ఫైనాన్స్ టెక్నాలజీ సంస్థలు తమ కస్టమర్ల డేటాను భారతదేశంలోనే భద్ర పరుచాలని ఆర్బీఐ విధించిన గడువు సోమవారం ముగియనున్నది. దీని అమలును వాయిదా వేయాలని గూగుల్ పే తదితర సంస్థలు ఆర్బీఐని కోరుతున్నాయి. ఆర్థిక పరమైన భారం పడుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఒత్తిడి చేయొద్దని ప్రధాని మోదీకి ఇద్దరు అమెరికా సెనెటర్లు లేఖ రాశారు. 

డేటా లోకలైజేషన్ విషయమై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) తన వైఖరికే కట్టుబడి ఉన్నది. ఇది అంతర్జాతీయ ఆర్థిక సాంకేతిక (ఫిన్‌టెక్) సంస్థల యాజమాన్యాలకు మింగుడు పడటం లేదు. డేటా లోకలైజ్ చేయాలని ఆర్బీఐ విధించిన గడువు సోమవారంతో ముగుస్తున్నది. ఆర్బీఐ ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో ముందుగా నిర్ణయించినట్లే డేటా లోకలైజేషన్ నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. 

భారత్‌లోనే డేటా భద్రం చేయాలన్నది ఆర్బీఐ గైడ్ లైన్స్
గ్లోబల్ పేమెంట్ కంపెనీలు తమ భారతీయ కస్టమర్ల లావాదేవీల సమాచారాన్ని భారత్‌లోనే భద్రం చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇందుకు ఆరు నెలల గడువు ఇచ్చింది. అక్టోబర్ 15తో అదికాస్తా ముగిసింది. అంటే సోమవారం నుంచి ఆర్బీఐ డేటా లోకలైజేషన్ నిబంధనావళి మొదలైందన్నమాట. 

ఆర్బీఐ ఆదేశాలను స్వాగతిస్తున్న దేశీయ ఫిన్ టెక్ మేజర్స్
నిజానికి విదేశీ ఫిన్‌టెక్ సంస్థలు ఈ గడువును పొడిగించాలని ఆర్బీఐకి చేస్తున్న విజ్ఞప్తులపై సానుకూల స్పందన కానరాలేదు.. మరోవైపు దేశీయ సంస్థలు మాత్రం ఆర్బీఐ నిబంధనల్ని స్వాగతిస్తున్నాయి.

పేటీఎం, ఫోన్‌పే సంస్థలు మద్దతు పలుకుతుండగా, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ ఆధ్వర్యంలోని గూగుల్ పే వ్యతిరేకిస్తున్నది. స్థానికంగా సర్వర్ల ఏర్పాటు కోసం ఖర్చులు పెరుగుతాయన్న ఆందోళన విదేశీ సంస్థల్లో కనిపిస్తున్నదని, అందుకే దీనికి అవి వెనుకాడుతున్నాయని భారతీయ సంస్థలు అంటున్నాయి. 

ఫిన్ టెక్ సంస్థల ‘ప్రత్యామ్నాయ’ ప్రతిపాదనకు ఆర్బీఐ నో
ఒరిజినల్ డేటాకు బదులుగా ప్రత్యామ్నాయ డేటాను భద్రపరుస్తామని విదేశీ సంస్థలు చేసిన ప్రతిపాదనను ఇందుకు ఆర్బీఐ అంగీకరించలేదు. కనీసం డిసెంబర్‌దాకా సమయమివ్వాలని గూగుల్ కోరుతున్నది. కాగా, ఆర్బీఐ నిబంధనల అమలుకు సిద్ధమని, తమ లోకల్ వ్యవస్థను రూపొందించామని వాట్సాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

వ్యక్తిగత సమాచార భద్రత ముసాయిదాకు అనుగుణంగానే..
వ్యక్తిగత సమాచార భద్రత ముసాయిదా బిల్లులో భాగంగానే ఆర్బీఐ ఈ డేటా లోకలైజేషన్ నిబంధనల్ని తీసుకొచ్చింది. వీటి అమలుపై ఇప్పటికే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగోతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సమావేశమై చర్చించారు.

కానీ పరిశ్రమ వర్గాలు, ముఖ్యంగా టెక్నాలజీ సంస్థలు ఈ డేటా లోకలైజేషన్‌తో భారత్‌లో వ్యాపార నిర్వహణ పరిస్థితులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ ప్రజల వ్యక్తిగత, ఆర్థిక భద్రత ద్రుష్ట్యా డేటా లోకలైజ్ చేయాలన్న ఆర్బీఐ నిబంధనల అమలుకు సదరు ఫిన్ టెక్ సంస్థలకు క్లిష్టంగా మారింది.

కఠిన వైఖరి ప్రదర్శించొద్దని ప్రధాని మోదీకి సెనెటర్ల లేఖ
ఆర్బీఐ డేటా లోకలైజేషన్‌పై స్పందించిన అమెరికా సెనెటర్లు కఠిన వైఖరి తగదని, కాస్త పట్టు విడుపులు ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు సెనెటర్లు లేఖ రాశారు. ఈ తరహా పోకడ భారత్‌లో అమెరికా వ్యాపారాన్నే ప్రభావితం చేయగలదని హెచ్చరించారు.

ఆర్బీఐ నిబంధనలు సమాచార స్వేచ్ఛకు విఘాతమని సెనెటర్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ కార్నిన్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన మార్క్ వార్నర్ మోదీకి రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. ఈ నిబంధనలు విదేశీ సంస్థల నిర్వహణ వ్యయాన్ని పెంచుతాయని, సేవలను ప్రియం చేస్తాయన్న సెనెటర్లు.. ఇది భారత సంస్థలకు లాభిస్తుందని, దానివల్ల విదేశీ పెట్టుబడులపైనా ప్రభావం చూపుతుందన్నారు.