అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్ టెలికాం కంపెనీగా అవతరించిన జియో.. బీఎస్ఎన్ఎల్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి..
టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ (TRAI) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం జియో ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ (Jio Fiber) వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది.
హైదరాబాద్, 19 అక్టోబర్ 2022: రిలయన్స్ జియో ఆగస్టులో ప్రభుత్వరంగ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)ని అధిగమించి దేశంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ లైన్ సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. దేశంలో టెలికాం సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారిగా వైర్‌లైన్ విభాగంలో ఓ ప్రైవేట్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది.
టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ (TRAI) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుతం జియో ఫిక్స్‌డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ జియో ఫైబర్ (Jio Fiber) వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. దీంతో జియో ఫైబర్ అగ్రస్థానానికి చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలుగా ఉన్నారు. ఎయిర్టెల్ 61.9 లక్షలతో మూడో స్థానంలో నిలిచింది.
ఈ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 15,734 మంది వినియోగదారులను కోల్పోగా, జియోకు 2.62 లక్షలు, ఎయిర్టెల్ కు 1.19 లక్షలు, వోడాఫోన్ ఐడియా కు 4,202, టాటా టెలి సర్వీసుకు 3,769 మంది కొత్త వినియోగదారులు చేరారు. మొత్తం బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల విషయానికి వస్తే 80.74 కోట్ల నుండి 81.39 కోట్లకు చేరాయి. జియోకు అత్యధికంగా 42.58 కోట్ల మంది, ఎయిర్టెల్ కు 22.39 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.
మొబైల్ నెట్వర్క్ లోనూ జియోనే టాప్: తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 1.70 లక్షలకు పైగా చందాదారులు
వైర్ లెస్ మొబైల్ నెట్వర్క్ వినియోగదారుల విషయంలో కూడా జియో టాప్ లో నిలిచింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో జియోకు కొత్తగా 32.8 లక్షల వినియోగదారులు చేరడంతో మొత్తం కస్టమర్ బేస్ 41.92 కోట్లకు పెరిగింది. ఎయిర్టెల్ కు 3.26 లక్షలు జతకాగా, వోడాఫోన్ ఐడియా 19.58 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 5.67 లక్షలు, ఎంటీఎన్ఎల్ 470 మంది యూజర్లను కోల్పోయాయి. దేశవ్యాప్తంగా మొత్తం మొబైల్ టెలికాం వినియోగదారుల సంఖ్య స్వల్పంగా 117.36 కోట్ల నుండి 117.50 కోట్లకు పెరిగింది. ఇదే నెలలో ఏపీ టెలికాం సర్కిల్ (తెలంగాణ & ఏపీ)లో జియో 1.70 లక్షలకు పైగా కొత్త చందాదారులను చేర్చుకుంది.