ఆర్థిక వ్యవస్థ అవసరాలకు సరిపడా నగదు అందుబాటులో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ఒకవేళ కొరత ఏర్పడితే కనుక, సత్వరం పరిష్కార చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) ప్రతినిధులతో మంగళవారం  ముంబైలో సమావేశమై, ఆ రంగానికి ఎదురవుతున్న నగదు లభ్యత సమస్యలను తెలుసుకుంటానని శక్తికాంత దాస్ వివరించారు.

అప్రమత్తంగా వ్యవహరిస్తామన్న శక్తికాంత దాస్
‘ద్రవ్య లభ్యత అంటే, భారీగా నగదు అందుబాటులో ఉంచడం (లూజ్‌ మనీ) కాకూడదు. నిశిత పరిశీలన తర్వాతే అవసరాల మేరకు వ్యవస్థలోకి నగదు విడుదల చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆర్‌బీఐ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది’ అని ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) ప్రతినిధులతో భేటీ తర్వాత శక్తికాంత దాస్ మీడియాకు చెప్పారు. 

సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభిప్రాయం తెలిసింది 
ఎంఎస్‌ఎంఈ రంగం తీరు ఎలా ఉంది, ఆర్బీఐ రుణాల పునర్వ్యవస్థీకరణ పథకాన్ని ఎలా అమలు చేయాలో ఎంఎస్‌ఎంఈ ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకున్నానని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

అత్యధిక సంస్థలు మనుగడ సాధించేలా ఈ పథకం ఉపయోగ పడాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. బ్యాంకులు, ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులు కలిసి చర్చించుకుని, రుణ పునర్‌వ్యవస్థీకరణ పథక లక్ష్యం సాకరమయ్యేలా చూస్తారని ఆర్బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  

మార్కెట్‌ను ప్రభావితం చేసే వ్యాఖ్యలు చేయను
‘ద్రవ్య లభ్యత అనేది మార్కెట్‌కు సంబంధించింది. అందువల్ల ట్రేడింగ్‌ సమయంలో చేసే వ్యాఖ్యలు ప్రభావం చూపుతాయి’అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. వేర్వేరు రంగాల నుంచి వచ్చిన సమాచారం మేరకు, డిసెంబర్-జనవరి నెలల్లో అదనపు మార్కెట్‌ కార్యకలాపాల (ఓఎంఓ) ద్వారా రూ.60వేల కోట్లు ప్రవేశ పెడతామని ఆర్‌బీఐ గతంలో ప్రకటించిన సంగతి విదితమే.

‘ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంస్థల అవసరాలు గణనీయంగా తీరే స్థాయిలోనే ద్రవ్యలభ్యత ఉందనే నేను విశ్వసిస్తున్నా. ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్యలభ్యత తీవ్రంగా ఉందని కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి. ఆ రంగ ప్రతినిధులతో సమావేశమై, తెలుసుకుంటా’ అని దాస్‌ పేర్కొన్నారు.

బ్యాంకుల మొండి బాకీలు తగ్గుతున్నాయ్‌ 
ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండిబాకీల మొత్తాలు తగ్గుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘పీఎస్‌బీలు, ఎన్‌పీఏలపై రోజువారీ పరిశీలన జరుగుతోంది.

వీటి స్థితి మెరుగవుతోందనే ఆర్థిక స్థిరత్వ నివేదికలో వెల్లడైంది’అని పేర్కొన్నారు. ‘బ్యాంకుల పనితీరు మందగించేలా సంస్కరణలు తేవడం మంచిది కాదు. ఎలాంటి సంస్కరణలు అవసరమనే విషయమై వేర్వేరు వర్గాలతో సంప్రదిస్తున్నా’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు.

మధ్యంతర డివిడెండ్‌పై నిర్ణయించాక వెల్లడిస్తాం
ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్‌ చెల్లించడంపై తుది నిర్ణయం తీసుకున్నాక, ఆర్బీఐ బోర్డు వెల్లడిస్తుందని శక్తికాంతదాస్‌ తెలిపారు.  జులై-జూన్‌ను ఆర్థిక సంవత్సరంగా వ్యవహరించే ఆర్బీఐ, గత ఏడాదిలో రూ.10వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను అందించింది.

పూర్తి ఏడాదికి రూ.40,000 కోట్ల డివిడెండ్‌ను 2018 ఆగస్టులో అందించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50వేల కోట్ల డివిడెండ్‌ను ప్రభుత్వానికి అందించినట్లయ్యింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్‌/అదనపు నిధుల రూపేణ రూ.54,817.25 కోట్లు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నదని ఆయన తెలిపారు. 

మార్చిలోగా ఆర్బీఐ మధ్యంతర డివిడెండ్‌ బదిలీ

ప్రభుత్వానికి మధ్యంతర డివిడెండ్‌గా రూ.30,000-40,000 కోట్లను ఆర్బీఐ మార్చిలోపే బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ వ్యవహారంతో నేరుగా సంబంధం కలిగిన ముగ్గురు వ్యక్తులు ఈ సమాచారం తెలిపినట్లు వార్తాసంస్థ రాయిటర్స్‌ పేర్కొంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓట్‌ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశ పెట్టనున్నారు. ఈలోపే ఆర్బీఐ బోర్డు నిర్ణయం తీసుకోవచ్చనేది ఇద్దరు ప్రతినిధుల సమాచారం.

బాండ్లలో కొత్త మొత్తం డివిడెండ్ రూపంలో బదిలీ 
బాండ్లు, కరెన్సీల ట్రేడిండ్‌ ద్వారా ఆర్‌బీఐకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కొంతమొత్తాన్ని నిల్వగా ఉంచి, మరింత మొత్తాన్ని ప్రభుత్వానికి డివిడెండుగా అందిస్తుంటారు. ఈ ఆర్థిక సంవత్సరాని (2018-19)కి మధ్యంతర డివిడెండ్‌ ఎంత ఇవ్వాలనేది ఆర్బీఐ బోర్డు ప్రత్యేకంగా నిర్ణయిస్తుంది. వాస్తవానికి జూన్‌లో తమ ఆర్థిక సంవత్సరం ముగిశాక, ఏటా ఆగస్టులో ప్రభుత్వానికి డివిడెండును ఆర్‌బీఐ అందిస్తుంటుంది. 

మధ్యంతర డివిడెండ్ బదిలీ చేస్తే అది రెండోసారి
మధ్యంతర డివిడెండును ఈసారి కూడా ఇస్తే, వరుసగా ఇలా చేయడం రెండో ఏడాది అవుతుంది. ఈ మొత్తం రూ.30,000-40,000 కోట్లు అయితే కనుక, ఈ మార్చిలోపు ప్రభుత్వానికి ఆర్‌బీఐ నుంచి అందిన మొత్తం రూ.70,000-80,000 కోట్లు అవుతుంది. 2014-15లో ఇలా అందినమొత్తం రూ.65,900 కోట్ల కంటే కూడా ఎక్కువే.

ఆదాయం లక్ష్యానికి రూ.లక్ష కోట్లకు పైగా తరుగు! 
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం అంచనా వేసిన ఆదాయంలో రూ.1-1.4 లక్షల కోట్ల మేర తగ్గవచ్చన్నది అంచనా. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం, పెట్టుబడుల ఉపసహరణపై ఆర్జించదలచుకున్న మొత్తాలు తగ్గడమే ఇందుకు కారణం. దీంతోపాటు రూ.26,000 కోట్ల అదనపు వ్యయాల కోసం పార్లమెంటు ఆమోదానికి ప్రభుత్వం దరఖాస్తు చేసింది. అంటే ద్రవ్యలోటు మరింత పెరగనుంది.