యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలుగనున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బీఓఈ)పై రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉన్నదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరితో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీఓఈ) గవర్నర్‌ మార్క్‌ క్యార్నీ పదవీ కాలం ముగియనుంది.

ఆ స్థానంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్లు ఇంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. కానీ రాజన్‌ మాత్రం అందుకు సుముఖంగా లేనని తేల్చేశారు.

బ్రెగ్జిట్‌ నేపథ్యంలో బీఓఈపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉందని.. అందుకే ఆ పదవికి తాను దరఖాస్తు చేసుకోలేదని రాజన్‌ బీబీసీకి ఇచ్చిన ముఖాముఖీలో వెల్లడించారు. 

బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి హామండ్ గత జనవరిలో తనను కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పానన్నారు. పలు దేశాల కేంద్ర బ్యాంకు వ్యవహారాల్లో ఇటీవల రాజకీయ జోక్యం పెరిగిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఐరోపా యూనియన్ నుంచి బ్రిటన్‌ వైదొలగనున్న నేపథ్యంలో ఆ దేశం తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కోనుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యార్నీ వారసుడిగా.. అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలని బ్రిటన్‌ భావిస్తోంది. దాని కోసం వేట ప్రారంభించింది.

ఇప్పటి వరకు 30మంది అందుకు పోటీ పడుతున్నట్లు సమాచారం. బీఓఈ గవర్నర్‌ పదవిపై రాజన్‌ స్పందిస్తూ బ్రిటన్‌ రాజకీయాలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి అయితేనే ఆ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించగలరని అభిప్రాయపడ్డారు. 

తనకు బ్రిటన్ దేశ రాజకీయ వ్యవస్థపై లోతైన అవగాహన లేదని తెలిపారు. అంతేకాక తాను బయటి వ్యక్తినని పేర్కొన్నారు రఘురామ్ రాజన్. రాజన్‌ తరహాలోనే ఇతర దేశాల ప్రముఖులు సైతం ఆ పదవిపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో సొంత దేశం నుంచే ఎవరినో ఒకర్ని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్‌గా తొలి టర్మ్‌కే వైదొలిగారు.