మోసపూరితంగా బ్యాంకులకు దాదాపు రూ.8,100 కోట్ల మేర రుణాలను ఎగవేతకు పాల్పడిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ కేసు విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వేగం పెంచింది. ఈ కేసు విషయమై దాదాపు 21 దేశాల నుంచి సమాచారం కొరేందుకు ఈడీకి కోర్టు అనుమతినిచ్చింది.

భారత్‌లోని భారీ బ్యాంక్‌ మోసాల్లో ఒకటిగా పేర్కొంటున్న ఈ కేసులో 21 దేశాల సాయం కోరేందుకు గాను లెటర్స్‌ రొగేటరీని (ఎల్‌ఆర్‌) జారీ చేసేందుకు కోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి అనుమితినిచ్చింది.

గుజరాత్‌ కేంద్రంగా సాగిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ బ్యాంక్‌ మోసం కేసును విచారిస్తున్న ఢిల్లీ సెషన్స్‌ జడ్జి సతీష్‌ కుమార్‌ అరోరా ఈడీ ఎల్‌ఆర్‌ను జారీ చేసేందుకు అనుమతి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

దీంతో చైనా, అమెరికా, పనామా, ఆస్ట్రియా దేశాల నుంచి ఈడీ ఈ కేసు విచారణకు కావాల్సిన సమాచారాన్ని పొందేందుకు వీలు కలుగనుంది. మోసం వెలుగుచూసిన నేపథ్యంలో స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు నితిన్‌ సందేసరా, చేతన్‌ కుమార్‌ సందేసరాలు భారత్‌ నుంచి పారిపోయి అల్బేనియాలో స్థానిక పౌరసత్వం పొందారు.

నితిన్ సందేసరా, చేతన్ కుమార్ సందేసరా కూడా అల్బేనియాలోనేనే తల దాచుకుంటున్నట్లు ఈడీ వర్గాలకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి కూడా ఈడీ ఎల్‌ఆర్‌ను జారీ చేసేందుకు కోర్టు సమ్మతించింది

ఈడీ అభ్యర్థన మేరకు ఈ నెల 20 స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ డైరెక్టర్‌ హితీష్‌ నరేందర్‌ బారు పటేల్‌ను ఇంటర్‌పోల్‌ పోలీసులు అల్బేనియా రాజధాని టిరానాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

పరిశీలనలో ఉన్న దేశాలతోపాటు స్విట్జర్లాండ్‌, హాంకాంగ్‌, ఇండోనేషియా, బార్బడొస్‌, బెర్ముడా, బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, సైప్రస్‌, కొమొరోస్‌, జెర్సీ, లిచిటెన్‌స్టిన్‌, మార్షియస్‌, నైజీరియా, సెచిల్లేస్‌ తదితర దేశాలకు కూడా ఈడీ తరువాత దశలో ఎల్‌ఆర్‌ను జారీ చేయనుంది.

ఆంధ్రాబ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల బృందం నుంచి స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ అక్రమంగా దాదాపు రూ.5000 కోట్ల మేర రుణాలను స్వీకరించింది. ఇది అనతి కాలంలోనే మొండి బాకీగా మారింది. ఈ సొమ్ముతో సంస్థ డైరెక్టర్లు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి.

దీంతో ఈ సంస్థ బ్యాంకుకు టోపీ పెట్టిన మొత్తం మోసం విలువ దాదాపు రూ.8,100 కోట్లకు చేరిందని దర్యాప్తు సంస్థల లెక్కలు చెబుతున్నాయి. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ స్టెర్లింగ్‌ బయోటెక్‌పై మనీల్యాండరింగ్‌కు పాల్పడిందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.

సంస్థ మోసానికి సంబంధించి ప్రమోటర్లకు ఆదాయం పన్ను శాఖకు చెందిన సీనియనఖ అధికారులు సహకరించారన్న కోణంలోనూ ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసుపై విచారణ సంస్థ అయిదు చార్జిషిట్లు దాఖలు చేసింది. దాదాపు రూ.4,710 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.