ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు సంబంధించి మరో మోసం బయటపడింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ స్కాం తర్వాత అయిదేళ్లకు మరో ఫ్రాడ్ వెలుగు చూసింది. 

నీర‌వ్ మోదీ-మెహుల్ చౌక్సీ స్కాం త‌ర్వాత ఐదేండ్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్‌బీ) లో మరో ఫ్రాడ్ బ‌య‌టప‌డింది. ఐఎల్&ఎఫ్ఎస్ ద్వారా త‌మిళ‌నాడు ప‌వ‌ర్ కంపెనీ తీసుకున్న రూ.2,060.14 కోట్ల రుణం మొండి బ‌కాయిగా మారింది. ఇది లార్జ్ కార్పొరేట్ బ్యాంక్ ఢిల్లీ శాఖ‌లో వెలుగు చూసింది. క్యాపిట‌ల్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ సెబీ గైడ్‌లైన్స్ ప్ర‌కారం మంగ‌ళ‌వారం రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో వెల్ల‌డించింది. పంజాబ్ & సింధ్ బ్యాంక్ త‌ర్వాత ఐఎల్&ఎఫ్ఎస్ త‌మిళ‌నాడు ప‌వ‌ర్ కంపెనీ రుణాల‌ను మొండి బ‌కాయిగా ప్ర‌క‌టించిన బ్యాంక్‌గా.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ నిలిచింది.

2018లో ప‌లు సంస్థ‌ల‌కు నిధులు స‌మ‌కూర్చిన బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్ (ఐఎల్&ఎఫ్ఎస్‌).. డిఫాల్ట్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది. ఐఎల్&ఎఫ్ఎస్ రుణాలు రూ.94 వేల‌కోట్ల‌ని అప్ప‌ట్లో అంచ‌నా వేశారు. డిఫాల్ట్ సంక్షోభం నుంచి ఐఎల్&ఎఫ్ఎస్ బ‌య‌ట‌ప‌డవేసేందుకు కేంద్రం 2018 అక్టోబ‌ర్‌లో పాత బోర్డును ర‌ద్దు చేసి.. కొత్త బోర్డును ఏర్పాటు చేసింది. కొట‌క్ మ‌హీంద్రా బ్యాంకుకు చెందిన ఉద‌య్ కొట‌క్‌, టెక్ మ‌హీంద్రా ప్ర‌తినిధి వినీత్ న‌య్య‌ర్‌, సెబీ మాజీ చీఫ్ జీఎన్ బాజ్‌పాయ్‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మ‌న్ జీసీ చ‌తుర్వేది, మాజీ ఐఏఎస్ అధికారులు మాలినీ శంక‌ర్‌, నంద్ కిశోర్‌ల‌తో కొత్త క‌మిటీని నియ‌మించింది.

అంతకుముందు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఫిబ్రవరి 15వ తేదీన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్‌ను బ్యాడ్ అసెట్‌గా ప్రకటించింది. రూ.148 కోట్ల రుణాలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్.. తమిళనాడులోని కడలూరులోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అమలు కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేయబడిన స్పెషల్ పర్పస్ వెహికల్.