న్యూఢిల్లీ: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం భారీగానే కనిపిస్తున్నది. బ్యాంక్ పెద్దలు, హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు కుమ్మక్కయ్యారు. వేల కోట్లు దండుకున్నట్లు తెలుస్తున్నది. 11 ఏళ్లుగా జరిగిన ఈ బాగోతంపై సోమవారం ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు

బ్యాంక్‌కు 2008 నుంచి రూ.4,355.46 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఫిర్యాదు ఆధారంగా ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఇందులో బ్యాంక్ మాజీ చైర్మన్ వార్యం సింగ్, ఎండీ జాయ్ థామస్, ఇతర సీనియర్ అధికారులు, హెచ్‌డీఐఎల్ డైరెక్టర్ వాధవాన్‌ పేర్లు ఉన్నాయి.

ఐపీసీ సెక్షన్ 409 (ద్రోహం), 420 (చీటింగ్), 465, 466, 471 (ఫోర్జరీ) 120-బీ (నేరపూరిత కుట్ర)ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. నకిలీ ఖాతాలను సృష్టించి అక్రమాలకు బ్యాంకు వర్గాలు తెర లేపాయి

నకిలీ నివేదికలతో ఆర్బీఐని కూడా ఏమార్చాలని పీఎంసీ బ్యాంకు యాజమాన్యం చూసిందని ఆర్బీఐ పరిశీలనతోనే వెలుగులోకి వచ్చింది. కాగా, పీఎంసీ సంక్షోభానికి కారణమైన హెడీఐఎల్.. బ్యాంక్‌కు రూ.6,500 కోట్లు బకాయి పడింది.

బ్యాంక్ మొత్తం రూ. 8,880 కోట్ల రుణాల్లో ఇది 73 శాతానికి సమానం కావడం గమనార్హం. గత 2-3 ఏళ్లుగా హెచ్‌డీఐఎల్.. ఈ రుణాలను చెల్లించడం లేదని ఇప్పటికే బ్యాంక్ మాజీ ఎండీ థామస్ చెప్పిన విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలకు రెట్టింపు స్థాయిలో ఆస్తులను పూచీకత్తు పెట్టినందుకే హెచ్‌డీఐఎల్ రుణాల విషయాన్ని ఆర్బీఐకి చెప్పలేదని థామస్ సమర్థించుకున్నారు.

పీఎంసీ బ్యాంక్ భందూప్ శాఖ కేంద్రంగా ఈ కుంభకోణం నడిచింది. బ్యాంక్ యాజమాన్యంతో చేతులు కలిపిన హెచ్‌డీఐఎల్ ప్రమోటర్లు పెద్ద ఎత్తున రుణాలు పొందినట్లు పోలీసులు చెబుతున్నారు. తీసుకున్న రుణాలను చెల్లించకున్నా వాటిని మొండి బకాయిలుగా పేర్కొనకుండా, ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టారని స్పష్టం చేశారు.

ఆర్బీఐకి కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారని ఓ అధికారిక ప్రకటనలో పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసు విచారణ కోసం ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కూడా ఏర్పాటైంది.

సమగ్ర విచారణలో భాగంగా సిట్ దర్యాప్తునకు ముంబై ఆర్థిక నేరాల విభాగం సిద్ధమైంది. 137 శాఖలున్న పీఎంసీలో రూ.11 వేల కోట్లకుపైగా డిపాజిట్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఆర్బీఐ ఆంక్షలను సవాల్ చేస్తూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

బ్యాంక్‌లో డిపాజిట్లు, ఖాతాలున్న ఎనిమిది మంది, మరో ముంబై ఆధారిత ఎన్జీవో దీన్ని దాఖలు చేశాయి. ఇదిలా ఉంటే పీఎంసీ వ్యవహారాన్ని ఆర్బీఐ అన్ని కోణాల్లో పర్యవేక్షిస్తున్నదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.

పీఎంసీ బ్యాంక్ బోర్డును ఆర్బీఐ రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కస్టమర్ల కోసం ఓ టోల్-ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసింది. బ్యాంక్‌లో పరిణామాల నేపథ్యంలో ఖాతాదారులు ఆందోళనకు గురికాకుండా వారి సమస్యలు, సందేహాలను తీర్చేందుకు 1800223 993 అనే టోల్-ఫ్రీ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

నిబంధనల ఉల్లంఘన, నియంత్రణ లోపాలతో సెప్టెంబర్ 24న ఆర్బీఐ.. పీఎంసీపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రుణాల మంజూరు, పెట్టుబడులు, డిపాజిట్ల సేకరణ వంటి వాటిపై నిషేధం విధించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2017-18)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బ్యాంక్ మొండి బకాయిలు ఏకంగా రెండింతలకుపైగా పెరిగాయి.

బ్యాంకు మొండి బాకీలు 1.05 శాతం నుంచి 2.19 శాతానికి ఎగబాకాయి. దీంతోనే ఆర్బీఐ అప్రమత్తమైంది. ఇప్పటికే ఆ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ థామస్‌ను సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో పర్యవేక్షకుడిగా జేబీ భోరియాను నియమించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పుడు మొత్తం బోర్డునే రద్దు చేసి బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నది.