ప్రస్తుతం RBI చేసిన రూ. 2 వేల నోటు ఉపసంహరణ, డీమానిటైజేషన్ ఒకటి కాదా...మరి రెండింటికి తేడా ఏంటి..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సాయంత్రం అతి పెద్ద ప్రకటన చేసింది. ఈ సారి ఏకంగా 2 వేల నోట్లు ఇకపై చలామణిలో ఉండవని ప్రకటించింది . అంటే, 2016 డిమోనిటైజేషన్ తర్వాత, చెలామణిలోకి వచ్చిన రూ.2,000 నోటు ఇప్పుడు మార్కెట్ నుండి అదృశ్యమవుతోంది. అయితే, ఈసారి డీమోనిటైజేషన్ నిర్ణయం 8 నవంబర్ 2016 నాటి డీమోనిటైజేషన్ నిర్ణయం కన్నా కూడా చాలా భిన్నమైనదని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. అంతే కాదు రూ.2 వేల నోటు రద్దును డీమానిటైజేషన్ అని టెక్నికల్ గా అనలేమని నిపుణులు చెబుతున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ప్రకారం, ఇప్పుడు 2 వేల రూపాయల కొత్త నోట్ల ముద్రణ నిలిపివేయనున్నారు. అలాగే 2 వేల నోట్లు కలిగి ఉండటం నేరం కాదు. దీనికి ఒక ప్రధాన కారణంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇంకా 2 వేల నోటును పూర్తిగా రద్దు చేయలేదు. ఇది ఇప్పటికీ చెల్లుబాటు అవుతుంది. దానిని తీసుకోవడానికి ఎవరూ నిరాకరించలేరు. అలాగే రిజర్వ్ బ్యాంక్ క్రమంగా ఈ నోట్లను ఉపసంహరించుకుంటుంది. సామాన్యులు తమ వద్ద ఉంచుకున్న 2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు. దీంతో సామాన్యులు గత నోట్ల రద్దు మాదిరి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పుడు కూడా తమ వద్ద ఉంచుకున్న రూ.2000 నోట్లను వినియోగించుకోవచ్చని తెలిపింది.
ఇదిలా ఉంటే బ్యాంకులను ఆర్బీఐ ఇకపై రూ2 వేల నోట్ల జారీని చేయవద్దని, తక్షణమే నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అంతేకాదు ఆర్బీఐ తాము ప్రవేశపెట్టిన క్లీన్ నోట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
సరిగ్గా ఏడేళ్ల క్రితం 8 నవంబర్ 2016న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో నోట్ల రద్దును ప్రకటించారు. అప్పుడు 500, 1000 నోట్లను చెలామణి నుంచి తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశంలో పెను దుమారాన్ని సృష్టించింది. అయితే ఆ తర్వాత కొత్త నోట్లు కరెన్సీ మార్కెట్‌లో భాగమయ్యాయి. రూ. 200, రూ. 500, రూ. 2 వేల నోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇప్పుడు రూ.2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.
2016లో నోట్ల రద్దు తర్వాత గందరగోళం నెలకొంది
నవంబర్ 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, ఆ తర్వాత కొన్ని నెలలపాటు దేశంలో చాలా గందరగోళం నెలకొంది. పాత నోట్లను డిపాజిట్ చేసేందుకు, కొత్త నోట్లను తీసుకోవడానికి ప్రజలు బ్యాంకుల వద్ద పెద్ద క్యూలో నిలబడాల్సి వచ్చింది. పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడి సుమారు వంద మందికి పైగా అసువులు బాసినట్లు కేసులు కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఈసారి 2 వేల నోటు చెలామణి రద్దు చేయకపోవడంతో ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
డీమోనిటైజేషన్ మనకు కొత్త కాదు
భారతదేశంలో నోట్ల రద్దు కొత్తది కాదు..భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే, దేశంలో పెద్ద నోట్ల రద్దు జరిగింది. ఇది 1946లో, బ్రిటిష్ పాలనలో దేశంలో మొదటిసారిగా నోట్ల రద్దు జరిగింది. జనవరి 12, 1946న, వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, సర్ ఆర్కిబాల్డ్ వేవెల్, అధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లను రద్దు చేసేందుకు ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించారు.
1978లో కూడా నోట్ల రద్దు జరిగింది
1978 జనవరి 16న నల్లధనాన్ని నిర్మూలించేందుకు జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.1,000, రూ.5,000, రూ.10,000 నోట్లను రద్దు చేసింది. అప్పట్లో దేశాయ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి హెచ్.ఎం. పటేల్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక కార్యదర్శిగా ఉన్నారు.