంది. వివిధ రకాల ఒత్తిళ్లతో అని ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 9.49 శాతం, ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతం విలువను కోల్పోయింది.
 
డాలర్లపైనే ఇన్వెస్టర్ల చూపులు


ఇదిలా ఉండగా బాండ్లపై రాబడులు తక్కువగా ఉండడం, ఆర్బీఐ విధానాల్లో లోపించిన స్పష్టత, మరో ఏడాదిలో ఎన్నికలు జరుగనున్న స్థితిలో రాజకీయ సునిశిత స్థితి కారణంగా మార్కెట్లోకి పెట్టుబడులను ఆకర్షించడం కూడా కష్టమేనని బార్‌క్లేస్‌ బ్యాంక్ విశ్లేషకులు హమిశ్‌ పెప్పర్‌, డెనిస్‌ టాన్‌  పేర్కొన్నారు. టర్కీ సంక్షోభంతో అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లందరూ డాలర్‌ పెట్టుబడులే ప్రస్తుతానికి సురక్షితం అని భావించి అమెరికన్‌ కరెన్సీ వైపు మొగ్గు చూపించడం కూడా రూపాయి తాజా పతనానికి మరో కారణం. అంతర్జాతీయ విపణిలో కొద్ది కాలంగా స్తబ్దంగా ఉన్న క్రూడాయిల్‌ ధరలు పుంజుకోవడం, స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ సంస్థలు భారీగా నిధులు ఉపసంహరించడం, కరెంట్‌ ఖాతా లోటు భయాలు కూడా ఈ క్షీణతలో తమ వంతు పాత్ర పోషించాయి.

అమెరికా - టర్కీ మధ్య నలుగుతున్న రూపాయి 


శుక్రవారం నుంచి మొదలైన టర్కీ కరెన్సీ ‘లీరా’ పతనం సంక్షోభం మంగళవారం కూడా ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయిపై తీవ్ర ప్రభావం చూపింది. చారిత్రక స్థాయిలో కొనసాగిన రూపాయి పతనం ఒకానొక దశలో 70.08 చేరుకోవడం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా దడ పుట్టిస్తోంది. ఆర్‌బిఐ జోక్యంతో కొంతమేరకు కోలుకున్నది. ఆర్‌బిఐ జోక్యం చేసుకుని మార్కెట్లో డాలర్లు విక్రయించకపోతే ఈ పతనం మరింత తీవ్రంగానే ఉండేదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఒక్క రోజే ఆర్బీఐ 23 బిలియన్ల డాలర్లను మార్కెట్ లోకి వదిలిందని వార్తలొచ్చాయి. అమెరికా, టర్కీ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారమే దేశీయ కరెన్సీ గరిష్ఠంగా 1.08 రూపాయల మేరకు క్షీణించి 69.93 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.  టర్కీ కరెన్సీ చారిత్రక కనిష్ఠ స్థాయిల నుంచి కోలుకోవడం, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో ఏర్పడిన రికవరీ కూడా రూపాయి కోలుకునేందుకు సహకరించింది. చివరికి సోమవారం నాటి ముగింపు ధర కన్నా నాలుగు పైసలు ఎగువన 69.89 వద్ద రూపాయి క్లోజైంది.
 
ఫారెక్స్‌ పరిమితులు తప్పనిసరని ఆర్థికవేత్తల సూచనలు


రూపాయి క్షీణతను నిలువరించడానికి ఫారెక్స్‌ పరిమితులు విధించడం అవసరమని కోల్‌కతా ఆర్థికవేత్త అభిరూప్‌ సర్కార్‌ అన్నారు. ప్రధానంగా డాలర్ల సరఫరాపై ఆంక్షలు విధించాలని, అనవసర దిగుమతులను నిలువరించాలని విదేశాలకు విలాస యాత్రలపై కూడా కొన్ని రోజులు ఆంక్షలు విధించడం అవసరమని ఆయన చెప్పారు. కానీ క్రిసిల్‌ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి మాత్రం ఇంకా ఫారెక్స్ పై ఆంక్షలు విధించే తీవ్రమైన పరిస్థితి ఇంకా రాలేదన్నారు. సమీప భవిష్యత్‌లో రూపాయి కదలికలను నిర్దేశించేది వర్థమాన మార్కెట్ల కరెన్సీ కదలికలు, డాలర్‌ బలం, క్రూడాయిల్‌ ధరలేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఫారెక్స్‌ నిల్వలు తగినంతగా ఉన్నాయని ఇతర వర్థమాన మార్కెట్ల కరెన్సీలకు దీటుగా రూపాయి క్షీణిస్తున్నంత వరకు ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని కాపాడేందుకు ఆ పతనం కొనసాగనీయడమే మంచిదని ఇక్రా ప్రిన్సిపల్‌ ఆర్థికవేత్త అదితి నాయర్‌ చెప్పారు.
 
69-70 మధ్యన స్థిరపడుతుందన్న ఎస్బీఐ చైర్మన్ రజనీష్‌ కుమార్‌


రూపాయికి గరిష్ఠ టార్గెట్‌ ఏదీ నిర్దేశించడానికి కూడా ఆర్బీఐ సిద్ధంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ప్రపంచంలోని అన్ని కరెన్సీల్లో ఏర్పడిన పతనం స్థాయితో పోల్చితే రూపాయి మరీ అంతగా దిగజారలేదని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ అన్నారు. దేశీయ బాండ్‌, ఈక్విటీ మార్కెట్లలోకి వస్తున్న పెట్టుబడుల తీరును పరిగణనలోకి తీసుకుంటే రూపాయి విలువ 69-70 మధ్యన స్థిరపడవచ్చునని ఆయన జోస్యం చెప్పారు. విదేశీ పెట్టుబడులకు ఇది ఆకర్షణీయమైన స్థాయి అని కూడా రజనీష్‌ అన్నారు.
 
80కి వెళ్లినా భయం లేదన్న కేంద్రం


రూపాయిలో ఈ పతనం గురించి భయపడాల్సిందేమీ లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. వరుసగా రెండు రోజుల్లో రూపాయి భారీ క్షీణత నమోదైన నేపథ్యంలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రూపాయి తాజా క్షీణతకు అంతర్జాతీయ పరిణామాలే కారణమని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని ఇతర కరెన్సీల్లో కూడా పతనం ఇంతే తీవ్రంగా ఉండడం గమనించాలన్నారు. ఇతర కరెన్సీల్లో పతనం ఇదే తీరులో కొనసాగినంత వరకు రూపాయి 80 స్థాయికి క్షీణించినా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్‌బిఐ వద్ద తగినన్ని విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని, ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకునేందుకు ఈ నిల్వలు సరిపోతాయని గార్గ్‌ చెప్పారు.
 
మేక్‌ ఇన్‌ ఇండియాకు అనువుగా మార్చుకోవాలన్న ఆనంద్ మహీంద్రా


రూపాయి చారిత్రక కనిష్ఠ స్థాయిలకు దిగజారడాన్ని అనుకూలంగా మలుచుకుని ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచాలని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. రూపాయి పతనం చూసి కలత చెందే కన్నా మేక్‌ ఇన్‌ ఇండియాను ఉత్తేజితం చేయడానికి దీన్ని చక్కని అవకాశంగా మలుచుకోవచ్చునని ఆనంద్‌ మహీంద్రా అభిప్రాయపడ్డారు. కాకపోతే తాత్కాలికంగా ఎగుమతిదారులకు లబ్ది చేకూరే అవకాశాలు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios