Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ వృద్ధికి విఘాతం: వాణిజ్య యుద్ధాలపై హెచ్చరించిన రాజన్.. రూపీపై ఆందోళనే వద్దు

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ప్రగతికి ఆటంకంగా పరిణమిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. వర్ధమాన దేశాలపై ప్రభావం చూపకున్నా.. చైనాతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యం చేస్తున్న దేశాలకు తిప్పలు తప్పవని పేర్కొన్నారు. డాలర్ విలువ బలోపేతం కావడం వల్లే రూపాయి మారకం విలువ పతనమైందన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.

Raghuram Rajan, foreseer of Great Recession, warns of toxic mix on trade
Author
Chicago, First Published Aug 25, 2018, 11:25 AM IST

షికాగో: సరిగ్గా 13 ఏళ్ల క్రితమే రుణ సంక్షోభంతో పొంచి ఉన్న ఆర్థిక మాంద్యాన్ని ముందే ఊహించి చెప్పిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌ రాజన్‌.. రుణ సంక్షోభం గురించి హెచ్చరించారు. తాజాగా ఇపుడు వాణిజ్య యుద్ధంతో హానికరమైన ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నారు. ఇవి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందన్నారు. ‘ప్రస్తుతం వాణిజ్యంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పడుతున్నారు. ఆ విషయంలో అంతా మంచే జరగడం  చాలా ముఖ్యం. ఇందుకు చర్చలు ఇంకా ముఖ్యం. తెగేదాకా లాగకపోవడమే మంచిది’ అని ఆయన పేర్కొన్నారు.

వాణిజ్య యుద్ధమే కీలకం
‘మనకందరికీ సంక్షోభం ముందు ఏం జరుగుతుందన్నది తెలుసు. అంతక్రితం సంక్షోభ కాలంలో మనం చూశాం. ఆస్తుల ధరలు, రుణాల ధరలు పెరుగుతూ పోతాయి’ అని రఘురామ్ రాజన్ గుర్తుచేశారు. ‘ఇటీవల అంతర్జాతీయ వృద్ధి బలంగానే ఉంది. ఇప్పుడు ఉన్న వాణిజ్య యుద్ధ ఆందోళనలు ఎంతకాలం కొనసాగుతాయన్నది ఇపుడు కీలకం’ అని ఒక ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవలి కాలంలో అతర్జాతీయ ప్రగతి బాగానే ఉన్నదని అయితే ఎంతకాలం ఇది కొనసాగుతుందన్న విషయం పరిశీలించాల్సి ఉన్నదన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంక్షోభం అభివ్రుద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపుతుందన్నారు. 

విచిత్రమేమిటంటే.. 2005లో రుణ సంక్షోభం గురించి ఆయన హెచ్చరించింది కూడా ఇక్కడే కావడం గమనార్హం. ‘అమెరికా, చైనాలు వాణిజ్య యుద్ధం విషయంలో ఎలా ముందుకు వెళతాయన్నదాన్ని బట్టి వృద్ధికి ఎంత ప్రమాదం ఉండేది తెలుస్తుంది. ప్రస్తుతం అంతర్లీనంగా పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. కొన్ని వర్థమాన దేశాల్లోనూ ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి’ అని ఆయన చెప్పారు.

తెగని చర్చలు.. కుదేలవుతున్న వర్ధమాన మార్కెట్లు
దాదాపు రెండు నెలల తర్వాత అమెరికా, చైనా ప్రతినిధులు చర్చలకు వచ్చినా రెండు రోజుల చర్చల తర్వాత ఎటువంటి ప్రగతీ సాధించలేకపోయారని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. దీంతో వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ అలుముకున్నాయన్న రాజన్‌ వ్యాఖ్యలు గమనార్హం. అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రికార్డు గరిష్ఠానికి చేరగా. వర్థమాన దేశాల మార్కెట్లు మాత్రం కుదేలవుతున్నాయి. ఉదాహరణకు షాంఘై స్టాక్‌ ఎక్స్ఛేంజీ కాంపోజిట్‌ ఇండెక్స్‌ ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 17% వరకు నష్టపోయింది.

చైనాపై సుంకాలు వర్ధమాన దేశాలకు ఇబ్బందే 
టర్కీ, అర్జీంటీనాలు ఈ ఏడాది కరెన్సీ సంక్షోభం బారీనపడ్డాయని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. కానీ ఇది వర్థమాన మార్కెట్లకు సోకకపోయినా చైనాపై సుంకాల వల్ల ఇతర వర్థమాన దేశాలపై మాత్రం ప్రభావం ఉండొచ్చునని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా ద్వారా ఎగుమతులు చేసే దేశాలు, ఆ దేశ వాణిజ్యంపై ఆధారపడే దేశాలకు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజన్‌ అంచనా వేశారు.


పెరిగింది కరంట్ ఖాతాలోటు మాత్రమే
‘నిజం చెప్పాలంటే.. ద్రవ్యలోటును భారత అధికార వర్గాలు నియంత్రణలోకితెచ్చాయి. కరెంట్‌ ఖాతా లోటు మాత్రం పెరిగింది. అదీకూడా అధిక ముడి చమురు ధరల వల్లేన’ని ఆయన వివరించారు. ‘ఎన్నికలకువెళుతున్న నేపథ్యంలో భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు సాధ్యమైనంత వరకు మెరుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి’ అని అన్నారు. యూపీఏ హయంలో వృద్ధి మెరుగ్గా రాణించిందని జీడీపీ పాత సిరీస్‌ చూపిస్తున్న వివాదంపై మాట్లాడుతూ ‘మనం ఇపుడు భవిష్యత్‌పై దృష్టి సారించాలి. భారత్‌ 7.5 శాతం వృద్ధితో ముందుకెళుతోంది కదా’  అని పేర్కొన్నారు. బ్యాంకుల్లో పెరుగుతున్న మొండి బకాయిలపై మాట్లాడుతూ ‘బ్యాంకుల్లో పాలన మెరుగు కావాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.

రూపాయిపై భయం అక్కర్లేదు
భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు తమ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపై దృష్టి సారించాలని రాజన్‌ సూచించారు. భారత్‌ విషయానికొస్తే రూపాయి క్షీణతపై మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అది మొత్తం మీద డాలర్ బలోపేతం వల్ల జరిగిన పరిణామంగానే భావించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల16వ తేదీన డాలర్‌పై రూపాయి మారకం విలువ 70.395 వద్ద ఆల్‌టైం కనిష్ఠ స్థాయిని చేరిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios