న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడ్డ భారతావనిని ఆదుకునేందుకు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు కదిలి వస్తున్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమ వంతు బాధ్యతగా భారీ విరాళాలు ప్రకటిస్తున్నాయి. 

కొవిడ్-19 బాధితులకు అండగా ఉండేందుకు అవసరమైన విరాళాలను సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ (పీఎం-కేర్స్‌ ఫండ్‌) నిధికి పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ సోమవారం రూ.500 కోట్లు ప్రకటించారు. మహారాష్ట్ర, గుజరాత్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు కూడా రూ.5 కోట్ల చొప్పున విరాళాలు ఇస్తున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తెలియజేసింది. 

ఇప్పటికే కోట్ల రూపాయల ఖర్చుతో ముంబైలో 100 పడకల కరోనా దవాఖానను ఏర్పాటు చేసిన రిలయన్స్‌.. హెల్త్‌ వర్కర్ల కోసం రోజుకు లక్ష మాస్కులను తయారు చేయిస్తున్నది. ఎమర్జెన్సీ సర్వీసులకు ఉచితంగా ఇంధనాన్నీ అందిస్తున్నామని సంస్థ తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలను సమకూరుస్తున్నట్లు చెప్పింది. ఆకలితో అలమటించే వారికి వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి 50 లక్షల భోజనాలు పంపిణీ చేస్తున్నది. 

మరోవైపు ఎల్‌అండ్‌టీ సోమవారం రూ.150 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. లాక్‌డౌన్‌ కారణంగా రోడ్డునపడ్డ దాదాపు 1.60 లక్షల కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలుస్తున్నామని, నెలకు రూ.500 కోట్లకుపైగా ఖర్చుచేసి ఆహార, ఇతర సదుపాయాల్ని కల్పిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది.

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన వంతుగా రూ.100 కోట్ల విరాళాన్ని అందచేసింది. ఇందులో రూ.50 కోట్లు పీఎం-కేర్స్ నిధికి అందజేస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధామూర్తి తెలిపారు. దేశవ్యాప్తంగా దవాఖానల్లో మౌలిక వసతుల కల్పన, వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, టెస్టింగ్ కిట్లు, మాస్కులు, ఇతర పరికరాల కోసం మిగతా రూ.50 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ కరోనాపై పోరుకు రూ.150 కోట్ల విరాళం అందజేయనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ బైజేంద్ర కుమార్ తెలిపారు. టోరెంటో గ్రూప్ రూ.100 కోట్ల విరాళం అందజేస్తున్నట్లు తెలిపింది.

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో గ్రూప్‌ సైతం రూ.100 కోట్ల సాయంతో ముందుకొచ్చింది. పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.50 కోట్లను విరాళంగా ప్రకటించింది. మరో రూ.50 కోట్లతో సహాయక చర్యలు చేపట్టనున్నట్టు తెలిపింది. 

also read:లాక్‌డౌన్‍తో యూట్యూబ్ వీడియో క్వాలిటీ తగ్గింపు.. మిగతా వాటిదీ అదే దారి

అలాగే హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) రూ.26.25 కోట్లను, టీవీఎస్‌ మోటర్‌, పతంజలి రూ.25 కోట్ల చొప్పున పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఇస్తున్నట్లు తెలిపాయి. ఆర్థిక సేవల సంస్థ ఐఐఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ సైతం రూ.5 కోట్ల విరాళాన్ని పీఎం-కేర్స్‌ ఫండ్‌కు ఇస్తున్నది.

ఐదు రాష్ట్రాల్లో 1,500 పడకలతో 5 క్వారంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు పతంజలి ప్రకటించింది. ఉద్యోగుల వేతనాల ద్వారా రూ.1.50 కోట్లను విరాళంగా ఇస్తున్నామన్నది. మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ రూ.51 కోట్లు విరాళం ప్రకటించింది.