బెంగళూరు: ‘కేఫ్‌ కాఫీ డే’ సృష్టికర్త, అనతికాలంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరొందిన వి.జి సిద్ధార్థ అర్ధంతరంగా తన జీవితాన్ని ముగించారు. తాను ఒక విఫల వ్యాపార వేత్తనని, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేదని 2019 జులైలో ఆత్మహత్య చేసుకున్నారు. 

అయితే సిద్ధార్థ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తడంతో కాఫీ డే బోర్డు చేపట్టిన దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు తెలిశాయని సమాచారం. సంస్థ బ్యాంక్‌ ఖాతాల నుంచి దాదాపు రూ. 2000 కోట్లు అదృశ్యమైనట్లు ఆ దర్యాప్తులో తేలిందని బ్లూమ్‌బర్గ్‌ కథనం పేర్కొంది.  

సిద్ధార్థ మరణం తర్వాత ఆయన రాసినట్లు భావిస్తున్న ఓ లేఖ వెలుగు చూసింది. కంపెనీలో తాను నిర్వహించిన లావాదేవీల గురించి బోర్డు, ఆడిటర్లు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు ఏ మాత్రం తెలియదని సిద్ధార్థ ఆ లేఖలో రాసినట్లుగా ఉంది.

also read డొనాల్డ్ ట్రంప్ కు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణ....

సిద్ధార్థ రాసిన ఈ లేఖ వివాదాస్పదం కావడంతో కాఫీ డే బోర్డు దీనిపై దర్యాప్తు చేపట్టింది. సిద్ధార్థకు చెందిన ఇతర ప్రైవేట్ కంపెనీలతో కాఫీ డే జరిపిన లావాదేవీలను దాదాపు నెల రోజులు పరిశీలించి 100కు పైగా పేజీలతో నివేదికను తయారుచేసింది.

వీజీ సిద్ధార్థ జరిపిన ఈ లావాదేవీల్లో దాదాపు రూ.2000 కోట్ల మేర లెక్క తేలలేదు అని దర్యాప్తులో తేలిందని సమాచారం. ఈ విషయాన్ని దర్యాప్తుతో సంబంధమున్న వ్యక్తులు చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ నివేదిక తుదిదశలో ఉన్నట్లు తెలుస్తోంది. 

కేఫ్ కాఫీ డే లావాదేవీల్లో అదృశ్యమైన మొత్తం విలువ రూ.2500 కోట్లకు పైనే ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ డబ్బంతా ఏమైందనే దానిపై పూర్తినివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని సదరు వ్యక్తులు చెబుతున్నారు.

కాఫీ డే కోసం సిద్ధార్థ వ్యక్తిగత గ్యారెంటీతో పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నారని తెలుస్తోంది. స్థానిక వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీకి అప్పులు తీసుకున్నట్లు ఈ నివేదిక తెలిపింది. పాత రుణాలకు వడ్డీ కట్టడం కోసం కొత్త రుణాలు తీసుకోవడంతో అప్పులు పేరుకున్నాయి. 

also read కరోనా దెబ్బకు ఫార్మాసి రంగం కుదేలు...నిలిచిపోయిన దిగుమతులు...

స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల నివేదిక ప్రకారం.. సిద్ధార్థ లిస్టెడ్‌, ప్రైవేట్ కంపెనీల మొత్తం రుణాల విలువ రూ. 10వేల కోట్లకు పైనే ఉందని వినికిడి. ఈ రుణాలు తిరిగి చెల్లించలేక సిద్దార్థ చాలా సతమతం అయ్యేవారని తెలిసింది. అంతటి ఇబ్బందుల వేళ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు ఎలా మాయం అయ్యిందన్న సంగతి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 

గతేడాది జులై 29వ తేదీన అదృశ్యమైన సిద్ధార్థ రెండు రోజుల తర్వాత జులై 31వ తేదీన నేత్రావతి నదిలో శవమై కన్పించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మరణించడానికి సిద్ధార్థ తన బోర్డు సభ్యులు, ఉద్యోగులకు రాసిన లేఖ ఒకటి ఆ తర్వాత బయటకొచ్చింది. అప్పుల బాధ, పన్ను అధికారులు, రుణదాతల ఒత్తిడి వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ లేఖలో ఉంది. 

అంతేగాక, కంపెనీ ఆర్థిక లావాదేవీలకు పూర్తి బాధ్యత తనదేనని సిద్ధార్థ ఆ లేఖలో రాశారు. ఈ లేఖ కాస్తా వివాదాస్పదంగా మారడంతో దానిపై కాఫే డే బోర్డు దర్యాప్తు జరిపింది. కాగా.. సిద్ధార్థ మరణం తర్వాత కాఫీ డే వ్యాపారం బాగా దెబ్బతింది. సంస్థ షేర్లు కూడా 90శాతానికి పైగా కుంగడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రేడింగ్‌ నిలిపివేశారు.