న్యూఢిల్లీ: ఇక వివిధ బ్యాంకుల ఖాతాదారులు నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి ఉసూరుమనకుండా ఊరట కల్పించే నిర్ణయం ఆర్బీఐ తీసుకున్నది. రోజుల తరబడి నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండరాదని, అలా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని, ప్రాంతాన్ని బట్టి జరిమానా విధిస్తామని ఆర్బీఐ పేర్కొంది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లేక గంటల కొద్దీ ఖాతాదారులు వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. 

మరికొన్ని చోట్ల ఏటీఎంల్లో రోజుల తరబడి నగదు నింపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల్లో నెలకొల్పే సెన్సర్ల ద్వారా వాటిలో ఎం‍త నగదు ఉందనేది ఆయా బ్యాంకులకు సమాచారం ఉంటుంది.

ఏటీఎంలు ఖాళీగా ఉంచితే జరిమానా విధిస్తామని ఆర్బీఐ నుంచి ఎటువంటి సర్క్యులర్ రాలేదని ఎస్బీఐ పేర్కొనడం గమనార్హం. నగదు లేని ఏటీఎంల గురించి పూర్తి సమాచారం ఉన్నా సకాలంలో నగదును నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. 

ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 2.2 లక్షల ఏటీఎం సెంటర్లు ఉన్నాయని అంచనా. గత రెండేళ్లలో వాటిల్లో కొన్ని మూసివేయడమో, మరికొన్ని విలీనం చేయడమో జరిగిందని సమాచారం. 

మరోవైపు ఏటీఎం కేంద్రాల్లో పెరుగుతున్న దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు.. ఏటీఎంలను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఏటీఎంలను గోడ, స్తంభం, ఫ్లోరింగ్‌లోకి బిగించాలని పేర్కొంది. వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది.

విమానాశ్రయాల వంటి సీసీ టీవీలు, కేంద్ర-రాష్ట్ర భద్రతా బలగాలతో కూడిన అధిక భద్రత ఉండే ప్రాంతాల్లో మినహా, మిగిలిన కేంద్రాల్లో ఏటీఎంల రక్షణకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నగదు రవాణా, సరఫరా వ్యవస్థలను సురక్షితంగా ఉంచేందుకు ఏం చేయాలనే అంశంపై 2016లో నియమించిన కమిటీ సిఫారసుల మేరకు ఆర్బీఐ ఈ ఆదేశాలిచ్చింది. 

ఏటీఎంలలో నగదు భర్తీకి సంబంధించి, డిజిటల్‌లో ఒకసారి మాత్రమే వచ్చే సంఖ్య (ఓటీసీ)తో కూడిన తాళాలను తప్పనిసరిగా వాడాలని కోరింది. ఏటీఎంలపై ఆన్‌లైన్‌ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ఏదైనా నేర పూరితమైన ఘటనలు జరిగినపుడు వెంటనే స్పందించేందుకు వీలవుతుందని సూచించింది. ప్రస్తుత భద్రతా చర్యలకు అదనంగా ఇవి పాటించాల్సి ఉంది. నిర్దేశిత సమయంలోగా పనులు జరగకపోతే, జరిమానాలు తప్పవని హెచ్చరించింది.