Asianet News TeluguAsianet News Telugu

నవంబర్ 30 లోగా స్వచ్ఛందంగా జాబ్ వదిలేసుకోండి..భారతీయ ఉద్యోగులకు అమెజాన్ సూచన, ఐటీ లేబర్ యూనియన్ ఆగ్రహం..

వాలెంటరీ సెపరేషన్ ప్రొగ్రాం (VSP) ద్వారా నవంబర్ 30 లోగా స్వచ్ఛందంగా జాబ్ వదిలేసుకోమని అమెజాన్ భారతీయ ఉద్యోగులకు సూచన చేసింది. అంతేకాదు VSP ప్రోగ్రాం ద్వారా ఉద్యోగం వదిలేసుకుంటే అనేక బెనిఫిట్స్ ఉంటాయని, లేకపోతే అవి ఉండవని సూచన చేసింది. 

Quit your job voluntarily by November 30 Amazon advises Indian employees
Author
First Published Nov 24, 2022, 2:32 PM IST

భారతీయ ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేసి, కంపెనీ ప్రయోజనాలతో వెళ్లిపోవాలని అమెజాన్ కోరింది. అమెజాన్ ఈ వారం దాదాపు 10,000 మందిని తొలగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు భవిష్యత్తులో మరింత మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓ రిపోర్ట్ ప్రకారం, అనేక మంది భారతీయ ఉద్యోగుల కోసం వాలెంటరీ సెపరేషన్ ప్రొగ్రాం (VSP) ప్లాన్ చేస్తున్నారు. దీని ప్రకారం అనేక మంది ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా కోరుతోంది.

అమెజాన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్‌లో L1 నుండి L7 బ్యాండ్‌లో పని చేస్తున్న కొంత మంది భారతీయ ఉద్యోగులు కంపెనీ వాలెంటరీ సెపరేషన్ ప్రొగ్రాంకు అర్హులు అని పేర్కొంది. ఉద్యోగులు VSP కోసం సైన్ అప్ చేస్తే, వారు ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు కంపెనీని వదిలి వెళ్లాలి. అంతేకాదు వారు కూడా కంపెనీ అందించే ప్రయోజనాలను పొందేందుకు అర్హులని అమెజాన్ పేర్కొంది. 

ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశం నవంబర్ 30, 2022 వరకూ ఉంటుందని కంపెనీలో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఉద్యోగులు VSPపై సంతకం చేసినట్లయితే, వారు 22 వారాల వరకు బేస్ పే పొందేందుకు అర్హులు. దానితో పాటు, ఇన్సూరెన్స్ బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీ లేదా బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తాన్ని పొందేందుకు ఉద్యోగులు అర్హులుగా పేర్కొంటున్నారు. 

ఉద్యోగులను తొలగించడం కార్మిక చట్టాలకు విరుద్ధం..NITES

అమెజాన్ తన ఇండియా కంపెనీ నుండి ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. తొలగించిన ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే ఈ-మెయిల్స్ పంపుతోంది.  దీనికి సంబంధించి అమెజాన్ కంపెనీని ఐటీ లేబర్ యూనియన్ Nascent Information Technology Employees Senate (NITES) తీవ్రంగా ఖండించింది. అమెజాన్ ఉద్యోగులను తొలగించడం అనైతికం, చట్టవిరుద్ధమని తెలిపింది.

NITES ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడుతూ, పారిశ్రామిక వివాదాల చట్టంలోని నిబంధనల ప్రకారం, సంబంధిత శాఖ నుండి ఎటువంటి నోటీసు, అనుమతి లేకుండా ఏ యజమాని ఉద్యోగులను తొలగించలేరని పేర్కొన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు కంపెనీలో పనిచేసిన ఉద్యోగులను మూడు నెలల ముందు నోటీసు ఇవ్వకుండా తొలగించలేరని గుర్తుచేశారు. 

అమెజాన్ చేసిన పనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలకు NITES ఫిర్యాదు చేసింది.  ఉద్యోగులను తొలగించడానికి గల కారణాన్ని కంపెనీ వివరించాలని సలుజా తెలిపారు. దీని తర్వాత, సంబంధిత శాఖ ఇరువర్గాల వాదనలు  విని, ఉద్యోగుల తొలగింపు సరైనదా కాదా అని నిర్ణయించాలి. దీనిపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర లేబర్‌ అధికారులకు దరఖాస్తు చేశామని సలుజా తెలిపారు.అమెజాన్ ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపిందని అప్లికేషన్‌లో పేర్కొంది.  ఉద్యోగులను బలవంతంగా తొలగించడంపై అమెజాన్ ఇండియాకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సమన్లు ​​పంపింది. బెంగళూరులోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ఎదుట హాజరుకావాలని మంత్రిత్వ శాఖ సమన్లు ​​పంపింది. మంత్రిత్వ శాఖ తన నోటీసులో, తేదీ, సమయంతో పాటు అన్ని ఆధారాలతో వ్యక్తిగతంగా కార్యాలయంలోని ప్రతినిధి ద్వారా హాజరు కావాలని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios