మరో మూడు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు భాగ్యనగరం వేదిక కాబోతోంది. భారీ పెట్టుబడులతో ఆ కంపెనీలు తరలిరానున్నా యి. ఈ కంపెనీల రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజం క్వాల్‌కామ్ సంస్థ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆఫీస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అమెరికాలోని శాండియాగోలో క్వాల్‌కామ్ ప్రధాన కార్యాలయంలో సీఎఫ్ఓ ఆకాశ్ పాలీవాలా, ఉపాధ్యక్షులు జేమ్స్ జిన్, లక్ష్మీ రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్‌సింగ్ తదితర కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో క్వాల్‌కామ్ సహా మూడు ప్రధాన కంపెనీలు భారీ పెట్టుబడులను ప్రకటించాయి. ఇందులో భాగంగా క్వాల్‌కామ్ హైదరాబాద్‌లో వచ్చే అయిదేళ్ళలో రూ.3,904.55 కోట్ల పెట్టుబడితో రెండో అతిపెద్ద సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే క్యాంపస్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి ఇది పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో దాదాపు 8700 మందికి ఉపాధి కల్పిస్తారు.
15 లక్షల 72వేల చదరపు అడుగుల వైశాల్యం గల కార్యాలయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. పెట్టుబడికి ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నాటికి హైదరాబాద్‌లో తమ కేంద్రం సిద్ధమవుతుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ప్రపంచంలోనే అతిపెద్ద రెండో క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విషయాన్ని తెలిపిన కేటీఆర్, ఈ వరుసలో క్వాల్‌కామ్ చేరడంపై హర్షం వ్యక్తం చేశారు. లాస్ ఏంజెల్స్‌లోని ఫిస్కర్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈవో హెన్రీక్ ఫిస్కర్, సీఎఫ్‌వో గీతా ఫిస్కర్‌లతో కేటీఆర్ సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారనుందని కేటీఆర్ వివరించా రు. జఢ్‌ఎఫ్, హ్యుందాయ్ వంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని, ఇందులో భాగస్వాములు కావాలని మంత్రి కోరగా ఫిస్కర్ కంపెనీ అంగీకరించింది. ఈ సెంటర్‌తో 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయని కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో దీన్ని మరింతగా విస్తరించి, మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. ఫిష్కర్ కంపెనీ తయారు చేసిన ఓషన్ మోడల్ ఎలక్ట్రిక్ కారును కేటీఆర్ పరిశీలించారు.
