కోవిడ్ -19 మహమ్మారి వల్ల ఏర్పడిన తీవ్ర అంతరాయం కారణంగా భారతీయ విమానయాన సంస్థల ఆదాయం 85 శాతం తగ్గి 3,651 కోట్ల రూపాయలకు చేరుకుంది అని తెలిపారు. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని  పేర్కొన్నారు.

ఏడాది క్రితంతో పోల్చితే భారత విమానయాన సంస్థలు 85.7 శాతం ఆదాయాన్ని కోల్పోయాయని చెప్పారు. భారత క్యారియర్‌లలో ఉద్యోగుల సంఖ్య మార్చి 31న 74,887 నుండి జూలై 31 నాటికి 69,589కు అంటే 7.07 శాతం తగ్గిందని చెప్పారు.

విమానాశ్రయ నిర్వాహకుల ఆదాయం 2019 ఏప్రిల్-జూన్ కాలంలో రూ.5,745 కోట్లు ఉండగా 2020 ఏప్రిల్-జూన్ కాలంలో రూ.884 కోట్ల ఆదాయం మాత్రమే అని ఆయన చెప్పారు. విమానాశ్రయాలలో ఉద్యోగుల సంఖ్య కూడా మార్చి 31న 67,760 ఉండగా జూలై 31నాటికి 64,514కు తగ్గిందని చెప్పారు.

దేశవ్యాప్తంగా కఠినమైన కోవిడ్ -19 లాక్ డౌన్ పరిమితుల కారణంగా భారతదేశంలో దేశీయ విమాన సర్వీసులను మార్చి 25 నుండి మే 24 వరకు నిలిపివేసిన విషయం తెలిసిందే. వాటిని మే 25 నుండి తిరిగి ప్రారంభించారు.

also read  జాన్సన్ బేబీ నుండి కొత్త ఉత్పత్తులు.. ప్రపంచంలోనే మొదటిది అని కంపెనీ వెల్లడి.. ...

గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలలో ఉద్యోగుల సంఖ్య కూడా ఏప్రిల్-జూలై కాలంలో 22.44 శాతం తగ్గి 29,254 కు చేరుకుందని పౌర విమానయాన మంత్రి తెలిపారు. "భారత క్యారియర్‌ల ఆదాయం 2019 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ .25,517 కోట్ల నుండి 2020 ఏప్రిల్-జూన్ కాలంలో రూ .3,651 కోట్లకు తగ్గింది" అని మంత్రి చెప్పారు.

ఎయిర్ ఇండియా మొత్తం ఆదాయం 2019 ఏప్రిల్-జూన్ కాలంలో 7,066 కోట్ల రూపాయల ఉండగా 2020-21 మొదటి త్రైమాసికంలో 1,531 కోట్లకు తగ్గిందని ఆయన పేర్కొన్నారు. మార్చి-జూలై కాలంలో దేశంలో దేశీయ విమాన రాకపోకలు 1.2 కోట్లకు పడిపోయాయని హర్దీప్ సింగ్ పూరి హైలైట్ చేశారు.

2020 మార్చి-జూలై కాలంలో అంతర్జాతీయ విమాన ట్రాఫిక్ 11.55 లక్షలకు పడిపోయిందని, గత ఏడాది ఇదే సమయంలో 93.45 లక్షలు ఉందన్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చి 23 నుండి భారతదేశంలో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను నిలిపివేసినట్లు గుర్తు చేశారు.

మే నుండి వందే భారత్ మిషన్ క్రింద ప్రత్యేక విమానాలు, జూలై నుంచి భారతదేశం నుండి ఇతర దేశాల మధ్య ఏర్పడిన ఎయిర్ బబుల్ ఒప్పందం క్రింద భారతదేశంలో ప్రత్యేక అంతర్జాతీయ ప్రయాణీకుల విమానాలు మాత్రమే నడుస్తున్నాయి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.