Asianet News TeluguAsianet News Telugu

మరోమారు వడ్డీ రేట్లను తగ్గించనున్న ఆర్బీఐ: ఆర్ధిక వ్యవస్థ గాడిన పడేనా?

గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. దానితో ఈసారి ఎంతమేర తగ్గిస్తుందో కరెక్ట్ గా ఊహించడం కష్టమవుతుంది. కానీ 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందనేది మాత్రం ఖచ్చితం

rbi to cut interest rates again: can the economy revive?
Author
Mumbai, First Published Oct 3, 2019, 3:14 PM IST

ముంబై: ఈ సంవత్సరం ఇప్పటికే 4సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ రేపు శుక్రవారం నాడు మరోమారు వడ్డీ రేట్లను తగ్గించనుంది. గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. దానితో ఈసారి ఎంతమేర తగ్గిస్తుందో కరెక్ట్ గా ఊహించడం కష్టమవుతుంది. కానీ 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందనేది మాత్రం ఖచ్చితం. 

దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చినప్పటినుండి ఇలా వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉంది. నిన్ననే భారత బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగా, స్థిరంగా ఉందని ప్రకటన విడుదల చేసింది. బ్యాంకింగ్ వ్యవస్థ అస్థవ్యస్థనంగా ఉందంటూ వస్తున్న పుకార్లలో నిజం లేదని ధృవీకరించేందుకు ఆర్బీఐ ఈ విధంగా ప్రకటించింది.  ప్రజల్లో భారత బ్యాంకింగ్ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని కలిగేంచేందుకు ఈ ప్రకటనను ఆర్బీఐ విడుదల చేసింది. 

భారత ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు భారత ప్రభుత్వం తాజాగా చాలా చర్యలని చేపట్టింది. 20 బిలియన్ డాలర్ల మేర అనూహ్యంగా కార్పొరేట్ టాక్స్ ను కేంద్రం తగ్గించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మరోమారు వడ్డీ రేట్లను తగ్గిస్తే, మాంద్యాన్ని కట్టడి చేసి వ్యవస్థ ప్రగతిబాట పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. 

ఇలా కార్పొరేట్ టాక్స్ ను తగ్గించడం, వడ్డీ రేట్లను తగ్గించడం మంచిదే. కాకపోతే ప్రస్తుతం మన ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కుంటున్న మందగమనానికి కారణం డిమాండ్ తగ్గడం. ప్రజలవద్ద డబ్బు లేకపోవడం వల్ల కొనడానికి ముందుకు రావడం లేదు. నిరుద్యోగం 45 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది. డిమాండ్ లేకపోవడం వల్ల ఉత్పత్తిదారులు ఉద్యోగులను భారీ స్థాయిలో తొలిగిస్తున్నారు. ఉద్యోగాల్లో ఉన్నవారికి వారి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అర్థంకాని డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతున్నారు. 

ఇప్పుడు ఆర్ధిక స్థితి మెరుగుపడాలంటే ప్రజలు ఖర్చుపెట్టడానికి ధైర్యంగా ముందుకు రావాలి. రానున్నది పండుగ సీజన్. ఈ సీజన్ లో సాధారణంగా ప్రజల కొనుగోళ్లు అత్యధిక స్థాయిలో ఉంటాయి. ఈ సీజన్ లో గనుక కొనుగోళ్లు పెరిగితే ఆర్ధిక వ్యవస్థ గాడిలోపడ్డట్టే. కానీ ప్రస్తుతం కనపడుతున్న పరిస్థితుల చిత్రం మాత్రం అంత ఆశాజనకంగా లేదు. 

ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్ ను తగ్గించడం చాల మంచి నిర్ణయం. కాకపోతే ఇప్పుడు వారికి టాక్స్ తగ్గింపు ఇచ్చినంత మాత్రాన వారు ఉత్పత్తిని పెంచరు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ ఉత్పత్తుదారుల తరుఫున మాత్రమే తీసుకుంటుంది తప్ప వినియోగదారుడి డిమాండ్ పెంచడానికి ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదు. 

ఇలా ఉత్పత్తిదారుల పరంగా చర్యలు తీసుకుంటే వారు ఉత్పత్తిని పెంచుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఇలా ఉత్పత్తిని పెంచినప్పుడు, ఉద్యోగులు ఎక్కువగా అవసరమవుతారని, అప్పుడు నిరుద్యోగం తగ్గి ఎక్కువమంది ఉద్యోగాల్లో చేరుతారు. ఇలా ప్రజల ఆదాయం పెరుగుతుంది. అప్పుడు ప్రజలు ఖర్చు చేయడం మొదలుపెడుతారు. తద్వారా డిమాండ్ పెరిగి ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో పయనిస్తుందనేది ప్రభుత్వ వాదన. 

కాకపోతే ప్రస్తుత పరిస్థితెలావుందంటే, ఇప్పటికే మార్కెట్లు మందగమనం దిశగా అడుగులు వేయబట్టి చాలాకాలం అయ్యింది. ఉత్పత్తి చేసిన వస్తువులు గోడౌన్ లలో మూలుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉత్పత్తి ప్రారంభించాలంటే, ఉత్పత్తి చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న వస్తువులు మొదటగా అమ్ముడవ్వాలి. ఇలా అమ్ముడైనప్పుడే కొత్త వస్తువుల ఉత్పతిని ప్రారంభిస్తాయి కంపెనీలు. అలా ఉత్పత్తి ప్రారంభమైన తరువాత ఉద్యోగాలు ఊపందుకుంటాయి. 

ఇది జరగాలంటే మొదట ప్రజల చేత ఖర్చుపెట్టించగలగాలి. వారు ఖర్చు పెట్టాలంటే వారి ఆదాయం అన్నా పెరగాలి లేదా వారిదెగ్గర సేవింగ్స్ అన్నా పెరగాలి. ఆదాయాన్ని ఇప్పటికిప్పుడు పెంచలేము కాబట్టి వారి సేవింగ్స్ ని మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా పెరిగేలా చేయొచ్చు. ఉదాహరణకు ఇన్కమ్ టాక్స్ తగ్గించడం, జీఎస్టీ తగ్గించడం ఇతరాత్రాలు. 

ఇలా గనుక తగ్గిస్తే వస్తువులు చవకగా దొరకడం వల్ల, సేవింగ్స్ కూడా పెరగడం వల్ల ప్రజలు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఇలా వచ్చినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు మార్కెట్లు పురోగమనంలో నడుస్తాయి. 

ఇలా అన్ని చర్యలను కలిపి తీసుకోవడం వల్ల మాత్రమే, ఆర్ధిక వ్యవస్థ గాడిన పడుతుంది. కేవలం ఒక్కోసారి ఒక్క చర్యకు పరిమితమయితే, అనుకున్నంత ప్రతిఫలం ఉండదు. ఇందాకచెప్పుకున్నట్టు పండుగ సీజన్ రానుంది కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకునేలా కనపడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios