ప్రస్తుతం దేశీయంగా కరోనా వ్యాప్తిస్తున్న తరుణంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రి ఉత్పత్తితో పాటు సరఫరాకు యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో ఔషధాల తయారీకి సుమారు రూ.14వేల కోట్లు విలువైన రెండు పథకాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఔషధ పరిశ్రమ వర్గాలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై చర్చించారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మందులు, ఔషధ సామగ్రిని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు కృషి చేయాలని ఫార్మా సంస్థలకు సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందుకోసం రూ.14వేల కోట్ల విలువైన రెండు పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.కొవిడ్​-19 వైరస్​ వ్యాప్తిపై ఔషధ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు. కరోనా కోసం యుద్ధ ప్రాతిపదికన ఆర్​ఎన్​ఏ పరీక్ష కిట్ల తయారీకి కృషి చేయాలని పరిశ్రమ ప్రతినిధులను కోరారు.

‘అవసరమైన మందులు, సామగ్రి సరఫరా చేయటంతోపాటు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలి. దేశంలో ఫార్మాస్యూటిక్ రంగానికి అవసరమైన ఔషధాల నిర్వహణ, తయారీ, సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. క్లిష్టమైన ఔషధాలు, వైద్య పరికరాలు దేశంలోనే తయారు చేసేందుకు ప్రభుత్వం రూ.10వేల కోట్లు, రూ.4000 కోట్ల విలువైన రెండు పథకాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

‘అవసరమైన ఔషధాల సరఫరాను పెంచుతూనే బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడం అత్యవసరం. అందుకు తగిన విధంగా కృషి చేయాలి. కోవిడ్‌-19 సవాలును ఎదుర్కోవడంలో ఫార్మా ఉత్పత్తి, పంపిణీదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఔషధ చిల్లర వ్యాపారులు, విక్రేతలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ప్రస్తుత అత్యవసర తరుణంలో ఔషధ పరిశ్రమ నిరంతరం పనిచేయడం ముఖ్యమని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ రంగంలో శ్రామిక శక్తి కొరత లేకుండా చూడాలని వెల్లడించారు. 

ఫార్మసీల్లో సామాజిక దూరాన్ని పాటించేందుకు హోం-డెలివరీ మోడల్‌ను అనుమతించేందుకు మార్గాలు అన్వేషించాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. వైరస్ వ్యాప్తి నివారణకు డిజిటల్ చెల్లింపు విధానాల వాడకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.

అవసరమైన మందులు, పరికరాల సరఫరాను నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని, టీకాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని ఫార్మా ప్రతినిధులు మోదీకి వివరించారు. ఫార్మా రంగానికి ప్రభుత్వ విధాన ప్రకటనలు భారీ ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాయని తెలిపారు.

మరోవైపు శనివారం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థల కోసం ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాదాపు రూ.48వేల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపింది.  ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల తయారీకి ఊతమివ్వడానికి రూ.40,995 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నది కేంద్ర ప్రభుత్వం. రాబోయే ఐదేళ్ల ఈ మేరకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను అందిస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తర్వాత మీడియాతో అన్నారు.

ఎలక్ట్రానిక్ సంస్థల అమ్మకాలు పెరిగేలా, పెట్టుబడులు పుంజుకునేలా ఈ ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి రవిశంకర్ ప్రసాద్ వివరించారు. తమ ఈ నిర్ణయంతో 2025 కల్లా తయారీ రంగ ఆదాయ సామర్థ్యం రూ.10 లక్షల కోట్లకు చేరవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభించగలదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కొత్త కోణాల్లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌గా భారత్‌ను మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్ల కోసం రూ. 3,762.25 కోట్ల ప్రోత్సా హకాలకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహకాలు పెట్టుబడు లకు ఊతమిస్తాయని ఎలక్ట్రానిక్‌ తయారీదార్ల సంఘం కొనియాడింది. 

ఇక దేశీయంగా మెడికల్‌ డివైజ్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రూ. 13,760 కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, క్యాబినెట్‌ దీనికి ఆమోదం తెలిపింది. రూ.400 కోట్లతో మెడికల్‌ డివైజ్‌ పార్కుల పథకాన్ని కూడా తెస్తున్నది. తద్వారా రాబోయే ఐదేళ్లలో అదనంగా దాదాపు 34వేల ఉద్యోగాలను సృష్టించగలమని, మెడికల్‌ డివైజ్‌ల దిగుమతులనూ తగ్గిస్తామని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ తెలిపారు.