Asianet News TeluguAsianet News Telugu

కాలగర్భంలోకి రూ.2000 నోటు

రద్దయిన పాత పెద్ద నోట్ల మాదిరే కొత్తగా రెండేళ్ల క్రితం చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు చేరిపోనున్నది. నల్లధనం వెలికితీత, అవినీతిని అరికట్టే లక్ష్యంతో చేపట్టిన నోట్ల రద్దు ఫలితాన్నివ్వడం లేదని కేంద్రం భావిస్తున్నది.

Printing of Rs 2,000 note stops, currency still valid
Author
New Delhi, First Published Jan 4, 2019, 9:19 AM IST

త్వరలో రూ.2000 నోటు కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ పెద్ద నోటు ముద్రణను నిలిపివేయాలని భారతీయ రిజర్వ్బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న వాటిని కూడా క్రమేపీ వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ భావిస్తున్నది.

2016 నవంబర్ ఎనిమిదో తేదీ రాత్రి అకస్మాత్తుగా నల్లధన నిర్మూలన పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన కేంద్రం అంతకన్నా పెద్దనోటును ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ కేంద్రం డొంక తిరుగుడు సమాధానాలతో కాలం గడిపింది. 

తాజాగా, మళ్లీ నల్లధనం, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్కు రూ.2000నోటు ఆయుధంగా మారినట్టు కేంద్రం భావిస్తున్నది. చలామణిలో ఉన్న నగదులో 37% కరెన్సీ రూ.2000 నోట్ల రూపంలోనే ఉంది. బ్యాంకుల నుంచి వెళ్లిన నోట్లు అదేస్థాయిలో బ్యాంకులకు తిరిగి చేరటం లేదన్న అభిప్రాయం వినిపిస్తున్నది. 

ఆ నోట్లన్నీ నల్లధనంగా పోగుపడుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిని నిలువరించాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఉన్నపళంగా రూ.2000 నోటును రద్దుచేస్తే ఎన్నికల ముందు తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో తొలుత ముద్రణను నిలిపివేసి ఆ తర్వాత క్రమంగా చలామణిని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నది.

రూ.2000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిలిపివేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు గురువారం స్పష్టం చేశారు. ముద్రణ నిలిపివేయడంతో పాటు చలామణిని కూడా వివిధ రూపాల్లో క్రమేపీ తగ్గించనున్నట్టు తెలుస్తున్నది. 

సాధారణంగా చలామణిలో ఉండే కరెన్సీ నోట్ల జీవితకాలం సగటున ఐదేళ్లు. చినిగిన, నలిగిన, రంగు పడిన నోట్లు రిజర్వుబ్యాంకు, వాణిజ్య బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇలా వెనక్కి వచ్చిన మొత్తానికి సమానంగా కొత్త నోట్లను ముద్రిస్తారు. ఇక నుంచి రూ.2000 నోట్లను ముద్రించే అవకాశం లేనందున తిరిగి వచ్చిన నోట్లను మిగతా డినామినేషన్లలో ముద్రించనున్నారు.

2016 డిసెంబర్‌తో పోల్చితే చలామణిలో ఉన్న రూ. 2000 నోట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రధానంగా పెద్దనోటు కావడం వల్ల దాచిపెట్టడం, రెండు బ్యాంకులు తిరిగి చలామణిలోకి పరిమితంగానే విడుదల చేయడం. పెద్ద నోట్ల రద్దు సమయంలోనే రూ. 2000 నోటును విడుదల చేయడంలోని ఔచిత్యంపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో క్రమేపీ సమీప భవిష్యత్‌లోనే రూ. 2000 నోటు కాలగర్భంలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనే లక్ష్యంగా పాత పెద్ద నోట్లను రెండేండ్ల క్రితం మోదీ సర్కారు రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016, నవంబర్ 8వ తేదీ రాత్రి రూ.1000, 500 నోట్ల చలామణిని నిషేధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీటికి బదులుగా సరికొత్త రూపంలో రూ.2000, 500 నోట్లను పరిచయం చేయగా, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రైద్దెన నోట్లను డిపాజిట్ చేసి అంతే విలువైన కొత్త నోట్లను పొందాలనీ మోదీ సూచించారు. ఏ ఉద్దేశంతో నోట్లను రద్దు చేశారో.. ఆ లక్ష్యాలనే రూ.2000 నోటు దెబ్బతీస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

అక్రమ నిల్వలు, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్ పెరిగిపోయి మళ్లీ నల్లధనం పేరుకుపోతున్నదని పసిగట్టిన సర్కారు.. ఇక రూ.2000 నోట్ల ముద్రణను ఆపేయాలని ఆర్బీఐకి సూచించింది. దీంతో ప్రింటింగ్‌ను నిలిపివేసినట్లు సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.

గతేడాది మార్చి 31 నాటికి చలామణిలో మొత్తం రూ.18.03 లక్షల కోట్ల నగదు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రూ.6.73 లక్షల కోట్లు లేదా 37 శాతం కరెన్సీ రూ.2000 నోట్లే కావడం గమనార్హం. ఇక రూ.500 నోట్ల విలువ రూ.7.73 లక్షల కోట్లు లేదా దాదాపు 43 శాతంగా ఉన్నది. 

మిగతా చిన్న నోట్ల విలువ రూ.3.57 లక్షల కోట్లు. నిజానికి పెద్ద నోట్ల వల్లే నల్లధనం పోగవుతున్నదని కేంద్రం అభిప్రాయం. దీనిపైనే మోదీ ఆందోళన వ్యక్తం చేశారు కూడా. చలామణిలో 80 శాతానికిపైగా ఉన్న రూ.1000, 500 నోట్ల రద్దుతో వ్యవస్థలో నగదు కొరత ఏర్పడుతుందని భావించిన ప్రభుత్వం రూ.2000 నోట్లను ప్రవేశపెట్టింది. 

ప్రజల్లో నెలకొన్న ఆందోళనలు, అప్పుడున్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా వీటి చలామణినీ పెంచింది. కానీ అవినీతిపరులు తమ అక్రమ సంపదను తిరిగి రూ.2000 నోట్ల రూపంలో భద్రపరుస్తుండటంతో ఇక ఈ నోట్లను కట్టడి చేయాల్సిందేనన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇప్పటికే నోట్ల రద్దు ఓ విఫల చర్యగా అబాసుపాలైంది. 

ఈ క్రమంలో రూ.2000 నోట్లు నల్లధనానికి కొత్త ఊపిరిలు ఊదితే కాస్తోకూస్తో ఒనగూరిన ప్రయోజనానికీ అర్థం లేకుండా పోతుందన్న భయమూ కేంద్రాన్ని వెంటాడుతున్నది. అసలే ఎన్నికల సీజన్ కావడంతో ప్రతిపక్షాలకు ఇక ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని భావిస్తూ కొత్త రూ.2000 నోట్ల ముద్రణకు చెక్ పెట్టింది.

నకిలీ కరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతున్నదని, అందుకే అత్యంత భద్రతా ప్రమాణాలతో కొత్త నోట్లను తీసుకొస్తున్నామని పాత పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రధాని మోదీ చెప్పారు. అయితే కొత్త రూ.2000 నోట్లు పరిచయమైన కొద్దిరోజుల్లోనే నకిలీ కరెన్సీ రావడం సంచలనం సృష్టించింది. పైగా అప్పుడే ఈ నోట్లు చిరుగులు పడుతుండటం కూడా వీటి నాణ్యతను ప్రశ్నార్థం చేస్తున్నది.

చలామణిలో ఉన్న చాలా రూ.2000 నోట్లు పాతవిగా అయిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. పైగా చిల్లర సమస్య కూడా తీవ్రంగా ఉంటున్నది. దీంతో బ్యాంకుల్లోకి వచ్చిన సదరు నోట్లను తిరిగి వ్యవస్థలోకి పంపించకుండా ఆర్బీఐ దగ్గరకు చేరుస్తూ ఈ నోట్ల సంఖ్యను నెమ్మదిగా తగ్గించాలని కేంద్రం యోచనగా ఉన్నట్లు తెలుస్తున్నది. 

నిజానికి గతేడాది ఆగస్టులో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించే యోచనేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ లోక్సభలో ప్రకటించారు. కానీ ఉదయ్ కొటక్ వంటి ప్రముఖ బ్యాంకర్లూ రూ.2000 నోట్ల చలామణి తగ్గితే.. పాత పెద్ద నోట్ల రద్దుకు అర్థముంటుందని, నల్లధనాన్ని అడ్డుకున్నట్లేనని అభిప్రాయపడుతున్నారు. 

ఎస్బీఐ రిసెర్చ్ సైతం రూ.2000 నోట్లు అక్రమ నిల్వలకు దారితీస్తున్నాయని గతంలోనే చెప్పింది. ఈ క్రమంలో నల్లధనానికి పెద్ద నోట్లే కారణమన్న అభిప్రాయాలున్నప్పుడు రూ.1000, 500 నోట్లను నిషేధించి రూ.2000 నోట్లు తీసుకురావడం ఏమిటన్న ప్రశ్నలూ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వీటన్నిటి మధ్య రూ.2000 నోట్ల ముద్రణ ఆగిపోయింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios