ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)పై దెబ్బపై దెబ్బ పడుతోంది. గతేడాది లెటర్ ఆఫ్ ఇండెంట్ పేరిట నీరవ్ మోదీ ఆయన మేనమామ మెహుల్ చోక్సీ రూ.13,500 కోట్లకు శఠగోపం పెట్టి విదేశాలకు పారిపోయారు. తాజాగా మరో రూ.3,800 కోట్లకుపైగా మోసాన్ని బ్యాంకు గుర్తించింది.

భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ తీసుకున్న రూ.3,805.15 కోట్ల రుణం మోసపూరితంగా పొందిందని గుర్తించామని తెలిపింది. ఈ సమాచారాన్ని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నివేదించినట్లు శనివారం స్టాక్ ఎక్సేంజ్‌లకు బ్యాంక్ తెలియజేసింది.

ఫోరెన్సిక్ ఆడిటింగ్ దర్యాప్తు, కంపెనీ డైరెక్టర్లపై సూమోటోగా నమోదు చేసిన సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ రుణాల సొమ్ము దారి మళ్లినట్లు గుర్తించామని కూడా పేర్కొంది.

దేశీయంగా రూ.3,191.51 కోట్లు, విదేశాల్లో దుబాయ్ శాఖకు సుమారు రూ.345.74 కోట్లు, హాంకాంగ్ శాఖకు దాదాపు రూ.267.90 కోట్లు భూషణ్ పవర్ అండ్ స్టీల్ యాజమాన్యం బకాయిపడినట్లు పీఎన్‌బీ వివరించింది. బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి సంస్థ.. ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. 

భూషణ్ పవర్ అండ్ స్టీల్ దివాలా తీయగా, దాని రుణాలు మొండి బకాయిలుగా మారాయి. ప్రస్తుతం ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో ఉండగా, ఆశాజనక రికవరీ ఉంటుందన్న విశ్వాసంతో బ్యాంక్ ఉన్నది. నీరవ్ మోదీ ప్లస్ మెహుల్ చోక్సీ కుంభకోణంతో బయటపడ్డ బ్యాంక్ లోపాలను పీఎన్బీ కప్పిపుచ్చుకోలేకపోతున్నది.

ఈ సమయంలో ఇప్పుడు భూషణ్ పవర్ అండ్ స్టీల్ రుణాలు కూడా మోసం చేసి తీసుకున్నవేనని తేలడం ఆ బ్యాంక్ పాలనా వ్యవస్థను మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)తోపాటు మరికొన్ని బ్యాంకులకు రూ.7,200 కోట్లకుపైగా సొమ్మును వడ్డీతో చెల్లించాలని నీరవ్ మోదీ, ఆయన అనుచరులను రుణ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) పుణె ధర్మాసనం శనివారం ఆదేశించింది.

పీఎన్‌బీ రూ.14,000 కోట్ల మోసంలో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

గతేడాది రూ.7,029 కోట్లకుపైగా రికవరీ కోసం డీఆర్టీని పీఎన్‌బీ ఆశ్రయించింది. ఆ తర్వాత ఓబీసీ, బీవోబీ, బీవోఐ, యూకో, కార్పొరేషన్, యునైటెడ్, బీవోఎం తదితర బ్యాంకులూ రూ.232 కోట్ల రికవరీ దావా దాఖలు చేశాయి. దీంతో నిరుడు జూన్ 30 నుంచి 14.30 శాతం వార్షిక వడ్డీతో ఈ మొత్తాలను చెల్లించాలని నీరవ్, ఇతరులను డీఆర్టీ ఆదేశించింది.