బ్యాంకర్లూ పారా హుషార్: మొండి బాకీల వసూళ్లకు పీఎన్బీ సూత్రం ఇది

PNB's bad loan recovery of over Rs 77 bn in first quarter tops FY18 level
Highlights

జ్యువెల్లరీ వ్యాపారి నీరవ్ మోదీ, అతని మేనమామ మెహుల్ చోక్సీ చేసిన మోసం నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. కేవలం గత మూడు నెలల్లోనే రూ.7,700 కోట్ల మొండి బాకీలను వసూలు చేసి.. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకు మార్గం సుగమం చేసింది.

ముంబై: వజ్రాల వ్యాపారి నీరవ్‌మోడీ దెబ్బతో విలవిల్లాడిన ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ) తిరిగి అన్ని శక్తులు కూడదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ఇది ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులకూ ప్రేరణగా, ఒక గుణపాఠంగా నిలువనున్నది. నీరవ్‌మోడీతోపాటు ఆయన మేనమామ మెహుల్‌ చోక్సి పీఎన్బీకి రెండు బిలియన్‌ డాలర్లు (రూ.13,600 కోట్ల) వరకు మోసం చేసి దేశం నుంచి పరారైన సంగతి తెలిసిందే. 

దీంతో పీఎన్బీ పనై పోయిందని చాలా మంది బ్యాంకింగ్‌ రంగ నిపుణులు సూత్రీకరించారు. కానీ అందుకు భిన్నంగా యాజమాన్యం పట్టుదలతో ముందుకు సాగింది. కసితో తిరిగి బ్యాంకును గాడిలో పెట్టాలన్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం  బ్యాంకు మొండిబాకీల వసూళ్లపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మొండి బకాయిలు సుమారు రూ.7,700 కోట్లపైనే వసూలు చేసి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే ఎక్కువ వసూలైనట్లు పీఎన్బీ ఉన్నతాధికారులు చెప్పారు.

ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకులు మొండి బాకీలతో సతమతమవుతున్నాయి. దీనికి కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇన్సాల్వెన్సీ బ్యాక్‌రప్టసీ కోడ్‌ (దివాలా చట్టం) అమల్లోకి తేవడం బ్యాంకులకు కొత్త ఊపిరిపోసినట్లయింది. కొత్త చట్టం ద్వారా బ్యాంకులు అతి పెద్ద మొండిబకాయిల రుణాలను అమ్ముకుని తమ బకాయిలను వసూలు చేసుకోవడానికి వీలైంది. పీఎన్బీ మార్చి – జూన్‌ త్రైమాసికంలో అతి పెద్ద 2-3 పెద్ద ఖాతాలను నుంచి బకాయిలు వసూలు చేసుకోగలిగింది. దివాలాకోడ్‌ చట్టం కోడ్‌ను వినియోగించుకుని రూ.3,000 కోట్లను వసూలు చేసుకోగలిగామని బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీల్‌ మెహతా చెప్పారు. 

అతి పెద్ద రెండు ఖాతాలు భూషణ్‌స్టీల్‌, ఎలక్ట్రోస్టీల్‌ల నుంచి దివాలా చట్టం కోడ్‌ ద్వారా బకాయిలు వసూలు చేసుకోగలిగామని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరమంతా పీఎన్బీ మొత్తం రూ.5,400 కోట్లు వసూలు చేస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే రూ.7,700 కోట్ల వరకు మొండిబకాయిలు వసూలు చేసింది. రెండు పెద్ద మొండి బకాయిలు పద్దులు వసూలు చేసుకోడానికి దివాలా కోడ్‌ చట్టం కీలకపాత్ర పోషించిందని మెహతా అన్నారు. భవిష్యత్‌లో దివాలాకోడ్‌ చట్టం వినియోగించుకుని ఎస్సార్‌ స్టీల్‌, భూషణ్‌ ఫవర్‌ అండ్‌ స్టీల్‌ను పెద్దమొత్తంలో బకాయిలు వసూలయ్యే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

తొలి జాబితాలోని 12 ఖాతాల్లో తొమ్మిది ఖాతాలను రూ.12,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని పీఎన్బీ ఎండీ సునీల్ మెహతా తెలిపారు. ఈ తొమ్మిది ఖాతాల్లోనే ఐదు ఖాతాలు ఉక్కు రంగానికి చెందిన వాటి నుంచి రూ.9,000 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. రెండవ జాబితాలో మొత్తం 28 ఖాతాల్లో 20 ఖాతాల నుంచి రూ.6,500 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ బకాయిలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వసూలు చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

బ్యాంకును అతి దారుణంగా మోసం చేసిన నీరవ్‌మోడీ, ఆయన మేనమామ మెహుల్‌చోక్సి కలిసి బ్యాంకు రూ.13,600 కోట్ల వరకు మోసగించి ఉడాయించిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం నాలుగవ త్రైమాసికంలో మొత్తం రూ.14,356 కోట్లకు బ్యాంకు రూ.7,178 కోట్లు కేటాయింపులు చేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో కేటాయింపులు చేస్తుంది. దీంతో పాటు పీఎన్బీ ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.6,586.11 కోట్లను చెల్లించింది. ఇవన్నీ బ్యాంకు అధికారులు నీరవ్‌మోడీతో కుమ్మక్కై లెటర్‌ ఆఫ్‌ అండర్‌స్టాండిగ్‌ను జారీ చేశాయి. ఈ ఎల్‌ఓయులను మోడీ విదేశాల్లోని బ్యాంకుల్లో సొమ్ము చేసుకున్నారు. ఈ బకాయిలను కూడా పీఎన్బీ చెల్లించింది.

loader