Asianet News TeluguAsianet News Telugu

రూపీ @ 70: మీ పర్స్‌కు ఇలా చిల్లు!!

టర్కీ కరెన్సీ ‘లీరా’ పతనం ప్రభావం రూపాయితోపాటు అన్ని దేశాల కరెన్సీపై పడుతుంది. దీంతో వాణిజ్యలోటు, కరంట్ ఖాతా లోటు పెరుగుతాయి. అంతేకాదు ప్రజల పర్సులకు కూడా చిల్లు పడుతుంది. 

Rupee @ 70 per dollar mark: How does a weak rupee impact your finances?
Author
Mumbai, First Published Aug 18, 2018, 7:44 AM IST

హైదరాబాద్: ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు కరెన్సీ వార్‌తో అతలాకుతలం అవుతున్నాయి.  డాలర్‌పై రూపాయి మారకం విలువ రోజు రోజుకు తరిగిపోతున్నది. రూపాయి విలువ క్షీణించడంతో వాణిజ్య లోటు, కరెంట్ అకౌంట్ ఖాతా లోటు పెరుగుతుండటం సహజ సిద్ధ పరిణామం. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు వీటిని కొలబద్దగా చూస్తే పరిస్థితులు అంత ప్రోత్సాహకరంగా లేవు. రూపాయి మారకం విలువ గత మూడు రోజులుగా రూ. 70 పైనే స్థిరంగా కొనసాగుతోంది. ఇదే విధంగా రూపాయి మారకం విలువ క్షీణిస్తూ వస్తే మన వ్యక్తిగత ఫైనాన్స్‌లు ఏ విధంగా ప్రభావితం అవుతాయో చూద్దాం. 

మీ పెట్టుబడులు డాలర్ రూపేణా బంగారంపై గానీ పెట్టి ఉంటే వాటి విలువలు కూడా పెరుగుతాయి. ఉదాహరణకు డాలర్లలో ట్రేడ్ అయ్యే షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ పండ్లలో మీరు మదుపు చేస్తే వాటి విలువ పెరుగుతుంది. అలాగే వాటి ఎన్‌ఏవీని రూపాయల్లో చూపిస్తే అధిక రాబడి ఉంటుంది. విదేశీ మార్కెట్లలో ట్రేడ్ అయ్యే స్టాక్స్ మదుపు చేసే అనేక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటి ఎన్‌ఏవీలన్నీ సహజంగా పెరుగుతాయి. ఉదాహరణకు మీరు ఇల్లు కొనుగోలుకు ఐదు లక్షల మిలియన్ల డాలర్లు చెల్లించారనుకోండి. దాని విలువ రూపాయిల్లో పెరుగుతుంది. డాలర్ విలువలో ధర స్థిరంగా ఉన్నా రూపాయి పతనాన్ని బట్టి విలువ పెరుగుతుంది. బంగారం విలువ కూడా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ ఔన్స్ బంగారం ధర గతంలో కన్నా తగ్గినప్పటికీ మన దేశంలో బంగారం ధరలో పెద్దగా మార్పు లేకపోవడానికి కారణం డాలర్-రూపాయి మారకం విలువే. రూపాయి పతనం అయ్యే కొద్ది బంగార ధర కూడా రూపాయిల్లో పెరుగుతుంది. అయితే పసిడిపై పెట్టుబడి మాత్రం వ్యూహాత్మకంగా ప్రయోజనం చేకూరుస్తుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈక్విటీ మార్కెట్‌లో తలెత్తే రిస్క్‌ల నుంచి బయటపడేందుకు వెసులుబాటు కల్పిస్తుందని పేర్కొన్నారు.

మన దేశం దిగుమతి చేసుకుంటున్న ఇంధనం, బంగారం, మొబైల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. అధిక ధరలు కాస్త అధిక ద్రవ్యోల్భణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో మనం తీసుకునే రుణాలపైనా అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే గత రెండు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల హయాంలో పొదుపు చేయదగిన మొత్తాలు కూడా తగ్గిపోతాయని ప్లాన్ ఎహెడ్ వెల్త్ మేనేజర్స్ చీఫ్ ఫైనాన్సియల్ ప్లానర్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ పేర్కొన్నారు. 

డాలర్లను దేశంలోకి ఆకర్షించడానికి రూపాయి మారకం విలువను పతనం కాకుండా నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టనున్నదన్న కధనాలు వెలువడుతున్నాయి. అధిక వడ్డీ రేటుతో ఎన్నారై బాండ్లను జారీ చేయవచ్చునన్న అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే విదేశీ మారక నిల్వలు సరిపడా ఉన్నందున ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టడానికి కొంత సమయం తీసుకోవచ్చు. కరెన్సీ మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగే కొద్దీ.. రూపాయి విలువ స్థిరత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఎన్నారై బాండ్లను జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కనుక అధిక రిస్క్ ఉండే సాధనాల్లో కాకుండా భద్రత ఎక్కువగా ఉండే సాధనాల్లోనే మదుపు చేయడం ఉత్తమ మార్గం అని అంటున్నారు.

డాలర్లలో చేసే చెల్లింపులు ఏవైనా ఇక నుంచి మరింత ప్రియమవుతాయి. ఉదాహరణకు మీ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని అనుకుందాం. నెలకు 2000 డాలర్ల వ్యయం అవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో రూపాయి-డాలర్ మారకం విలువ రూ.65 ఉన్నప్పుడు మీకైన వ్యయం రూ. 1.30 లక్షలు. కానీ, ఇప్పుడు అదే మారకం విలువ రూ. 70 దాటింది. దాంతో మీరు రూ. 1,40,000 పైన చెల్లించాల్సి వస్తుందన్నమాట. మారకం విలువ పతనం అయ్యేకొద్దీ మీకు వ్యయం పెరుగుతుంది. అలాగే విదేశీ యాత్రలు కూడా వ్యయభరితమవుతాయి. ఒకవేళ మీరు కొనే వస్తువులు లేదా సేవలకు డాలర్లలో చెల్లింపులు ఉంటే వాటి ఖరీదు కూడా పెరుగుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios