శక్తి కాంత దాస్ ఎప్పడినుండైతే ఆర్ బి ఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాడో, అప్పటినుండి వడ్డీ రేట్లను ఆర్ బి ఐ వరుసగా తగ్గిస్తూ వస్తుంది. నిన్న కూడా అందరూ భావించినట్టే వడ్డీ రేట్లను తగ్గించారు. అందరూ 0.25% మేర మాత్రమే తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ ఇంకో 10 బేసిస్ పాయింట్ల మేర అధికంగా తగ్గించింది. మొత్తంగా 0.35% తగ్గించారు. కొన్ని రోజుల కిందటి ఆర్ బి ఐ గవర్నర్ స్పీచ్ విన్నా, ప్రస్తుత పరిస్థితి చూసినా రాబోయే రోజుల్లో మరో 0.25% నుంచి 0.5% మేర మరో దఫా కూడా రేట్లను తగ్గించే సూచనలు కనపడుతున్నాయి. 

ఇలా రేట్లను తగ్గించడానికి ముఖ్య కారణం మార్కెట్లలో నెలకొని ఉన్న మందగమనం. మార్కెట్లు ఆర్థికంగా దూసుకెళ్లట్లేవు. వృద్ధి దాదాపుగా ఆగిపోయింది. ఇప్పటికే భారత్ 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ స్థానం నుంచి రెండు స్థానాలు కిందకు పడిపోయి 7వ స్థానంలో నిలిచింది. ఈ తరుణంలో మార్కెట్లలో ఊపు రావాలంటే డబ్బును చాల చౌకగా అందుబాటులో ఉండేలా చేయాల్సిన అవసరం ఉంది. దాదాపుగా అన్ని రంగాల్లో మనకు మందగమనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఆటోమొబైల్ రంగం నుండి స్టీల్ వరకు కాదేది మందగమనానికి అనర్హం అన్న విధంగా నష్టాల్లో నడుస్తున్నాయి. దానికి తోడు నిరుద్యోగం. మొత్తంగా వెరసి ఆర్ధిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. 

వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు మాత్రమే కార్పొరేట్లు డబ్బులను అప్పుగా తీసుకొని నూతన పెట్టుబడులు పెట్టే ఆస్కారం ఉంటుంది. రేట్లు ఇలా తగ్గించినప్పుడు మాత్రమే కార్పొరేట్ల లాభాలు పెరిగి వారు తయారు చేసే వస్తువులు చవకగా కాకపోయినా కనీసం అందుబాటులోనైనా ఉంటాయి. అప్పుడు ప్రజలు అధికంగా కొనుగోలు చేయడం వల్ల వినియోగం పెరిగి మార్కెట్లు ముందుకెళ్లే ఆస్కారం ఉంది. 

ఇలా వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల బ్యాంకు లోన్లు కూడా చవకగా మారుతాయి. అప్పుడు ప్రజలు ఎక్కువగా తమ అవసరాల నిమిత్తం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆర్ధిక వృద్ధి ఏర్పడుతుంది. ఆర్ధిక వృద్ధి సాధించాలంటే ఎగుమతులు పెరగడం తప్పనిసరి. ఎగుమతులు పెరగాలంటే వారికి పెట్టుబడులు, తక్కువ రేట్లకే డబ్బును అందించాలి. అందుకోసం కూడా ఇది తప్పనిసరి. వీటన్నింటికీ తోడు చైనా తన కరెన్సీ మారకం విలువను తగ్గిస్తూ ఉండడం, అమెరికా కూడా తన వడ్డీ రేట్లను తగ్గించడంతో ఆర్ బి ఐ కి కూడా వడ్డీ రేట్లను తగ్గించక తప్పలేదు. 

ఇదంతా బాగానే ఉంది ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం కూడా దాదాపుగా 3.1%గా  ఉంది. 4% టార్గెట్ ఏదయితో ఉందో దానికి లోబడే ఉంది. దీనితో ఆర్ బి ఐ వడ్డీ రేట్లను  తగ్గించినా ఇప్పటికైతే వచ్చిన నష్టమేమి లేదు. కాకపోతే ఇలానే కనుక వడ్డీ రేట్లను తగ్గించుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ద్రవ్యోల్బణం పెరిగే ఆస్కారం లేకపోలేదు. ఒకవేళ రుతుపవనాలు కనుక అనుకున్న స్థాయిలో వర్షపాతాన్ని అందించలేకపోతే, ఆహార పదార్థాల రేట్లు పెరిగిపోయి ద్రవ్యోల్బణం మరింత పెరిగే ప్రమాదం ఉంది. 


ఆర్బీఐ రేట్లను తగ్గించినప్పటికీ ఆ తగ్గించిన వడ్డీ రేట్లను బ్యాంకులు కస్టమర్లకు అందించడం లేదు. ఇలా తగ్గించిన రేట్లను గనుక ప్రజలకు పూర్తి స్థాయిలో అందించలేకపోతే బ్యాంకు రుణాల పై వడ్డీ అలానే ఎక్కువగా ఉండి రుణాలు తీసుకోవడానికి ప్రజలు ముందుకు రారు. అప్పుడు ఏదైతే ఫలాలను ఆశించి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిందో, ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఎస్ బీఐ, హెచ్ డి ఎఫ్ సి మాత్రమే పూర్తి స్థాయిలో కాకున్నా కొంతమేరనైనా తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. కానీ ఈ రెండు బ్యాంకులు మాత్రమే తగ్గిస్తే సరిపోదు. అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు కూడా ఈ సౌలభ్యాన్ని అందించినప్పుడే అనుకున్న ఫలాలు అందుతాయి. 

మరి వడ్డీ రేట్లను తగ్గించడం తప్పా? కాదు. ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తగ్గించక తప్పదు కూడా. కాకపోతే కేవలం వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రమే ఆర్ధిక స్థితి మెరుగుపడి వ్యవస్థ గాడిలో పడుతుందనుకుంటే పొరపాటే. బడ్జెట్ ప్రవేశ పెట్టిననాటి నుండి స్టాక్ మార్కెట్లు ఇంతవరకు కోలుకున్న పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా ఆర్ధిక వృద్ధి రేటు అంత ఆశాజనకంగా ఉండే పరిస్థితి కనపడడం లేదు. ఎందరో పెద్ద పెద్ద కంపెనీల అధినేతలు కూడా ఇదే మాట అంటున్నారు. 

మరి ఇప్పుడు ఎం చేయాలి? ప్రభుత్వం కేవలం వడ్డీ రేట్ల తగ్గింపే సర్వరోగ నివారిణిగా చూడకుండా, సంస్థాగతంగా నిర్మాణాత్మకమైన మార్పులు చేయవలిసిన అవసరం ఉంది. ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ని మరింతగా సులభతరం చేయాలి. విదేశాల నుంచి పెట్టుబడులను అధికంగా ఆకర్షించే విధంగా విధానపరమైన మార్పులు తేవాలి. ఎన్నో సంవత్సరాలుగా ఇటు బ్యాంకులను అటు కార్పొరేట్ కంపెనీలను వెంటాడుతున్న ఎన్ పి ఏల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 

ఇలాంటి అన్ని చర్యలను తీసుకుంటూ, అప్పుడు  వడ్డీ రేట్లను తగ్గిస్తే ఆశించిన వృద్ధి రేటును భారత్ సాధిస్తుంది. కేవలం వడ్డీ రేట్లను మాత్రమే తగ్గిస్తే ఆర్ధిక వ్యవస్థ గాడినపడుతుంది అనుకుంటే పొరపాటే.