సోషల్ మీడియాలో విద్వేషాలు, బెదిరింపులకు పాల్పడవద్దని నెటిజన్లకు టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎమిరస్ రతన్ టాటా హితవు చెప్పారు. ఆదివారం ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ఆయన ఆన్‌లైన్‌లో ఇతరుల పట్ మర్యాదగా వ్యవహరించాలని రతన్ టాటా సూచించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలువాలని రతన్ టాటా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పరస్పరం దూషించుకోవడం, బెదిరింపులకు దిగడం మానివేయాలని కోరారు. ‘ప్రతి ఒక్కరూ ఈ ఏడాది సవాళ్లతో కూడుకున్నదే. ఈ మధ్య ఆన్ లైన్‌లో నెటిజన్లు ఇతరులను దూషించడం, కించపర్చడం చాలా చూస్తున్నానని అన్నారు. అలా వారి ప్రతిష్ఠను దిగజార్చడం మంచిది కాదని టాటా వ్యాఖ్యానించారు.

ఏ విషయంలోనైనా వెంటనే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇష్టం వచ్చినట్లు కోప్పడుతున్నారని రతన్ టాటా అన్నారు. అలా వ్యవహరించకుండా సంయమనం పాటించాలని సూచించారు. శాంతంగా ఉండి ఇతరుల పట్ల దయ, కరుణతో వ్యవహరించాలని కోరారు.

also read రికార్డు బ్రేక్ చేస్తున్న బంగారం ధరలు..10గ్రాములకు ఎంతంటే..? ...

ఈ ఏడాది మనమంతా కలిసి ఉండటానికి, ఒకరికొకరు తోడుగా నిలిచేందుకు ప్రత్యేకంగా ఉంటుందని విశ్వసిస్తున్నామని రతన్ టాటా పేర్కొన్నారు. ఇది ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించే సమయం కాదని, మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని అభ్యర్థించారు.

అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని రతన్ టాటా కోరారు. ఇక తాను ఆన్‌లైన్‌లో కొద్దిసేపే ఉన్నా, ఇక్కడ మంచి వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కోప, తాపాలను, రాగద్వేషాలను పక్కనబెట్టి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ప్రస్తుతం 4 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారని, భారతీయులు ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నారని రతన్ టాటా చెప్పారు. ప్రస్తుతం టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా పని చేస్తూ దాత్రుత్వ సేవలందిస్తున్నారు. మరోవైపు ఖాళీ సమయంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సలహాలు ఇస్తున్నారు.

కరోనా నివారణకు గరిష్ఠంగా రూ.1500 కోట్ల విరాళాలను అందచేసిన సంస్థలు టాటా సన్స్, టాటా ట్రస్ట్‌లు కావడం గమనార్హం. అప్పుడప్పుడు యువతరంతో కలిసి పని చేయడానికి రతన్ టాటా ప్రాధాన్యం ఇస్తారు. వారి ఆలోచలను పంచుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 26 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.