న్యూఢిల్లీ: ఈసారి ద్రవ్యసమీక్షలోనూ భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరో పావు శాతం చొప్పున తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా గత మూడు ద్వైమాసిక సమీక్షల్లో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష జరుగుతున్నది. ఇందులోనూ రెపో, రివర్స్ రెపోలను పావు శాతం తగ్గించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ కోతలు మొదలయ్యాయి. ఏప్రిల్, జూన్ సమీక్షల్లోనూ కొనసాగాయి. 

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరుగుతున్న ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఈసారి కూడా పావు శాతం వడ్డీరేట్లను తగ్గిస్తుందని కార్పొరేట్ వర్గాలు ఆశాభావం పరిశ్రమ వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం పాలసీ నిర్ణయం వెలువడనున్నది. 

25 బేసిస్ పాయింట్ల మేర రెపో, రివర్స్ రెపో దిగిరావచ్చని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్ రాయ్ అంచనా వేశారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ కన్జ్యూమర్ బ్యాంకింగ్ అధ్యక్షుడు శాంతి ఏకాంబరం కూడా ఇదే అంచనాను కనబరుస్తున్నారు. 
ఇక ఎడిల్‌వీస్ రిసెర్చ్ ఈసారి 50 బేసిస్ పాయింట్ల వరకు కీలక వడ్డీరేట్లు దిగవచ్చని చెబుతున్నది. ఇటీవలి ఇంటర్వ్యూలో 25 బేసిస్ పాయింట్ల కోతకు అవకాశం ఉన్నదని ఆర్బీఐ గవర్నర్ దాసే చెప్పడంతో 25 బేసిస్ పాయింట్లు తప్పక తగ్గుతాయని అంచనా వేస్తున్నది. 

మందగించిన ఆటో అమ్మకాలు, పడకేసిన పెట్టుబడులు, నీరసించిన ఎగుమతులు, దేశీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అడ్డుపడుతున్నాయని అంటున్న ఎడిల్‌వీస్.. వచ్చే ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరడానికి వడ్డీరేట్ల కోత అవసరమని పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఈసారీ వడ్డీరేట్ల కోతకు దాస్ మొగ్గు చూపవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

గత ఆర్థిక సంవత్సరం (2018-19) దేశ జీడీపీ 2017-18తో పోల్చితే 7.2 శాతం నుంచి 6.8 శాతానికి పడిపోయిన సంగతి విదితమే. చివరి త్రైమాసికం (ఈ ఏడాది జనవరి-మార్చి)లో ఐదేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 5.8 శాతానికి దిగజారింది. దీంతో వృద్ధిరేటును పరుగులు పెట్టించే పనిలో ఆర్బీఐ నిమగ్నమైంది. ఇందులో భాగంగానే వరుస వడ్డీరేట్ల కోతలతో ముందుకెళ్తున్నది.

మరోవైపు జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను మూడుసార్లు తగ్గించిన సెంట్రల్ బ్యాంక్..ఈసారి కూడా తగ్గించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఈ నిర్ణయం మార్కెట్లకు బూస్ట్‌నివ్వనున్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అమెరికా-చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధమేఘాలు ఇంకా కొలిక్కి రాకపోవడం, కార్పొరేట్ల నిరుత్సాహక ఫలితాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలని పేర్కొన్నారు. 

ఈఏడాదికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎఫ్‌పీఐలపై విధించిన పన్ను సర్‌చార్జ్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖతో ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు చర్చలు స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. ఆర్బీఐ నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు వేచిచూస్తున్నాయని ఎపిక్ రీసర్చ్ ముస్తాఫా నదీమ్ తెలిపారు.