న్యూఢిల్లీ/ ముంబై: రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), కేంద్రప్రభుత్వం మధ్య నిధుల నిల్వల అంశంపై కొంతకాలంగా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కాగ్ సంచలన విషయాలు బయట పెట్టింది. గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా ఆర్బీఐ దాదాపు రూ.2.5 లక్షల కోట్లను బదిలీ చేసినట్లు కాగ్ తెలిపింది. ఆర్బీఐ ఆదాయంలో ఈ మొత్తం 75 శాతానికి సమానం కావడం గమనార్హం.

కానీ ఆర్బీఐ నుంచి ఇంకా తమకు అదనపు నిధులు కేటాయించాలని కేంద్రం ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఇబ్బందికర విధాన నిర్ణయాలతో సమస్యల్లో చిక్కుకున్న కేంద్రం.. వాటి నుంచి బయటపడేందుకు ఆర్బీఐ వద్ద గల అదనపు నిధులపై కేంద్రీకరించిందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నారు. 

ఇందుకోసం ఆర్బీఐ చట్టంలో ‘సెక్షన్ -7’ అమలుకు కేంద్రం పూనుకున్నట్లు వార్తలొచ్చాయి. అదే జరిగితే ఈపాటికి ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వ పెద్దలు, ఆర్బీఐ గవర్నర్ కూడా సంయమనం పాటించారని సోమవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం తీరు చెబుతోంది. ఆర్బీఐ వద్దనున్న రూ.9 లక్షల కోట్లకుపైగా మిగులు నిల్వల్లో ప్రభుత్వం వాటా కోరుతున్నదన్న ఆరోపణల నేపథ్యంలో ఐదేళ్లలో 75 శాతం ఆదాయాన్ని ఖజానాకే ఆర్బీఐ తరలించిందన్న నిజాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.


నిరుడు ప్రభుత్వ ఆర్థిక ఖాతాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలించగా, ఈ సమయంలోనే ఆర్బీఐ ఆదాయ, వ్యయాలపైనా అధ్యయనం చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరం (జూలై-జూన్ కాలం) నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు ఆర్బీఐ ఆదాయం రూ.3.3 లక్షల కోట్లయితే, అందులో రూ.2.48 లక్షల కోట్లు డివిడెండ్‌గా ప్రభుత్వ ఖజానాకే బదిలీ అయినట్లు తేలింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలోనైతే ఆర్బీఐ తమ ఆదాయంలో ఏకంగా 83 శాతాన్ని ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అప్పగించినట్లు స్పష్టమవుతున్నది.

2016-17 ఆర్థిక సంవత్సరం మినహా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.65,000 కోట్లను డివిడెండ్‌గా ఆర్బీఐ అందించింది. 2016-17లో ఆర్బీఐ ఖర్చులు రూ.31,000 కోట్లుగా నమోదయ్యాయి. దీంతోనే డివిడెండ్ రూ.30,659 కోట్లకే పరిమితమైంది. 2016-17 వరకు ఆర్బీఐ వ్యయం రూ.15,000 కోట్లకు దిగువే ఉన్నది. పాత పెద్ద నోట్ల రద్దుతో కొత్త కరెన్సీని ముద్రించాల్సి రావడం వల్లే ఆర్బీఐ వ్యయం 2016-17లో రెట్టింపైంది. 

అయినా ఆర్బీఐ వద్ద భారీగా మిగులు నిల్వలు ఉన్నాయని, ప్రపంచంలో మరే దేశ సెంట్రల్ బ్యాంక్ వద్ద కూడా ఈ స్థాయిలో నిల్వలు లేవని కేంద్రం అంటున్నది. ఈ క్రమంలో గత నెల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య.. ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వం మరింత డివిడెండ్‌ను ఆశిస్తున్నదంటూ, తాము టెస్టు క్రికెట్ ఆడుతుంటే.. కేంద్రం టీ-20 నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శించిన సంగతి విదితమే.

ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో సోమవారం జరిగిన ఆర్బీఐ బోర్డు కీలక సమావేశాన్ని కాల్పుల విరమణగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. 9 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో సయోధ్య కుదిరిన సంకేతాలు వచ్చినా, దీన్ని సంధిగా మాత్రం చూడలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కీలక అంశాలపై కమిటీల ఏర్పాటును ఇందుకు ఉదహరిస్తున్నారు. 

మార్కెట్లు కూడా పతనమైన విషయాన్ని గుర్తుచేస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నష్టపోయాయని, మూలధన నిల్వలపై స్పష్టత కొరవడటమే కారణమని చెబుతున్నారు. ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నిబంధనల అంశాన్నీ తేల్చకుండా కమిటీలకు వదిలేయడం మదుపరులకు రుచించలేదని పేర్కొంటున్నారు. మొత్తానికి తాజా సమావేశంతో ఆర్బీఐకి కొంత లాభం, కొంత నష్టం వచ్చిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆర్బీఐ తాజా బోర్డు సమావేశం తీరుతెన్నులు కేంద్రంతో రాజీ సంకేతంగా ఆర్థిక విశ్లేషకులు అభివర్ణిస్తుంటే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆర్బీఐదే పైచేయిగా పేర్కొంటున్నారు. సమావేశం అనంతరం ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన ఇందుకు అద్దం పడుతున్నదని చెబుతున్నారు. ఎన్నికల వేళ ఆర్బీఐతో విభేదాలను ప్రతిపక్షాలు తమ రాజకీయ అస్ర్తాలుగా వినియోగించుకుంటుండటంతో కేంద్ర ప్రభుత్వం వెనుకకు తగ్గినట్లు కనిపించిందని వారు అంటున్నారు. 

వచ్చే నెల 14న మరోసారి ఆర్బీఐ బోర్డు సమావేశం కానుండటం, అప్పటికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానుండటంతో ఈ వ్యవహారంపై తాడోపేడో అప్పుడు తేలే వీలుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికైతే ఆర్బీఐదే పైచేయి అని మెజారిటీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆర్బీఐ-కేంద్రం మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమైన మిగులు నిల్వల వ్యవహారం వారంలోగా ఓ కొలిక్కి వస్తుందని సంబంధిత ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వానికి ఆర్బీఐ నుంచి మిగులు నగదు నిల్వలు బదలాయించే అంశం (ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేంవర్క్)పై నిపుణుల కమిటీని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌లు వారంలోగా ఏర్పాటు చేయవచ్చని సదరు వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులతోపాటు వివిధ రంగాల నిపుణులు కూడా ఉండనున్నారు. 

ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలు కమిటీ సభ్యులను నిర్ణయిస్తారని వెల్లడించాయి. రూ. లక్ష కోట్ల నుంచి రూ.3.6 లక్షల కోట్ల వరకు ఆర్బీఐ వద్దనున్న మిగులు నిల్వల నుంచి ప్రభుత్వం కోరిందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు ఆర్బీఐ ససేమిరా అనడంతోనే ఆర్థిక మంత్రిత్వ శాఖకు, ఆర్బీఐకి మధ్య సంబంధాలు చెడ్డాయని వినిపిస్తున్నది. ఆర్బీఐ వద్ద ప్రస్తుతం రూ.9.69 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.