Asianet News TeluguAsianet News Telugu

వడ్డీరేట్ల కోతతో ద్రవ్యలోటు సవాళ్లు: ఆర్బీఐ తీరుపై ‘ఫిచ్’ ఆందోళన

వరుసగా వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఫెడ్ రేట్ పెంచే పరిస్థితి లేకపోవడం.. దేశీయంగా తగ్గిన ద్రవ్యోల్బణ ధోరణులతో వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ.. దేశీయ ఆర్థిక రంగం ముందు ఉన్న సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని హితవు చెప్పింది.

RBI first APAC central bank to begin interest rate easing cycle: Fitch
Author
New Delhi, First Published Apr 25, 2019, 10:04 AM IST

న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో తక్కువ వడ్డీరేటు వ్యవస్థలోకి తిరిగి ప్రవేశించిన తొలి సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ `ఫిచ్’పేర్కొంది. దేశీయంగా తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణ ధోరణులు, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంచే అవకాశాలు కనబడని తీరు, దీనితో అంతర్జాతీయంగా సరళతరంగా ఉన్న ఆర్ధిక పరిస్థితులు... ఆర్బీఐ రేటు తగ్గింపునకు దోహదపడుతున్నాయని ఫిచ్ వివరించింది.

ఆర్బీఐ ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ నెల నాలుగో తేదీన రెపో రేటు 25 బేసిక్ పాయింట్లు కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీనితో ఈ వడ్డీరేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. అంతకుముందు రెండు నెలల క్రితం ఫిబ్రవరి ఏడో తేదీన జరిగిన  ద్వైమాసిక సమీక్షలోనూ ఆర్బీఐ రెపో రేటు పావుశాతం కోత నిర్ణయం తీసుకుంది. 

2016లో ఎంపీసీ ఏర్పాటయిన తర్వాత ఇలా వరుసగా రెండుసార్లు రేటు కోత నిర్ణయం ఇదే తొలిసారి. గత ఏడాది ఆర్బీఐ రెండు సార్లు అరశాతం రేటు పెంచింది. తాజా నిర్ణయంతో పెరిగిన మేర రివర్స్ బాటలో పయనిస్తోందని ఫిచ్ తన తాజా ఆసియా పసిఫిక్ సావరిన్ క్రెడిట్ ఓవర్ వ్యూ నివేదికలో పేర్కొంది. 

మున్ముందు మరింత రేటు తగ్గింపునకు గల అవకాశాలను ఆర్బీఐ అన్వేషించే అవకాశం ఉన్నదని, అయితే 2019లో రేటు తగ్గింపునకు అవకాశాలు లభించకపోవచ్చునన్నది. వస్తున్న ఆదాయాలు తగ్గి వ్యయాలు పెరగడం వంటి అంశాలు భారత్ ద్రవ్యలోటు పరిస్థితులకు సవాళ్లు విసిరే అవకాశం ఉన్నదని ఫిచ్ ఆందోళన వ్యక్తం చేసింది.

కొన్ని నగదు ప్రత్యక్ష బదలాయింపులు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేయవచ్చునని వ్యాఖ్యానించింది.  ఇక 2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణాన్ని 60 శాతానికి పరిమితం చేయాలన్నది భారత్ ప్రణాళిక. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే, భారత్ ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని ఫిచ్ గుర్తు చేసింది.  

దీనికి తోడు కేంద్ర రుణ భారం తీవ్ర స్థాయిలో ఉందని, ఆర్థిక రంగంలో ఇబ్బందులు ఉన్నాయని ఆర్బీఐని ఫిచ్ హెచ్చరించింది. వ్యవస్థాగత అంశాల్లో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాల్సి ఉన్నదని పేర్కొంది. 

అయితే సమీప కాలంలో దేశం పటిష్ట వృద్ధి బాటన కొనసాగే అవకాశం ఉంది. విదేశీ మారకపు నిల్వలు 400 బిలియన్ డాలర్ల ఎగువన పటిష్టంగా ఉన్నాయి. విదేశీ సవాళ్లను తట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనితో సవాళ్లు–ఆశావహ పరిస్థితులు మధ్య సమతౌల్యత కనిపిస్తోంది.

దీనితో ఫిచ్ రేటింగ్స్ ‘బీబీబీ–’ దిగువస్థాయి పెట్టుబడుల గ్రేడ్’ను యథాతథంగా కొనసాగుతుంది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండవచ్చు. 2020–21లో 7.1 శాతానికి పెరిగే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios