Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ ‘శిఖ’లో మరక: నెదర్లాండ్స్ ‘హవాలా’ ఆరోపణలు?

ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మనీల్యాండరింగ్‌ వివాదంలో చిక్కుకున్నది. నెదర్లాండ్స్‌ సంస్థ ‘ఎ హక్‌’తో కుమ్మక్కై 1.2 బిలియన్‌ డాలర్ల నిధులను దారి మళ్లించిందని డచ్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 

Reliance Industries denies any link to $1.2 b money-laundering case in Netherlands
Author
New Delhi, First Published Apr 8, 2019, 10:33 AM IST

దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా హవాలా లావాదేవీల వివాదంలో చిక్కుకుంది. నెదర్లాండ్స్‌ సంస్థ ‘ఎ హక్‌’ తోడ్పాటుతో 1.2 బిలియన్‌ డాలర్లు మళ్లించినట్లు డచ్‌ ప్రాసిక్యూటర్లు ఆరోపించడం సంచలనం రేపుతోంది.

ఈ కేసులో ఎ హక్‌ ఉద్యోగులు ముగ్గురు అరెస్టయ్యారు. మూడు రోజుల విచారణ తర్వాత వారిని కోర్టు విడుదల చేసింది. మరోవైపు, ఈ ఆరోపణలను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తోసిపుచ్చింది.

‘ఎ హక్‌’ ఉద్యోగులను అరెస్ట్‌ చేసిన ఫిస్కల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఇన్వెస్టిగేషన్‌ సర్వీస్‌ అండ్‌ ఎకనమిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సర్వీస్‌ (ఎఫ్‌ఐవోడీ–ఈసీడీ) తెలిపిన వివరాల కథనం ప్రకారం 2006–08 మధ్య ఈస్ట్‌వెస్ట్‌ పైప్‌లైన్‌ (ఈడబ్ల్యూపీఎల్‌) అనే సంస్థ రిలయన్స్‌కి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌ క్షేత్రం నుంచి పశ్చిమ భారతంలోని రాష్ట్రాల కస్టమర్లకు గ్యాస్‌ చేరవేసేందుకు పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టింది.

దీనికి డచ్‌ సంస్థ ‘ఎ హక్‌’ కూడా సర్వీసులు అందించింది. ఈ క్రమంలోనే ‘ఎ హక్‌’ ఉద్యోగులు కొందరు ఓవర్‌ ఇన్వాయిసింగ్‌ (బిల్లులను పెంచేసి) ద్వారా 1.2 బిలియన్‌ డాలర్ల మేర అవకతవకలకు పాల్పడ్డారు.

ఈ నిధులు ఆ తర్వాత సంక్లిష్టమైన లావాదేవీలతో దుబాయ్, స్విట్జర్లాండ్, కరీబియన్‌ దేశాల గుండా అంతిమంగా సింగపూర్‌లోని బయోమెట్రిక్స్‌ మార్కెటింగ్‌ అనే సంస్థకు చేరాయని సమాచారం.

ఈ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిందేనని నెదర్లాండ్స్ ప్రాసిక్యూటర్లే ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీలకు ప్రతిఫలంగా ‘ఎ హక్‌’ ఉద్యోగులకు 10 మిలియన్‌ డాలర్లు ముట్టాయని వారు పేర్కొన్నారు. ఇలా పైప్‌లైన్‌ నిర్మాణ వ్యయాలను పెంచేయడం వల్ల అంతిమంగా భారతీయులే నష్టపోతున్నారని తెలిపారు. 

నష్టాల్లోని ఈడబ్ల్యూపీఎల్‌ (గతంలో రిలయన్స్‌ గ్యాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ –ఆర్‌జీటీఐఎల్‌) సంస్థను కొన్నాళ్ల క్రితం కెనడా సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు చెందిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ రూ. 13వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది.

హవాలా లావాదేవీల ఆరోపణలను ఈడబ్ల్యూపీఎల్‌ ఖండించింది. ఈ పైప్‌లైన్‌ ప్రాజెక్టు పూర్తిగా ప్రమోటర్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రైవేట్‌ కంపెనీ ద్వారా నిర్మించడం జరిగిందని పేర్కొంది.  

భారత్, చైనా, రష్యా, మధ్యప్రాచ్య దేశాల స్వతంత్ర కాంట్రాక్టర్ల కన్సార్షియం దీన్ని పూర్తి చేసిందని, స్వతంత్ర ఏజెన్సీలు మదింపు చేసిన ప్రమాణిక వ్యయాలతో ఈ ప్రాజెక్టును అత్యంత వేగవంతంగా పూర్తి చేశామన్నది. 

సదరు కాంట్రాక్టర్లలో ‘ఎ హక్‌’ కూడా ఒకటని ఈడబ్ల్యూపీఎల్‌ పేర్కొన్నది.  ఇక పెట్టుబడి వ్యయాలు పెరగడం వల్ల అధిక టారిఫ్‌ భారం పడిందన్న ఆరోపణలు తప్పని తెలిపింది. ఈ కేసంతా ఊహాగానాలు, అంచనాలే ప్రాతిపదికగా ఉందని, వాస్తవాలు లేవని పేర్కొంది. 

మరోవైపు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా మనీలాండరింగ్‌ ఆరోపణలను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. 2006లో తాము గానీ, తమ అనుబంధ సంస్థలు గానీ ఏ గ్యాస్‌ పైప్‌లైన్‌ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసింది.

ఏ పైప్‌లైన్‌ నిర్మాణంలోనూ ఎప్పుడూ  నెదర్లాండ్స్‌కి చెందిన ఏ సంస్థతోనూ కలిసి పనిచేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ తేల్చి చెప్పింది. ‘ఆర్‌ఐఎల్‌ ఎప్పుడూ కూడా చట్టాలు, నిబంధనలకు లోబడే పనిచేస్తోంది. అవకతవకల ఆరోపణలను ఖండిస్తున్నాం‘ అని ఆర్‌ఐఎల్‌ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios