Asianet News TeluguAsianet News Telugu

కార్పోరేట్ రారాజు రిలయన్స్... రూ.10 వేల కోట్ల లాభంతో కొత్త చరిత్ర

త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో కార్పొరేట్ ప్రపంచంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డులు నెలకొల్పింది. వరుసగా ఆరో త్రైమాసికంలో లాభాలను పెంచుకుంటూ వచ్చిన రిలయన్స్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.10,251 కోట్ల నికర లాభం గడించింది

RIL Q3 beats the Street with help from Reliance Jio, Retail
Author
Mumbai, First Published Jan 18, 2019, 10:40 AM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘కార్పొరేట్’ సంస్థల చరిత్రలో రికార్డు నెలకొల్పింది.  చమురు నుంచి టెలికాం దాకా సేవలందించే ఈ దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో రూ.10,251 కోట్ల నికర లాభం గడించింది. ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకు పై చిలుకు నికర లాభం పొందిన తొలి ప్రైవేట్ కంపెనీగా నిలిచింది. 

సంస్థ ఆదాయం రూ.1.71 లక్షల కోట్ల పైనే
రిలయన్స్ సంస్థకు రిటైల్‌, టెలికాం బిజినెస్‌లు కలిసొచ్చాయి. సంస్థ మూడు నెలల ఆధాయం రూ.1,71,336 కోట్లకు చేరుకున్నది. ఇటీవలి వరకు రిలయన్స్ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచిన చమురు రిఫైనింగ్‌ రంగంలో మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా.. ఇతర విభాగాలు రాణించడంతో దాని ప్రభావం కనిపించలేదు.

షేర్‌పై 17.3 ఈపీఎస్ ఆర్జించిన ఆర్ఐఎల్
అంటే షేర్‌కు రూ.17.3(ఈపీఎస్‌) ఆర్జించింది. 2017లో ఇదే మూడు నెలల సమయంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.9,420 కోట్లు(రూ.16 షేరుకు)గా నమోదైందని కంపెనీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. 

2013లో ఐఓసీ తర్వాత రిలయన్స్‌దే రికార్డు
ఇప్పటిదాకా దేశీయంగా ఏ ప్రైవేట్ కంపెనీ కూడా రూ.10,000 కోట్లకు పైగా లాభాన్ని ప్రకటించలేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) మాత్రం 2013 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.14,512.81 కోట్ల లాభం ప్రకటించింది. ఇప్పటిదాకా భారత కార్పొరేట్‌ చరిత్రలో ఐఓసీదే అత్యధిక త్రైమాసిక లాభం. 

సబ్సిడీ ఒకేసారి చెల్లించడంతో ఐఓసీ రికార్డు
ఆ ఏడాది మొత్తానికి సంబంధించిన సబ్సిడీని ఒకే త్రైమాసికంలో పొందడంతో ‘ఐఓసీ’ లాభం భారీగా నమోదైంది. ఆ ఏడాది కంపెనీ అంతక్రితం త్రైమాసికాల్లో సబ్సిడీ మద్దతు లేక నష్టాలు నమోదు చేయడంతో వార్షిక లాభం  రూ.5005.17 కోట్లే నమోదు చేయడం గమనార్హం.

56% వృద్ధి చెందిన ఆర్ఐఎల్ ఇన్ కం
2018 -19 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ ఆదాయం ఏకంగా 56 శాతం వృద్ధి చెందింది. రూ.1,71,336 కోట్లు నమోదైంది. ఓ వైపు చమురు రిఫైనింగ్‌ వ్యాపారంలో మార్జిన్ల ఒత్తిడి కనిపించింది.

ఆదుకున్న రిటైల్, టెలికం
రిటైల్‌, టెలికాం వ్యాపారాలు కంపెనీని ఆదుకున్నాయి. మరిన్ని రిటైల్‌ స్టోర్లను తెరవడం, తన టెలికాం అనుబంధ సంస్థ జియోకు అదనంగా 2.8 కోట్ల కొత్త వినియోగదారులు జత కలవడం వంటివి లాభదాయకతను పెంచాయి. 

రిలయన్స్ ఫలితాలతో గర్విస్తున్నానన్న ముకేశ్ అంబానీ
‘రూ.10,000 కోట్ల పై చిలుకు త్రైమాసిక లాభాన్ని పొందిన తొలి భారత ప్రైవేట్ రంగ కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవతరించింది. దీన్ని సాధించిన రిలయన్స్‌ బృందంలో నేనూ భాగస్వామిగా ఉన్నందుకు గర్విస్తున్నా’ అని రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. 

టెలికం, రిటైల్ లాభదాయకత పెంచాయన్న ముఖేశ్ అంబానీ
తాము ఫలితాలను సమీక్షిస్తున్న సమయంలో చమురు ధరలు తీవ్ర ఊగిసలాటకు గురైనా బలమైన ఫలితాలను ప్రకటించామని ఆర్ఐఎల్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. రిటైల్‌, జియో విభాగాలు మా లాభదాయకతను విశేషంగా పెంచడంతోపాటు తమ వాటాను స్థిరంగా పెంచుకుంటూ వెళుతున్నాయని ఫలితాల సందర్భంగా ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ పేర్కొన్నారు.

పెట్రో కెమికల్స్ వ్యాపారంలో 43% వృద్ధి 
కంపెనీ పెట్రో కెమికల్స్ సెగ్మెంట్ రూ.8221 కోట్ల పన్నుకు ముందు లాభాన్ని పొందింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 43 శాతం ఎక్కువ. పాలిమర్‌ ఉత్పత్తుల, ఫైబర్‌ ఇంటర్మీడియేట్స్‌లను అధికంగా ఉత్పత్తి చేయడం ఇందుకు నేపథ్యం.

ప్రతీ బ్యారెల్ చమురుకు 8.8 డాలర్లను కంపెనీ పొందింది. అక్టోబర్-డిసెంబర్ 2017లో మాత్రం ఇది 11.6 డాలర్లు. స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌ కూడా రెండో త్రైమాసికంలో 9.5 డాలర్ల కంటే తక్కువే. చమురు-సహజ వాయువు వ్యాపారంలో నష్టం రెండో త్రైమాసికంలో రూ.480 కోట్లు కాగా, ఈ మూడో త్రైమాసికం నాటికి రూ.185 కోట్లకు పరిమితమైంది.

రూ.2.74 లక్షల కోట్లకు రిలయన్స్ రుణాలు
2018 డిసెంబర్ నెలాఖరు నాటికి రిలయన్స్ రుణాలు రూ.2,74,381 కోట్లకు పెరిగాయి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఇవి రూ.2,58,701 కోట్లు; మార్చి 31 నాటికి రూ.2,18,763 కోట్లు మాత్రమే. ఇక కంపెనీ చేతిలోని నగదు నిల్వలు మాత్రం రూ.77,933 కోట్లకు పెరిగాయి.

జియో లాభంలో 65% వృద్ధి సాధించిన రిలయన్స్
గ్రూప్‌ టెలికాం విభాగమైన రిలయన్స్‌ జియో స్టాండలోన్‌ నికర లాభం రూ.831 కోట్లకు చేరింది. 2017 అక్టోబర్-డిసెంబర్‌ మధ్య నమోదైన రూ.504 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 65 శాతం ఎక్కువ కావడం విశేషం. 

కస్టమర్ల పెరుగుదలతో పెద్దగా చూపని ప్రభావం
సగటున ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం తగ్గుతున్నా డిసెంబర్ నెలాఖరుకల్లా టెలికం వినియోగదార్ల సంఖ్య ఏకంగా 28 కోట్లకు చేరడంతో ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. 2017లో ఇదే సమయంలో వినియోగదార్ల సంఖ్య 16 కోట్ల మంది మాత్రమే. 

మా దృక్ఫథం ప్రకారమే ‘జియో’ అడుగులు
‘జియో కుటుంబంలో ఇపుడు 28 కోట్ల మంది వినియోగదార్లున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్‌ డేటా నెట్‌వర్క్‌ల్లో ఒకటిగా వృద్ధి చెందుతూనే ఉంది. ప్రతి ఒక్కరికీ, ప్రతి చోట, ప్రతి అంశానికి అనుసంధానం చేయాలన్న మా దృక్ఫథం ప్రకారమే అడుగులు పడుతున్నాయి.

అత్యధిక నాణ్యతను అత్యంత చౌకగా అందించడానికి కట్టుబడి ఉంటాం. అదే సమయంలో తదుపరి తరం ఎఫ్‌టీటీఎక్స్‌ సేవల ద్వారా గృహాలను, కంపెనీలకు చక్కటి అనుసంధాన మార్గాలను అన్వేషిస్తున్నాం’అని రిలయన్స్ సీఎండీ ముకేశ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గురువారం బీఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ 0.03% నష్టంతో రూ.1133.75 వద్ద  ముగిసింది.

రెండింతలు పెరిగిన ‘రిటైల్’ లాభం  
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్‌ రిటైల్‌ పన్నుకు ముందు లాభం రెండింతలు పెరిగింది. పండగల విక్రయాలు, కొత్త స్టోర్లుప్రారంభించడమే దీనికి కారణం. 6,400కు పైగా పట్టణాలు, నగరాల్లోని 9,907 స్టోర్ల ద్వారా రూ.1680 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

2017లో లాభం రూ.606 కోట్లు మాత్రమే.  ఇక ఆదాయం కూడా 89.25% వృద్ధి చెంది రూ.35,577 కోట్లని తెలిపింది. వరుస ఐదు త్రైమాసికాలుగా ఆదాయాలు దాదాపు రెట్టింపవుతూనే ఉన్నాయని రిలయన్స్ పేర్కొంది. 

‘రిటైల్’ స్టోర్లను సందర్శించిన 13.9 కోట్ల మంది
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 13.9 కోట్ల మంది రిలయన్స్ రిటైల్ స్టోర్లను సందర్శించారు. డిసెంబర్ త్రైమాసికంలోనే ఫ్యాషన్‌, రిటైల్‌ విభాగంలో 100 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో  25 కొత్త నగరాలకు సేవలను విస్తరించినట్లైంది. రిలయన్స్‌ రిటైల్‌ ఆధ్వర్యంలో 21 కొత్త డిజిటల్‌ స్టోర్లను ప్రారంభించగా, రిలయన్స్‌ జువెల్స్‌ కూడా 100 స్టోర్ల మార్కును అధిగమించింది.

ఇలా రిలయన్స్ లాభాలు..
2017 జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.8,097 కోట్ల నికర లాభం గడించింది. తర్వాతీ త్రైమాసికంలో రూ.9,406 కోట్ల లాభం పొందింది. 2018 మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో స్వల్పంగా పెరిగి రూ.9,459 కోట్లకు చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.9,485 కోట్లకు పరిమితమైనా.. సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో తిరిగి రూ.9,549 కోట్ల నికర లాభం గడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios