Asianet News TeluguAsianet News Telugu

ఇన్ఫోసిస్ డివిడెండ్‘బొనాంజా’

దేశీయ ఐటీ దిగ్గజం డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ప్రకటనలు చేసింది. లాభాల మాటెలా ఉన్నా.. సంస్థను సంఘటిత అభివ్రుద్ధి దిశగా మళ్లించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వాటాదారులకు డివిడెండ్, బైబ్యాక్ ఆఫర్లు ప్రకటించింది. 

Q3 Results: Infosys Announces Rs 10,000-Crore Buyback, Special Dividend
Author
Bengaluru, First Published Jan 12, 2019, 10:08 AM IST

లాభాలు అంచనాలకు దూరంగా ఉన్నా.. భిన్నంగా ఆదాయం సంపాదించిన ఇన్ఫోసిస్ ఇటు వాటాదారులు.. అటు మార్కెట్, క్లయింట్లలో విశ్వాసం నింపే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మరోమారు వాటాదార్లకు బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది.

మెగా బైబ్యాక్‌, ప్రత్యేక డివిడెండ్‌తో ముందుకొచ్చింది. రూ.8,260 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు (బైబ్యాక్‌) శుక్రవారం కంపెనీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. రూ.4 ప్రత్యేక డివిడెండ్ ఇచ్చేందుకు కూడా బోర్డు సిఫారసు చేసింది. 

డిసెంబర్ త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలు ఇలా 
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికానికి కంపెనీ మిశ్రమ ఫలితాలను ప్రకటించింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సర ఆదాయం అంచనాలను ఇన్ఫోసిస్ పెంచడం ఆసక్తికర విషయం. స్థిర కరెన్సీ రూపేణా ఈ ఆర్థిక సంవ్సత్సర ఆదాయంలో 8.5- 9% వృద్ధి ఉండొచ్చని పేర్కొంది. అంతకుముందు 6-8% వృద్ధిని అంచనా వేసింది. 

క్లయింట్లలో విశ్వాసం నింపడంపైనే ఇన్ఫోసిస్ ఫోకస్ 
ఇన్ఫోసిస్ కొత్త సీఈఓగా సలీల్‌ పరేఖ్‌ కంపెనీని తిరిగి గాడిలో పెట్టేందుకు చేపడుతున్న చర్యలు క్లయింట్లలో తిరిగి విశ్వాసాన్ని నింపుతుండటం, డిజిటల్‌ లాంటి కీలక విభాగాల ఆకర్షణీయ పనితీరును దృష్టిలో ఉంచుకొని ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ పెంచినట్లు కనిపిస్తోంది.

క్లయింట్లలో విశ్వాస కల్పన చర్యలతో సత్ఫలితాలు
క్లయింట్లలో విశ్వాసాన్ని తిరిగి నింపేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. క్లయింట్ల సంఖ్య పెరగడంతో మూడో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 10.1 శాతం వృద్ధిని నమోదు చేశామని తెలిపారు.

డిజిటల్‌ వ్యాపార విభాగానికి ఇది మరో గొప్ప త్రైమాసికమని, ఈ విభాగ ఆదాయం 33.1 శాతం పెరిగిందన్నారు. 157 కోట్ల డాలర్ల విలువైన పెద్ద ఆర్డర్లు రావడంతో మరింత ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయబోతున్నామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వివరించారు. 

ఆదాయంలో 20.3% వృద్ధి నమోదు చేసిన ఇన్ఫీ
డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 20.3% వృద్ధి చెంది రూ.17,794 కోట్ల నుంచి రూ.21,400 కోట్లకు చేరింది. త్రైమాసిక ప్రాతిపదికన ఆదాయం 3.8% పెరిగింది. గతేడాది జూలై- సెప్టెంబర్ మధ్య కంపెనీకి రూ.20,609 కోట్ల ఆదాయం వచ్చింది.

జూలై- సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే డాలరు రూపేణా కూడా కంపెనీ ఆదాయం 2.2% పెరిగింది. ఆ సమయంలో 292.1 కోట్ల డాలర్ల ఆదాయాన్ని నమోదు చేయగా.. ఇప్పుడు 298.70కోట్ల డాలర్లకు పెరిగింది. 

33.1 శాతం పెరిగిన డిజిటల్ రెవెన్యూ
ఇన్ఫోసిస్ డిజిటల్‌ విభాగ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 33.1% పెరిగి 94.2 కోట్ల డాలర్లుగా నమోదైంది. బైబ్యాక్‌ రూ.13000 కోట్ల మూలధన కేటాయింపు విధానంలో భాగంగా షేర్ల బైబ్యాక్‌, ప్రత్యేక డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. తాజా బైబ్యాక్‌ ప్రతిపాదనలో భాగంగా 10,32,50,000 ఈక్విటీ షేర్లను కంపెనీ కొనుగోలు చేయనుంది. 

ఇన్ఫోసిస్ షేర్ బైబ్యాక్ ఇలా 
ఇన్ఫోసిస్ ఒక్కో షేర్ ధర రూ.800 మించకుండా  బైబ్యాక్‌ చేయనుంది. ఇందుకోసం రూ.8,260 కోట్ల (118 కోట్ల డాలర్లు) వరకు వెచ్చించనుంది. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై రూ.4 (80%) ప్రత్యేక డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.

పనయాతో పాటు మరో రెండు అనుబంధ సంస్థలు స్కావా, కల్లిడస్‌లను విక్రయించాలన్న యోచనను ప్రస్తుతానికి విరమించుకుంది. ఆశించిన ధరకు కొనుగోలుదార్లు ముందుకు రాకపోవడమే ఇందుకు కారణం. కొనుగోలుదార్ల నుంచి తమకు అందిన ప్రతిపాదనలు, చర్చల పురోగతి ఆధారంగా 2019 మార్చి 31 కల్లా వీటి అమ్మకం పూర్తవ్వకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చామని కంపెనీ తెలిపింది. 

స్కావా, పనయా వ్యాపారాలపై తిరిగి ఇన్ఫోసిస్ ఫోకస్విక్రయించాల్సిన ఆస్తుల జాబితాలో నుంచి వీటిని తొలగించినట్లు పేర్కొంది. స్కావా, పనయాల వ్యాపారాలపై తిరిగి దృష్టి పెట్టే యోచనలో ఇన్ఫోసిస్‌ ఉంది. అక్టోబరు- డిసెంబరులో కొత్తగా 7,762 మంది ఉద్యోగులను ఇన్ఫీ నియమించుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2.25 లక్షలకు చేరింది.

త్రైమాసిక నికర లాభం రూ.3,610 కోట్లు
సమీక్ష త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ రూ.3,610 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2017లో ఇదే కాలంలో నమోదైన రూ.5,129 కోట్లతో పోలిస్తే లాభం 30 శాతం తగ్గింది. గతేడాది జులై- సెప్టెంబరులో ఆర్జించిన రూ.4,110 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి లాభంలో 12.2 శాతం క్షీణత ఉంది.

త్రైమాసికంలో కొత్తగా 101 క్లయింట్లను కంపెనీ జతచేసుకుంది. ఇందులో ఒకదాని ఆర్డరు విలువ 5 కోట్ల డాలర్లకు పైగా ఉండగా.. తొమ్మిదింటి ఆర్డర్ల విలువ 2 కోట్లకు పైనే. కోటి డాలర్లకు మించి విలువున్న విభాగంలో 18 క్లయింట్లు జతయ్యాయి.  

మరోదఫా లీడ్ స్వతంత్ర డైరెక్టర్‌గా కిరణ్ మజుందార్ షా కిరణ్‌ మజుందార్‌షాను లీడ్‌ స్వత్రంత్ర డైరెక్టర్టుగా మరో విడత నియమించేందుకు ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు అంగీకారం తెలిపింది. 2019 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2023 మార్చి 22వ తేదీ వరకు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios