Asianet News TeluguAsianet News Telugu

పంతం చెల్లించుకున్న కేంద్రం.. ఆర్బీఐ నుంచి రూ.28 వేల కోట్ల డివిడెండ్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తీర్చుకునేందుకు కేంద్రం అనుసరించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తున్నది. ఇందుకు కేంద్రానికి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ అందజేయనున్నట్లు ప్రకటించడమే కారణం. ఆర్బీఐలో మిగులు నిధుల అంశంపైనే గతేడాది డిసెంబర్ నెలలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాచేశారు.

RBI to Give Rs 28,000 Crore to Govt As Interim Dividend
Author
New Delhi, First Published Feb 19, 2019, 10:17 AM IST

నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్రం అనుకున్న మేరకు లక్ష్యం నెరవేరనున్నదా? అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ద్రవ్యలోటు ఇబ్బంది నుంచి కొంతమేర బయట పడే కీలక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వానికి రూ. 28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి కొన్ని విశేషాలివి..జూలై – జూన్‌ మధ్య కాలాన్ని ఆర్‌బీఐ ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. దీని ప్రకారం గతేడాది జూలై నుంచి వచ్చే జూన్‌ నెలాఖరు వరకూ ఆర్బీఐకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంగా కొనసాగుతుంది.

గతేడాది ఆగస్టులోనే 2017-18 సంవత్సరానికి రూ.50 వేలు చెల్లించనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఇందులో ఇందులో 40 వేల కోట్లు మిగులు నిధులుకాగా, 10 వేల కోట్లు మధ్యంతర డివిడెండ్‌.  

ఇక తన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను కేంద్రానికి ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఒకే ఏడాదిలో రూ.78,000 కోట్లు అందినట్లవుతోంది. అంతేకాదు ఆర్బీఐ ఇలా కేంద్రానికి మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వడం వరుసగా రెండో ఏడాది. 2017–18లో ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి అందిన మొత్తం డివిడెండ్‌ రూ.30,663 కోట్లు.  

ఆర్‌బీఐకి సంబంధించినంత వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగం పూర్తయింది. పరిమిత ఆడిట్‌ సమీక్ష, అందుబాటులో ఉన్న మిగులు నిధుల వంటి అంశాల ప్రాతిపదికన కేంద్రానికి రూ.28వేల కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వాలని ఆర్బీఐ బోర్డు నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

1934 ఆర్బీఐ చట్టం సెక్షన్‌ 47 కింద కేంద్రానికి ఆర్‌బీఐ తన మిగులు నిధులను అందిస్తోంది. మొండిబకాయిలు, మొండిబకాయిలుగా మారేందుకు అవకాశం ఉన్న బకాయిలకు కేటాయింపులు, సిబ్బంది, పదవీ విమరణ నిధికి వాటా, ఇతర కేటాయింపులు పోగా మిగిలిన లాభాలను కేంద్రానికి ఆర్బీఐ బదలాయించాలని ఈ సెక్షన్‌ పేర్కొంటోంది.   

2019–20లో ఆర్బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్‌గా గానీ, మిగులు నిధులుగా గానీ రూ.82,911.56 కోట్ల నిధులు పొందాలని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించింది. ద్రవ్యలోటును పూడ్చుకునే మార్గాల్లో కేంద్రానికి ఇదొక మార్గం.

2018–19 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు. 2018 నవంబర్‌ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువన్న మాట.

దీనితో మెజారిటీ ఆర్థిక సంస్థలు, విశ్లేషణలకు అనుగుణంగానే ద్రవ్యలోటు అంచనాలను 3.3 శాతం కాకుండా, 3.4 శాతానికి కేంద్రం పెంచింది. ద్రవ్యలోటును 2019–20లో 3.4 శాతంగా కొనసాగించడానికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రం పేర్కొంది. 

ఆయా పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి.

నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ నిధి రూ.6.91 లక్షల కోట్లు, కంటెంజెన్సీ ఫండ్‌గా రూ.2.32 లక్షల కోట్ల ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతున్నదన్న వార్తల నేపథ్యంలో గతేడాది డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాల పేరిట రాజీనామా చేస్తున్నట్లు అప్పటి ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు.

ఈ నిధుల నిర్వహణ పరిశీలనకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.  ఇందుకు అనుగుణంగా జలాన్‌ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటైంది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి.

గతంలోనూ వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్‌ కమిటీ మాత్రం దీనిని 18 శాతంగా పేర్కొంది.

ఆర్‌బీఐ థోరట్‌ కమిటీ సిఫారసును తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. 

ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 14 శాతం మిగులు నిధులు సరిపోతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ ఈ నెల 21వ తేదీన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌ల అధిపతులతో సమావేశం కానున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్  మీడియాతో మాట్లాడుతూ‘రేట్ల కోత ప్రయోజనం బదలాయింపు చాలా ముఖ్యమైన అంశం.

ఇదే విషయాన్ని పాలసీ సమీక్ష ప్రకటన సందర్భంగా చెప్పాం. 21న కూడా ఇదే అంశంపై దృష్టి సారించనున్నాం’అని తెలిపారు. లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ.25 కోట్ల వరకూ రుణంపై ప్రకటించిన పునర్‌వ్యవస్థీకరణ పథకాన్నిఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రస్తావించారు.

కొటక్‌ మహీంద్రా బ్యాంక్, యస్‌బ్యాంకులపై రెగ్యులేటరీ చర్యల అమలు విషయమై స్పందిస్తూ  నియంత్రణా నిబంధనల పాటింపు విషయంలో తగిన చర్యలన్నింటినీ తీసుకుంటుందన్నారు. రుణ వృద్ధి ఆశాజనకంగా ఉందన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదదాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులర్పిస్తూ, ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం రెండు నిముషాలు మౌనం పాటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios