Asianet News TeluguAsianet News Telugu

జియో ‘రిటైల్’ విధ్వంసక డిస్కౌంట్స్‌: అమెజాన్‌, వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌కు షాక్‌


ఆన్‌లైన్‌ దిగ్గజాలు అమెజాన్, వాల్ మార్ట్ ప్లస్ ఫ్లిప్ కార్ట్ సంస్థలు ‘రిలయన్స్ రిటైల్’ గుబులు పట్టుకోనున్నది.  త్వరలో మార్కెట్లోకి  రిలయన్స్‌ రిటైల్‌ కమర్షియల్‌ యాప్‌ అందుబాటులోకి రానున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్.. జియో తరహాలోనే వినియోగదారులకు మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అదే జరిగితే అమెజాన్, వాల్ మార్ట్ ప్లస్ ఫ్లిప్ కార్ట్ సంస్థలకు గట్టి ఎదురు దెబ్బ తగలనున్నదని ఫోర్రెస్టర్ సంస్థ అంచనా వేసింది. 

Reliance Retail set to disrupt Amazon, Walmart-Flipkart: Report
Author
Mumbai, First Published May 23, 2019, 1:08 PM IST

ముంబై : వ్యాపార రంగంలో ఎదురులేకుండా దూసుకుపోతున్న ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రీటైల్ ఆన్‌లైన్‌ మార్కెట్లో కూడా ఇక సంచలనాలను నమోదు చేసేందుకు సిద్దం అవుతోంది. 

తద్వారా అమెజాన్‌, వాల్‌మార్ట్‌- ఫ్లిప్‌కార్ట్‌లకు రిలయన్స్ రిటైల్ పెద్ద సవాల్‌గా మారనుంది. జియో తరహాలోనే మార్కెట్లో విధ్వంసకర డిస్కౌంట్లకు తెరతీయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ప్రపంచ మార్కెట్ పరిశోధనా సంస్థ ఫోర్రెస్టర్ ప్రకారం 2023 నాటికి భారతదేశంలో ఆన్‌లైన్‌ రిటైల్ విక్రయాల మార్కెట్ విలువ 85 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 5,90,000 కోట్లు) చేరనుంది. వచ్చే ఐదేళ్లలో ఆన్‌లైన్ రిటైల్ సేల్స్ 25.8 శాతం వృద్ధిని సాధించనున్నాయి. 

భారత్‌లో 2016లో నోట్ల రద్దు, 2017లో జీఎస్టీ అమలు, గత డిసెంబర్‌లో ఈ కామర్స్ పాలసీలో మార్పుల రూపంలో ఒడిదుడుకులు ఎదురైనా వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. 

6,600 నగరాలు, పట్టణాల్లో 10,415 స్టోర్లు కలిగిన రిలయన్స్ రిటైల్ ఏటా 500మిలియన్ల కస్టమర్లు కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చే రిలయన్స్ స్టోర్లకు ఆదరణ పెరుగుతుందని ఫోర్రెస్టర్ అంచనా వేస్తోంది. ఇది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ కామర్స్ సైట్లకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని ఫోర్రెస్టర్ విశ్లేషించింది. 

భారీ డిస్కౌంట్లతో రిలయన్స్ రిటైల్ మార్కెట్‌లో అడుగు పెడితే ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజాలకు నష్టాలు తప్పవని, దాదాపు టెలికాం మార్కెట్‌లోకి జియో  ప్రవేశించిన తర్వాత పరిస్థితులే పునరావృతం అవుతాయని ఫోర్రెస్టర్ సీనియర్ ఫోర్‌కాస్ట్ అనలిస్ట్ సతీష్ మీనా పేర్కొన్నారు.

గతనెలలో రిలయన్స్ తన ఎంప్లాయిస్ కోసం ఫుడ్ అండ్ గ్రోసరీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ ఏడాదిలోనే యాప్‌ను కమర్షియల్‌గా లాంచ్‌ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

దీంతో రిలయన్స్ గ్రూప్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ టూ ఆఫ్ లైన్ కామర్స్ ప్లాట్‌ఫాంను అందుబాటులో తీసుకొచ్చినట్లవుతుంది. తద్వారా వినియోగదారులకు రిలయన్స్ గ్రూప్ భారీ ప్రయోజనాలను అందించనుంది. 

కాగా 2019 ఆర్థిక  సంవత్సరంలో రిలయన్స్‌ రీటైల్‌ ఆదాయం 81 బిలియన్‌ డాలర్లుగా, లాభాలు 9.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అలాగే రూ. 620 కోట్ల భారీ పెట్టుబడితో ఇటీవల సొంతం చేసుకున్న  గ్లోబల్‌​ టాయ్స్‌ కంపెనీ హామ్లీస్‌తోపాటు 40 బ్రాండ్లు రిలయన్స్ పోర్ట్‌ఫోలియోలో భాగం. 

Follow Us:
Download App:
  • android
  • ios