Asianet News TeluguAsianet News Telugu

ఇరగదీస్తున్న జియో: అబుదాబీ పెట్టుబడి.. 97 వేల కోట్లు దాటాయి

పెట్టుబడులను ఆకర్షించడంలో రిలయన్స్ తనకు తానే సాటి అని రుజువు చేసుకుంటున్నది. ముబదాల సంస్థ పెట్టుబడి పెట్టిన రెండు రోజులకే అబుదాబీ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ రూ.5,684 కోట్ల పెట్టుబడి పెట్టడం గమనార్హం. దీంతో సంస్థలో పెట్టుబడులు రూ.97,885.65 కోట్లకు చేరాయి.

Reliance Jio Gets Five Thousand Crore Investment
Author
Hyderabad, First Published Jun 8, 2020, 10:44 AM IST

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ జియో పెట్టుబడులను ఆకర్షించడంలో ఇరగదీస్తున్నది. జియో ప్లాట్‌ఫారమ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అధారిటీ(ఏఐడీఏ) జియో ప్లాట్‌ఫారమ్స్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. 

జియోలో 1.16 శాతం వాటా కోసం ఏఐడీఏ రూ.5,684 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. గత ఏడు వారాల్లో జియోలో వచ్చిన ఎనిమిదవ పెట్టుబడి ఇది. ఈ ఎనిమిది ఒప్పందాల‌ ద్వారా వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ రూ.97,885.65 కోట్లకు చేరింది. ఇటీవలే  ఫేస్ బుక్, విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, తదితర సంస్థలు రిలయన్స్‌ జియోలో పెట్టుబడులు పెట్టాయి.

తాజా పెట్టుబడితో జియో ఈక్విటీ వాల్యుయేషన్ రూ.4.91 లక్షల కోట్లకు, ఎంటర్‌ప్రైజ్ వాల్యుయేషన్ రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది. రెండు రోజుల్లోనే మరో అబుదాబీ సంస్థ ఇన్వెస్ట్‌ చేయడం విశేషం.

జియోకు 38.80 కోట్ల మంది మొబైల్‌ వినియోగదారులు ఉన్నారు. తాజాగా  అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అధారిటీ పెట్టుబడి పెట్టడంతో సంస్థ మరింత వృద్ధి చెందుతుందని రిలయన్స్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

also read కోత పెడితే రోడ్డున పడతా.. వేతన కోతపై ఎస్బీఐ చైర్మన్ సరదా వ్యాఖ్య

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్
దేశంలోని ప్రముఖ కంపెనీలు మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. గత వారం మార్కెట్‌ విలువ ఆధారంగా పది కంపెనీలు రూ. 2.46 లక్షల కోట్ల రూపాయలతో తమ హవా కొనసాగిస్తన్నాయి.

ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ .73,156.71 కోట్ల నుంచి రూ.10,02,006.10 కోట్లకు పెరిగింది. తరువాతి స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.46,036.95 కోట్ల నుంచి రూ .5,67,697.09 కోట్లు.. కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ .30,888.39 కోట్లు నుంచి రూ.2,65,080.63 కోట్లకు పెరిగాయి. 

ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) విలువ రూ .28,724.5 కోట్ల నుంచి రూ.7,68,525.91 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ .18,524.25 కోట్ల నుంచి 3,05,931.57 కోట్లతో  మార్కెట్‌లో సత్తా చాటాయి. 

మొబైల్‌ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ .3,19,095.55 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ .2,31,330.39 కోట్లు, హిందుస్థాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్)  రూ .4,90,398.08 కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.2,99,734.72 కోట్లు, ఐటీసీ రూ.2,45,783.16 కోట్లతో మార్కెట్‌లో తమ హవా కొనసాగిస్తున్నాయి. 

టాప్ -10 సంస్థల ర్యాంకింగ్‌లో రిలయన్స్ తన నంబర్‌ వన్‌ స్థానాన్ని కొనసాగించగా.. తరువాతి స్థానాల్లో టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యుఎల్, ఎయిర్‌టెల్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తరువాతి స్థానాల్లో నిలిచాయి

Follow Us:
Download App:
  • android
  • ios