సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ లభించడంతో స్టాక్‌మార్కెట్లు గత వారం లాభాల్లోకి దూసుకెళ్లాయి. శుక్రవారంతో ముగిసిన ఐదు రోజుల్లో (ఈ 20 నుంచి 24వ తేదీ వరకు) దేశీయ స్టాక్‌ మార్కెట్లలో మదుపరుల సంపద దాదాపు రూ.6 లక్షల కోట్ల మేర పెరిగింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో మొదలైన మార్కెట్లలో హుషారు శుక్రవారం కూడా కనిపించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన గురువారం బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ రికార్డు స్థాయిలో 40,000 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని చేరింది. అదే దారిలో ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ సైతం 12000 పాయింట్ల రికార్డు గరిష్టాన్ని తాకింది.

తరువాత మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్న సంగతి తెలిసిందే.

ఆ తరువాత శుక్రవారం కొంత మేర తేరుకున్న మదుపరులు తక్కువ ధర వద్ద అందుబాటులోకి వచ్చిన స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో వారాంతంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 623 పాయింట్లకు పైగా లాభపడి 37,930.77 పాయింట్ల వద్ద ముగిసింది. 

వారాంతంలో ఈ నెల 24వ తేదీ నాటికి మార్కెట్లు ముగిసే (24న) సమయానికి బీఎస్‌ఈ క్యాపిటలైజేషన్‌ రూ.152.7 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకు ముందు మే 17వ తేదీన బీఎస్‌ఈ ఎం-క్యాప్‌ విలువ రూ.1.46 లక్షల కోట్లుగా నిలిచింది. 

మార్కెట్లు పరుగులు పెట్టడంలో విదేశీ సంస్థాగత మదుపరుల పాత్ర గణనీయంగా కనిపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మార్కెట్లో మదుపరుల సంపద దాదాపు రూ.2.53 లక్షల కోట్ల మేర పెరిగి రూ.1,52,71,401.47 కోట్లకు చేరుకుంది.

అంతర్జాతీయ పరిస్థితుల ప్రతికూలతలకు తోడు భారత్‌లో సుస్థిరమైన ప్రభుత్వం కొలువుదీరనుండడం దేశీయ స్టాక్‌ మార్కెట్లకు బాగా కలిసి వస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది జూన్‌ నాటికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 45 వేల పాయింట్ల గరిష్టాన్ని చేరే అవకాశం బలంగా ఉందని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది.

మరోవైపు జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఎన్‌ఎస్‌ఈ సూచీ ‘నిఫ్టీ’ కూడా 13,500 పాయింట్ల జీవితకాల గరిష్టాన్ని చేరుతుందని మోర్గాన్‌ స్టాన్లీ  తెలిపింది. మరోవైపు ప్రముఖ మార్కెట్‌ రీసర్చ్‌ సంస్థ ఎడిల్‌వైజ్‌ రీసర్చ్‌ కూడా ఇదే అభిప్రాయం వెల్లడించింది.

ఎన్నికలు ముగియడంతో దేశంలోని మందగమన పరిస్థితులను పారదోలి, కొత్త ఊపును అందించేలా చర్యలు అమలులోకి వచ్చే అవకాశం ఉందని దీంతో దేశీయ మార్కెట్లు 2020 జూన్‌ నాటికి 3 శాతం మేర పరుగులు పెట్టే అవాకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషించింది.

నరేంద్ర మోదీ సర్కార్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చిన నేపథ్యంలో దేశ వృద్ధిరేటును పరుగులు పెట్టించేందుకు మరోదఫా సంస్కరణలకు ఎన్‌డీఏ తెర తీసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. 

దీంతో ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుందని ఫలితంగా మార్కెట్లు కూడా లబ్ది పొందే అవకాశం ఉన్నట్టుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ సంస్థ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు. 

శుక్రవారంతో మొదలైన స్టాక్ మార్కెట్ల పరుగు రానున్న రోజుల్లో కొత్త తీరాలను తాకుతుందని వారు విశ్లేషించారు. ఆర్థిక వ్యవస్థలో అంతర్జాతీయంగా ఉన్న మందగమన పరిస్థితలు, ట్రేడ్‌వార్‌ మూలంగా ప్రపంచ వ్యాప్తంగా మందగమన పరిస్థితులు మరింత జఠిలమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

దీంతో మాంద్యం తరహా పరిస్థితుల నియంత్రణకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను ప్రస్తుతం ఉన్న స్థాయివద్దే నిలిపి ఉంచే అవకాశం ఉందని. దీంతో వడ్డీ లాభదాయకంగా లేకపోవడంతో మదుపరులు తమ సంపదను స్వల్పకాలానికి సుస్థిరమైన భారత మార్కెట్లకు తరలించే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లు కొత్త తీరాలను చేరే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.